ముగిసిన 3 రోజుల గజరాజుల గణన
కేంద్ర అటవీశాఖకు నివేదిక డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి
చిత్తూరు కార్పొరేషన్: చిత్తూరు జిల్లాలో 90 నుంచి 110 వరకు ఏనుగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని డీఎఫ్‌వో చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఏనుగుల గణన ప్రక్రియ శనివారంతో ముసిగింది. సర్వే వివరాలను డీఎఫ్‌వో సోమవారం మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 60కి పైగా బీట్ల నందు 150 మంది సిబ్బంది, సహాయకులు కలిసి సర్వే చేశారన్నారు. ప్రత్యక్షంగా 30కి పైగా ఏనుగులను గుర్తించారని, పరోక్షంగా 110 ఏనుగుల ఉన్నట్లు నమోదు చేశారని చెప్పారు. వీటిలో 15 వరకు చిన్న ఏనుగులు ఉన్నట్లు చెప్పారు.
దక్షిణ భారతదేశంలో ప్రతి ఏటా మే నెలలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకే సమయంలో సర్వే చేస్తారన్నారు. రాష్ట్రంలో 200 వరకు ఏనుగులు ఉంటే.. ఒక్క చిత్తూరు జిల్లాలో 100కు పైగా ఉన్నాయన్నారు. ప్రాథమిక నివేదికను కేంద్ర అటవీశాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా పలమనేరు, పుంగనూరు, కుప్పం ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ షాక్, వాహనాలు ఢీకొని ప్రతి ఏటా 10 వరకు ఏనుగులు మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. ఏనుగుల దాడిలో ఏడాదికి రూ.కోటి వరకు పంటలకు, ప్రజల ప్రాణాలకు నష్టపరిహారంగా చెల్లిస్తున్నట్లు వివరించారు. గజరాజుల దాడుల నివారణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment