చదువుకు స్వస్తి వంటకోసం కుస్తీ
వెల్దుర్తి : ఉన్న ఊరిని, తల్లిదండ్రులను వదిలి చదువుకునేందుకు వచ్చిన ఆ విద్యార్థినులకు ఆదిలోనే ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా చదువులు పక్కన పెట్టి వంట చేసుకోవాల్సిన పరిస్థితి మండల కేంద్రమైన వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో దాపురించింది. ఇక్కడి బాలికలు చదువులను పక్కనపెట్టి వంట కార్మికుల అవతారం ఎత్తుతున్నారు.
పాఠశాలలో ఆరు నుంచి పది వరకు ఉన్న తరగతుల్లో 163 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో ప్రత్యేకాధికారి లేకపోవడంతో ఉపాధ్యాయులే విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి వంట సిబ్బంది లేక స్వీపర్లు, అటెండర్లే వంట చేస్తున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు బాలికలకు అల్పాహారం ఇవ్వాల్సి ఉండగా వంట సిబ్బంది లేకపోవడంతో బాలికలే వంటపనిలో నిమగ్నమయ్యారు.
ఆకలి వేయడంతో వంట చేయక తప్పడంలేదని బాలికలు చెబుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో సమయానికి కంటే రెండు గంటల ఆలస్యంగా భోజనాలు చేస్తున్నామని, అదికూడా తాము వంట పనికి సహకరిస్తే భోజనం దొరుకుతోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వంట సిబ్బందిని ఏర్పాటు చేసి సమయానికి భోజనం అందించే ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. తమ చదువులను పక్కన పెట్టి ఇలాగే వంట పనులు చేస్తే ఇక తాము ఎప్పుడు చదువుకోవాలని ఇంటికెళ్లి పోతామని వారు హెచ్చరిస్తున్నారు.