సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌!  | Buggana Rajendranath Reddy Comments On CPS And GPS | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌! 

Published Tue, Apr 26 2022 3:27 AM | Last Updated on Tue, Apr 26 2022 12:34 PM

Buggana Rajendranath Reddy Comments On CPS And GPS - Sakshi

ఉద్యోగ సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల, సీఎస్‌ సమీర్‌ శర్మ, సమావేశానికి హాజరైన ఉద్యోగ సంఘాల నాయకులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్రంలో గ్యారెంటీ పెన్షన్‌ పథకాన్ని (జీపీఎస్‌–గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం) అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ ప్రతిపాదనను  పూర్తిగా పరిశీలించి తగు సూచనలు, సలహాలిస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తద్వారా ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసేలా దీనిని రూపొందిస్తామని చెప్పారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ సోమవారం వెలగపూడి సచివాలయంలో ఆ సంఘాల నాయకులతో సమావేశమైంది. కమిటీ సభ్యుడిగా రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత ప్రభుత్వోద్యోగులకు సాధ్యమైనంత మేర మేలుచేసే ఆలోచనతో సీఎం జగన్‌ ఉన్నారని తెలిపారు. అయితే, పాత పింఛను పథకం (ఓపీఎస్‌) అమలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సవాలుగా పరిణమించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌ తరాల ప్రభుత్వోద్యోగులు, ప్రజల సంక్షేమం దృష్ట్యా పాత పింఛన్‌ పథకం అమలు దుస్సాధ్యమైన అంశంగా ఉందని చెప్పారు. 

భద్రత కల్పించాలన్నదే ప్రధాన లక్ష్యం: సజ్జల
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సాధ్యమైనంత మేర ఆర్థిక భద్రత కల్పించే విధంగా పింఛను పథకాన్ని రూపొందించి అమలుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు సాధ్యమైన మేర భద్రత కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. పాత పింఛను పథకం, కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) రెండింటినీ సమన్వయం చేస్తూ మధ్యే మార్గంగా గ్యారంటీడ్‌ పెన్షన్‌ పథకాన్ని (జీపీఎస్‌) అమలుచేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వోద్యోగుల భద్రత దృష్ట్యా మంచి పింఛన్‌ పథకాన్ని రూపొందించేందుకు అవసరమైన సూచనలు, సలహాలను ఇవ్వాలని ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కోరారు. వాటిని కూడా సాధ్యమైనంత మేర పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులకు మంచి పింఛన్‌ పథకాన్ని రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

తొలుత ఆర్థిక శాఖ కార్యదర్శి గుల్జార్‌ సీపీఎస్‌ అంచనాలను ఎందుకు సంస్కరించాలి, పెన్షన్‌ సంస్కరణ సవాళ్లు, పాత పెన్షన్‌ పథకం అమలులో ఆర్థిక సుస్థిరత పరిశీలన, నూతనంగా ప్రతిపాదించే ఏపీ హామీ పింఛను పథకం వివరాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, జేఏడీ సర్వీసెస్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల తరఫున ఎన్జీఓ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సెక్రటేరియట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, పీఆర్‌టీయూ అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య, యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు, ఏíపీటీఎఫ్‌ అధ్యక్షుడు జి. హృదయరాజు తదితరులు పాల్గొన్నారు.

జీపీఎస్‌ అంటే..
సీపీఎస్‌ (కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) విధానంలో పదవీ విరమణ చేసిన నెల బేసిక్‌ పే పైన ఎంత పెన్షన్‌ వస్తుందనేది కచ్చితంగా తెలీదు. అదే జీపీఎస్‌ కింద కచ్చితంగా 33 శాతం పెన్షన్‌ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. పాత పెన్షన్‌ విధానంలో 50 శాతం పెన్షన్‌ వచ్చేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు అది రద్దయి సీపీఎస్‌ అమల్లోకి వచ్చింది. దీంతో సీపీఎస్‌ కంటే మెరుగ్గా ఉంటుంది. చివరి నెల జీతంలో 33 శాతం పెన్షన్‌ వచ్చేలా ప్రభుత్వం జీపీఎస్‌కు రూపకల్పన చేసింది. 

త్వరలోనే స్పష్టత: మంత్రి బొత్స
నెల్లిమర్ల రూరల్‌: సీపీఎస్‌పై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం కోదండ రామస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సోమవారం ఇక్కడకు విచ్చేసిన మంత్రి సీపీఎస్‌ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ప్రతి అంశాన్ని అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం ఇంటిని ముట్టడించడం భావ్యం కాదన్నారు. ఉద్యమంలో జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని బొత్స ప్రశ్నించారు. ఇక సెలవుల రద్దుపై ఉపాధ్యాయులెవరూ స్పందించలేదని, వాళ్లకి లేని బాధ ప్రతిపక్షాలకు ఎందుకని బొత్స మండిపడ్డారు.

మంత్రులతో కమిటీ
కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను పరిశీలించడంతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్‌ని కమిటీలో సభ్య కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీ సీపీఎస్‌ను పరిశీలించడంతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సీపీఎస్‌పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అవసరమైన సిఫార్సులను చేయాల్సిందిగా సీఎస్‌ ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. 

సీపీఎస్‌ కంటే జీపీఎస్‌ మెరుగైంది
సీపీఎస్‌ స్థానంలో ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ మెరుగైందని భావిస్తున్నాం. సీపీఎస్‌ వల్ల ఉద్యోగికి ఎంత పెన్షన్‌ రిటర్న్‌ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఉద్యోగి రిటైరైనప్పుడు బేసిక్‌ పేలో 33 శాతం గ్యారెంటీ పెన్షన్‌ ఇచ్చేలా ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. రాబోయే తరాలకు జీపీఎస్‌ ఇవ్వండి తప్ప ప్రస్తుత ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీం అమలుచేయాలని కోరాం. సీపీఎస్‌వల్ల లాంగ్‌ టర్మ్‌లో ప్రభుత్వంపై పెను భారం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అదే జీపీఎస్‌వల్ల ప్రభుత్వంపై పడే భారం తగ్గుతూ ఉద్యోగికి అదనపు ప్రయోజనం జరుగుతుందని చెబుతోంది. 
– వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

పాత పెన్షన్‌ విధానమే కావాలన్నాం 
సీపీఎస్‌ బదులు జీపీఎస్‌ను ప్రతి పాదించారు. దీనిపై అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పాం. జీపీఎస్‌ పేరిట కొత్త స్కీం ఆమోద యోగ్యం కాదని చెప్పాం. ప్రభుత్వం ఏదో ఒకటి చేసి జీపీఎస్‌ పెట్టాలని చూస్తోంది. మేం జీపీఎస్‌కు ఒప్పుకోం. సీపీఎస్‌ రద్దుచేయాలి. 
– బండి శ్రీనివాస్, ఎపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు

జీపీఎస్‌ను ఆమోదించం
ప్రస్తుతమున్న సీపీఎస్‌ విధానం 1.9.2004 తర్వాత చేరిన వారికి ఇబ్బందిగా ఉంది. జీపీఎస్‌పై మా అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం కోరింది. స్టేట్‌ ఫండ్‌ ఏర్పాటుచేసి ఫండ్‌ చెల్లిస్తామని గతంలో టక్కర్‌ కమిటీ చెప్పినా మేం అంగీకరించలేదు. సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని కోరాం. జీపీఎస్‌ను ఆమోదించేది లేదని చెప్పాం. పాత పెన్షన్‌ విధానానికే మేం కట్టుబడి ఉన్నాం. పీఆ ర్సీపై జీఓలు ఇవ్వకపోవడంవల్ల ఉ ద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 
– బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

జీపీఎస్‌ను తిరస్కరించాం 
పాత పెన్షన్‌ విధానం స్థిరమైంది కాదని ప్రభుత్వం చెబుతోంది. 33 శాతం ప్రొటెక్షన్‌తో జీపీఎస్‌ తీసుకువస్తామంది. సీపీఎస్‌లో ఉద్యోగికి 9 శాతం ప్రొటెక్షన్‌ వస్తుండగా దీన్ని 33 శాతం ప్రొటెక్షన్‌ ఇస్తామంటోంది. కానీ, జీపీఎస్‌ స్కీంను తిరస్కరించాం. 
– సూర్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement