తహసీల్దార్‌ను అడ్డుకుంటున్న రైతులు
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన
- వ్యాపారిని పట్టుకుని వదిలిపెట్టిన అధికారులు
వెల్దుర్తి: పట్టణ పరిసరాల్లో అక్రమంగా బండలను బ్లాస్టింగ్ చేస్తున్న ఓ వ్యాపారిని మంగళవారం అడ్డుకుని, స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. మాసాయిపేటకు చెందిన ముద్దంగుల వీరేశం కడీలు, ధ్వజ స్తంభాల వ్యాపారం చేస్తుంటారు. ఎక్కడ ప్రభుత్వ బండలు కనిపిస్తే అక్కడకు చేరుకొని తన వ్యాపారాన్ని కొనసాగిస్తారు.
అదే తరహాలో వెల్దుర్తి పరిసరల్లోని చర్లపల్లికి వెళ్లే దారి పక్కన రాతి కడీల కోసం అక్రమంగా పేలుళ్లు జరుపుతున్నారు. పరిసర ప్రాంతంలో వ్యవసాయ చేనుకునే రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే మంగళవారం సదరు వ్యాపారీ రాతీ కడీలను ఇతర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా గమనించి తహసీల్ కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు.
అప్పుడే తహసీల్దార్ అన్వర్ రాగా అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలుపగా , రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన వీఆర్‌వోను విచారణకు ఆదేశించారు. ఘటన స్థలానికి వెళ్లిన వీఆర్‌వో అక్కడే ఉన్న వ్యాపారీ ఉపయోగించే వాహనంలో సామాగ్రి ఉండడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించి, వాహనంతో పాటు వ్యాపారీపై కేసునమోదు చేయనున్నట్లు తెలిపారు.
సాయంత్రం సమయంలో వాహనాన్ని వదిలిపెట్టడమే కాకుండా, ఎలాంటి కేసును నమోదు చేయలేదు. అక్రమ పేలుళ్లతో తమ బోరుబావులు ధ్వంసం అయితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. వ్యాపారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాహనంతో పాటు అతనిని వదిలిపెట్టడంపై రెవెన్యూ అధికారుల తీరును రైతులు తప్పుబట్టారు.