విడతల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల జాబితాలు
తొలుత నాలుగు వారాల్లోపు ఎస్సీ కులాల జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన.. వాటిపై అభ్యంతరాల స్వీకరణ.. అనంతరం అధికారిక ప్రకటన
ఆ తర్వాత ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల వివరాలు విడుదల
అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాది క్రితం అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా చేపట్టిన కులగణన వివరాలను అధికారికంగా ప్రకటించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విడతల వారీగా ఈ జాబితాలను విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది జాబితాలను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి డోలా బాలవీరాంజనేయస్వావిుతోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో కులగణన ద్వారా సేకరించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల వారీగా రెండు, మూడు విడతల్లో విడుదల చేసే విషయంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొదట ఎస్సీ కేటగిరీ కులాల జాబితాలను విడుదల చేయాలని పేర్కొన్నారు.
ఇందుకోసం గతంలో కులగణన ద్వారా సేకరించిన ఎస్సీ కేటగిరీ కుటుంబాల వివరాలను వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత నాలుగు వారాల్లోగా సాంఘిక సంక్షేమ అధికారులు ఎస్సీ కేటగిరీలోని కులాల వారీగా జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు.
వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఆ తర్వాత తుది జాబితాను అధికారికంగా ప్రకటించాలని సూచించారు. అనంతరం ఇదేవిధంగా ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల జాబితాలను విడతల వారీగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
పంచాయతీకో సచివాలయం లేనట్టే!
పంచాయతీకి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. సచివాలయాల్లోని కొన్ని కేటగిరీల సిబ్బందిని ఆయా శాఖలకు పూర్తిగా బదిలీ చేసేందుకు సైతం ఆయన నిరాకరించారు. సచివాలయ వ్యవస్థపై ఇంకా మరింత అధ్యయనం చేసి మెరుగైన ప్రతిపాదనలతో నివేదికలు సిద్ధం చేయాలని, మరో నాలుగైదు రోజుల్లోనే మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పినట్లు తెలిసింది.
సచివాలయం స్థాయిలోనే పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు ఈ సమావేశంలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన కూడా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment