వానలే వానలు | Rainy season of low depression | Sakshi
Sakshi News home page

వానలే వానలు

Published Mon, Jun 22 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

వానలే వానలు

వానలే వానలు

* రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
* జల దిగ్బంధంలో  వందలాది గ్రామాలు
* వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కుండపోత
* కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరుగా
..
* ఏటూరునాగారం, వాజేడులో 21 సెం.మీ. అత్యధిక వర్షపాతం
* ఖమ్మం జిల్లాలో వరదలో చిక్కుకొని ఇద్దరు బాలికల మృతి
* మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

 
సాక్షి, నెట్‌వర్క్: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని పూరీ-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటడం, దానికితోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆదివారం తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తగా కరీంనగర్, రంగారెడ్డి సహా ఇతర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వివిధ జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
 
వరంగల్ జిల్లాలో 27 చెరువులకు గండ్లు..
వరంగల్ జిల్లావ్యాప్తంగా 51 మండలాల్లో ఆదివారం 10.09 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారంలో అత్యధికంగా 21.12 సెం.మీ. వర్షం కురిసింది. జూన్‌లో ఇప్పటివరకు మొత్తం 13.72 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్యప్రణాళికాధికారి బీఆర్.రావు వివరించారు. భారీ వర్షాలతో జిల్లాలో 27 చెరువులకు గండ్లు పడ్డారుు. ఏటూరునాగారం ఏజెన్సీలో 8 గ్రామాలు, చిట్యాల మండలంలో చలివాగు ఉధృతితో 4 గ్రామా లు, గణపురం మండలంలో మోరంచవాగు ఉప్పొంగడం తో 15 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారుు. ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద నీటిమట్టం 78 మీట ర్ల వరకు చేరుకుంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 7.50 మీటర్లకు చేరింది. గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీలోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్లాంటు రెండో దశ పనులకు ఆటంకం ఏర్పడింది.
 
భద్రాచలంలో 31.1 అడుగులకు గోదావరి...

భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా తడిసి ముద్దవుతోంది. జిల్లాలోని వాజేడులో ఆదివారం 21 సెం.మీ., వెంకటాపురం, చర్ల, ముల్కలపల్లి, ఇల్లెందులో 15 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. వాజేడు మండలల్లోని చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల కేంద్రం నుంచి చీకుపల్లి వాగు అవతల ఉన్న 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31.1 అడుగులకు చేరుకుంది. టేకులపల్లి మండలంలోని కోయగూడెం పంచాయతీ కొండంగుల బోడు గ్రామానికి చెందిన సునీత (7)  అంజలి (12) అనే బాలికలు ఓ కల్వర్టు వద్ద కాలు జారి వరదనీటిలో కొట్టుకుపోయి మృతిచెందారు. జాలిముడి ప్రాజెక్టు సమీపంలో కరకట్టకు గండి పడటంతో వరద మధ్య ఉన్న పాకల్లో విద్యుత్‌శాఖ సిబ్బంది చిక్కుకుపోయూరు. పోలీసులు వారిని కాపాడారు.
 
 కరీంనగర్‌లో ఓ మోస్తరుగా...
 కరీంనగర్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 6.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మహదేవపూర్ మండలంలో 13.6 సెం.మీ. వర్షం కురిసింది. మహదేవపూర్, మహాముత్తారం మండలాలోని 17 అటవీగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు చేరడంతో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, శంషాబాద్, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షాలతో కంది, పెసర, మినుము, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 58 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 1.38 సెం.మీ.గా నమోదైంది.  
 
 మరో 48 గంటలపాటు కుండపోత
 రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు.
 
 అయ్యో రామలింగేశ్వరా..

 వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయం పైకప్పు నుంచి వర్షపు నీరు ధారాల్లాగా కురుస్తుండడంతో ఆలయం లోపలి భాగం చిత్తడిగా మారింది. దీంతో అధికారులు ఆలయం పైకప్పుపై పరదా కప్పి చేతులు దులుపుకున్నారు. ఆలయ పైకప్పును పునరుద్ధరించేందుకు రూ.15 లక్షలతో గత ఫిబ్రవరిలో పనులు చేపట్టారు. మూడు నెలలపాటు పనులను చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఈ దుస్థితి నెలకొంది.
 
 ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తిన వాన
ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆదిలాబాద్ జిల్లా జలమయమైంది. జిల్లాలో సగటున 8.48 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వేమనపల్లిలో అత్యధికంగా 20.86 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 15 మండలాల్లో 10 సెం.మీ.పైగా వర్షం కురవగా 27 మండలాల్లో 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సుమారు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాగులు ఉప్పొంగడంతో 151కిపైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జైపూర్ మండలం మిట్టపల్లి, చెన్నూరు మండల పరిధిలోని సుద్దాల, కత్తర శాల, నారాయణపూర్, అక్కెపల్లి, సంకారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆసిఫాబాద్ మండలం కొమురంభీం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తివేశారు. రెబ్బెనలో 50 ఎకరాల్లో పత్తి విత్తనాలు వరదల్లో కొట్టుకుపోగా, 30 ఎకరాల్లో పత్తి మొలకలు దెబ్బతిన్నాయి. కైరిగూడ, డొర్లి-1, డొర్లి-2 ఓపెన్‌కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సుమారు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.
 
 పెన్‌గంగలో స్మగ్లర్ల సాహసం..!
ఆదిలాబాద్ జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్ గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా, దేశీదారు స్మగ్లర్లు సాహసమే చేశారు. మహారాష్ట్ర నుంచి అక్రమంగా లారీ ట్యూబ్‌పై దేశీదారును పెన్‌గంగలో తరలించారు. ముగ్గురు స్మగ్లర్లు దేశీదారును పెన్‌గంగ దాటిస్తూ ‘సాక్షి’ కెమెరాకు చిక్కారు.     - ఆదిలాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement