AP: రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గుదల | CAG Report On AP Financial Situation | Sakshi
Sakshi News home page

AP: రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గుదల

Published Sat, Nov 27 2021 8:15 AM | Last Updated on Sat, Nov 27 2021 8:16 AM

CAG Report On AP Financial Situation - Sakshi

సాక్షి, అమరావతి: ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రాబడి తగ్గిపోవడం, మరోపక్క కొత్త సంక్షేమ పథకాల అమలుతో 2019–20లో రెవెన్యూ వ్యయం 6.93 శాతం మేర పెరిగిందని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక వెల్లడించింది. తప్పనిసరి ఖర్చులైన ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపులు, వడ్డీ చెల్లింపుల వ్యయం అంతకు ముందు ఆర్ధిక ఏడాదితో పోలిస్తే పెరిగాయి. 2019–20 ఆర్ధిక ఏడాదికి సంబంధించి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై కాగ్‌  నివేదికను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది.

సంక్షేమానికి భారీగా వ్యయం
అమ్మఒడి, వైఎస్సార్‌ ఉచిత విద్యుత్, వైఎస్సార్‌ భరోసా పథకాల అమలుతో రెవెన్యూ వ్యయం పెరిగిందని కాగ్‌ నివేదిక పేర్కొంది. పంచాయతీలను పరిపుష్టం చేయడం, పారదర్శకంగా ఇంటివద్దే ప్రభుత్వ సేవలను అందించడంలో భాగంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టడంతో రెవెన్యూ వ్యయం పెరిగిందని తెలిపింది. అయితే అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2019–20లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వెనుకబడిన వర్గాల సంక్షేమ వ్యయం భారీగా పెరిగిందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. సాధారణ విద్య, విద్యుత్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు కూడా భారీ వ్యయం చేసినట్లు తెలిపింది. బడ్జెట్‌ బయట అప్పులు 2014–15 నుంచి తెస్తున్నా బడ్జెట్‌లో చూపడం లేదని, దీన్ని సరి చేయాలని అప్పట్లోనే సూచించినా పట్టించుకోలేదని పేర్కొంది.

కాగ్‌ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ...
2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 8.80 శాతం ఉండగా 2019–20లో 12.73 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ వృద్ధి రేటు 7.21 శాతం కన్నా ఇది బాగా ఎక్కువ.
2018–19లో 149.56 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2019–20లో 171.37 లక్షల టన్నులకు పెరగడంతో వ్యవసాయ రంగంలో 16.03 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఉద్యాన, పశు, మత్స్యశాఖల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది.
రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రూ.97,123.93 కోట్ల మేర రుణభారం ఉంది. 2020 మార్చి  నాటికి ఆ రుణం పెరిగి రూ.2,15,617 కోట్లకు చేరింది.
అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 2019–20లో రెవెన్యూ రాబడులు 3.17 శాతం తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర సొంత రాబడులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా బదిలీ రాబడులు తగ్గడం.
కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో 2019–20లో రెవెన్యూ ఖర్చులు 6.93 శాతం మేర పెరిగాయి. రెవెన్యూ లోటు 90.24 శాతం పెరిగింది.
సాధారణ కేటగిరీ రాష్ట్రాల సగటుతో పోలిస్తే తప్పనిసరి ఖర్చులైన వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, పరిపాలన ఖర్చులు ఏపీలో ఎక్కువ.
రాష్ట్ర సొంత పన్నుల రాబడి 0.74 శాతం తగ్గింది. సొంత పన్నేతర రాబడి 24.59 శాతం తగ్గింది
కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటా 13.86 శాతం తగ్గింది
కేంద్రం నుంచి పొందే గ్రాంట్లు 12.43 శాతం పెరిగాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement