మరో 36 గంటలు ఇలాగే...
సాక్షి నెట్‌వర్క్: వచ్చే 36 గంటల్లో తెలంగాణతోపాటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడనంవల్ల తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వచ్చే 36 గంటల్లో తెలంగాణతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతమున్న అల్పపీడనం క్రమంగా తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా కదలి మరో 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం అత్యధికంగా ధర్మపురిలో 14.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 1.7 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు బేగంపేటలోని వాతావరణశాఖ ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుంచి 27 డిగ్రీలకు పడిపోయింది.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 6.5 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యింది. మెదక్ జిల్లాలో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవగా మెదక్‌లో అత్యధికంగా 5.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు సింగరేణిలో సుమారు లక్ష టన్నుల మేరకు బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. గురువారం 1.70 లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాల్సి ఉండగా, కేవలం 1.19 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా కలిదిండిలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా డి.హిరేహాల్ మండలంలో 6.2 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.
రాష్ర్టంలో భారీ వర్షాలు
Published Sat, May 10 2014 2:00 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement