చెట్లనీడలో భోజనాలు చేస్తున్న విద్యార్థులు
- ‘మొక్క’వోని దీక్షతో కంటికి రెప్పలా సంరక్షణ
- నిత్యం హెచ్‌ఎం పర్యవేక్షణ
- పాఠశాలలో గత ఏడాది వంద..
- సెప్టెంబర్ 3న మొక్కల పుట్టిన రోజుకు సన్నద్ధం
వెల్దుర్తి: మారుమూల గ్రామంలోని ఓ పాఠశాల అది.. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో హరితమయమైంది.. వినోదానికి వేదికైంది.. వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని శేరి గ్రామంలోని పాఠశాల.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత సంవత్సరం విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు.
కంటికి రెప్పలా పెంచి పెద్దచేశారు. నేడు ఆ మొక్కలు పెరిగి పెద్ద అయ్యాయి. చెట్ల చల్లని నీడలో కూర్చొని విద్యార్థులు భోజనాలు చేస్తూ ఆనందంగా చిందులేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం అరికెల వెంకటేశ్ ఆధ్వర్యంలో గత ఏడాది సెప్టెంబర్ 3న హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో వంద మొక్కలను నాటారు.
వాటిలో 93 మొక్కలు పెరిగి చెట్లుగా ఎదిగి విద్యార్థులకు చల్లని నీడను ఇస్తున్నాయి. ఈ నెలలో మరో 40 మొక్కలు నాటినట్టు హెచ్‌ఎం తెలిపారు. వాటిని సైతం కంటికి రెప్పలా కాపాడుతున్నామన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది నాటిన మొక్కలకు సెప్టెంబర్ 3న పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు.