సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 560 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బూసి రెడ్డి నరేంద్ర రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో ఆస్పత్రి నిర్వహణ చాలా కష్టతరంగా ఉండేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 650 కోట్ల రూపాయల బకాయిలను తీర్చడం వల్ల కష్టాల నుంచి బయటపడ్డమని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఆరోగ్య శ్రీ ఆసుపత్రిలు ఉన్నాయని గుర్తుచేశారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ స్పందించి తగిన నిధులు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ కోవిడ్ బాధితులకు సేవలు అందిస్తామని చెప్పారు. గతంలో పనిచేసినా నిధులు సరిపడా అందలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో రెండు వారాల్లోనే నిధులు అందుతున్నాయని తెలిపారు.
సోమవారం విజయవాడలో బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్య శ్రీ సేవలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. ఆరోగ్య శ్రీ కింద మరిన్ని సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నాం. కోవిడ్ పేషెంట్‌లకు కూడా ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నాం. కరోనా పై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. స్వల్ప లక్షణాలు ఉంటే హోం క్వారంటైన్‌లోనే ఉండాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రికి రావాలి. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు ఉన్నాయనే సమాచారం ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
రాష్ట్రంలో కరోనా డెత్ రేట్ చాలా తక్కువుగా ఉంది. జిల్లా కలెక్టర్ ద్వారానే ఆసుపత్రిలలో ఆరోగ్య శ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రజలు కూడా కోవిడ్ పై భయాలు పెట్టుకోకుండా అవగాహన పెంచుకోవాలి. దేశంలోనే ఏపీలో కోవిడ్ రోగులకు మంచి వైద్యం అందుతుంది. ఏ జిల్లాలో ఎటువంటి సాయం కావాలన్నా ఆరోగ్యశ్రీ అధికారులను సంప్రదించవచ్చు.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment