దూకుడే..
స్కేటింగ్‌లో రాణిస్తున్న చైతన్య కుమార్
అనతి కాలంలోనే అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తింపు
ఏషియన్స్ గేమ్స్ లక్ష్యంగా సాధన చేస్తున్న టెన్త్ విద్యార్థి.
కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నిరూపించాడు ఓ విద్యార్థి. స్కేటింగ్‌పై మక్కువ పెంచుకోవడమే కాదు ఆ మేరకు సాధన చేసి దూసుకుపోతున్నాడు. అనతి కాలంలోనే అంతర్జాతీయ స్కేటింగ్ క్రీడాకారుడిగా నిలిచాడు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 26 మెడల్స్‌తోపాటు ఇతర పోటీల్లోనూ అనేక పతకాలు కైవసం చేసుకొని పలువురి మన్ననలు అందుకున్నాడు కోలా చైతన్య కుమార్. - శేరిలింగంపల్లి
భెల్ ఎంఐజీ కాలనీలో ఉండే కోలా శ్రీనివాస్ కుమారుడే కోలా చైతన్య కుమార్. మదీనగూడలోని జెనిసిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు. ఆరో తరగతిలో ఉన్నప్పుడే స్కేటింగ్‌పై శ్రద్ధ కనబరిచాడు. అతని ఆసక్తిని గమనించిన తండ్రి శ్రీనివాస్ భెల్ స్కేట్ నైన్ కోచ్ విఠలా వద్ద శిక్షణ ఇప్పించారు. అక్కడ శిక్షణ పొందిన కొద్ది కాలంలోనే పలు మెడల్స్ సాధించాడు.
నిత్యం ప్రాక్టీస్...
ఓవైపు చదువుతూనే మరోవైపు నిత్యం భెల్ లోని రింక్‌లో సాయంత్రం వేళ స్కేటింగ్ సాధన చేసేవాడు. ఇంటర్నేషనల్ స్కేటింగ్‌లో పాల్గొనేందుకు అవసరమైన బ్యాంక్ ట్రాక్ శేరిలింగంపల్లి ప్రాంతంలో అందుబాటులో లేకపోవడంతో నగరంలోని ఇందిరాపార్కుకు ప్రతి ఆదివారం ప్రాక్టీస్ కోసం వెళ్లేవాడు.
కోలా చైతన్యకుమార్ కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని చాంపియన్ షిప్ మెడల్ సాధించాడు. రాష్ర్ట, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు అందుకున్నాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ర్ట, జాతీయ స్థాయి పోటీల్లో, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 2011-12 కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు గోల్డ్ మెడల్స్.
► ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సిల్వర్ మెడల్
►2012-13లో వైజాగ్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయిలో 3 గోల్డ్ మెడల్స్
► 2011-12లో ఆర్ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయిలో రెండు గోల్డ్, ఒక బ్రాంజ్ మెడల్స్
► జాతీయ స్థాయిలో ఒక బ్రాంజ్ మెడల్
► 2012-13లో రాష్ట్ర స్థాయిలో సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్
► 2013-14లో రాష్ట్ర స్థాయిలో మూడు గోల్డ్ మెడల్స్
► జాతీయ స్థాయిలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్
► సీబీఎస్ఈ సౌత్‌జోన్ పోటీల్లో గోల్డ్ మెడల్
► సీబీఎస్ఈ జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్
► 2014 ఆర్ఎస్ఎఫ్ఐ రాష్ర్ట స్థాయి పోటీల్లో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించాడు
► బెల్జియంలో జరిగిన ప్లాండ ర్స్ గ్రాండ్ ఫిక్స్ షార్ట్ డిస్టెన్స్‌లో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్నాడు.
ప్రభుత్వ సహకారం అవసరం...
శేరిలింగంపల్లి ప్రాంతంలో బ్యాంక్‌ట్రాక్ లేకపోవడంతో ఇందిరాపార్కుకు తీసుకెళ్లడం ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన పని. ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు బ్యాంక్‌ట్రాక్ ప్రాక్టీస్ ఎంతో అవసరం. దాన్ని ఈ ప్రాంతంలో అందుబాటులోకి తేవాలి. స్కేటింగ్ క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే మరెంతో మంది రాణిస్తారు. మా అబ్బాయి చైతన్యకు స్కేటింగ్‌లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా మెడల్స్ రావడం వెనుక కోచ్ విఠలా కృషి ఎంతో ఉంది.
- కోలా శ్రీనివాస్ (చైతన్యకుమార్ తండ్రి)
ఏషియన్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం కోసం...
స్కేటింగ్‌లో ఏషియన్ గేమ్స్‌లో దేశం తరఫున పొల్గొనడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంటర్నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నా. తల్లిదండ్రులు, కోచ్ విఠలా, పాఠశాల యాజమాన్యం సహకారంతో పతకాలు సాధించగలిగా.
- కోలా చైతన్య కుమార్