సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా దేశమంతా సిమెంట్ ధరలు పెరుగుతున్నా రాష్ట్రంలో తక్కువ ధరలకే కంపెనీలు సిమెంట్ సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, వివిధ అభివృద్ధి పనులకు సబ్సిడీ ధరకే సిమెంట్‌ను అందిస్తున్నాయి. రూ.390 సిమెంట్ బస్తాను రూ.235కే ఇస్తున్నాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా సిమెంట్ కంపెనీలకే మొత్తాన్ని చెల్లిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.970 కోట్లు వరకు ఆదా అయ్యింది.
ధరల్లో వ్యత్యాసమున్నా తక్కువ ధరకే..
దేశంలో గత రెండేళ్లలో ఇళ్ల నిర్మాణాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సిమెంట్ బస్తా ధర దేశమంతా దాదాపు రూ.400కు చేరుకుంది. కంపెనీ, దూరాభారం ఆధారంగా ఈ మొత్తంలో రూ.10–20 వరకు తేడా ఉంటోంది. మన రాష్ట్రంలో రూ.380–390 మధ్య సిమెంట్ బస్తా ధర ఉంది. అయితే.. రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలు ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు గత రెండున్నరేళ్లుగా రూ.235కే సిమెంట్ బస్తాను అందిస్తున్నాయి.
సిమెంట్ రేటులో భారీ తేడాల వల్ల అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోవడం, లేదంటే ఆటంకం కలగకూడదని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయా సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపింది. దీంతో అప్పుడు మార్కెట్‌లో రూ.330 దాకా ఉన్న సిమెంట్ బస్తాను రూ.235కే కంపెనీలు సరఫరా చేశాయి. అప్పటి నుంచి «సిమెంట్ ధరల్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా అదే ధరకు అందిస్తున్నాయి.
ఇప్పటిదాకా 38.83 లక్షల టన్నుల సిమెంట్ సరఫరా..
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు ఇప్పటిదాకా 38,83,894 టన్నుల సిమెంట్‌ను రూ.235 సబ్సిడీ ధరకే ఆయా కంపెనీలు అందించాయి. గ్రామాల్లో ప్రస్తుతం ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోనే దాదాపు 44,522 భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిలో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని ముగింపు దశకు చేరుకున్నాయి.
గ్రామాల్లో భవన నిర్మాణ పనులకే 14,98,941 టన్నుల సిమెంట్‌ను కంపెనీలు సరఫరా చేశాయి. మరో 2.19 లక్షల టన్నుల సిమెంట్ సరఫరా ప్రస్తుతం పురోగతిలో ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. 14.98 లక్షల టన్నుల్లో అత్యధికంగా 2.10 లక్షల టన్నులను భారతి సిమెంట్స్ సరఫరా చేయగా, ఆ తర్వాత 2.04 లక్షల టన్నులు అల్ట్రాటెక్ కంపెనీ సరఫరా చేసిందని తెలిపారు. అలాగే కేసీపీ, పెన్నా సిమెంట్స్ కంపెనీలు లక్ష టన్నులకుపైగా సరఫరా చేశాయన్నారు.
బాబు ప్రభుత్వంలో నాసిరకం పనులు..
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సిమెంట్ ధరల్లో వ్యత్యాసం కారణంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. దీంతో నాసిరకం పనులు జరిగాయని అధికారులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో వేసిన అంతర్గత సిమెంట్ రోడ్లలో కొన్నింటిని ఇంజనీరింగ్ విజిలెన్స్ అధికారులు పరిశీలించగా మూడింట రెండొంతులు రోడ్లు ఏ మాత్రం నాణ్యత లేనివిగా తేలింది.
ప్రభుత్వానికి భారీగా ఆదా..
గ్రామాల్లో నిర్మాణ పనులకు కంపెనీలు తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేయడంతో ప్రభుత్వానికి రూ.375 కోట్లు దాకా ఆదా అయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని శాఖల ద్వారా జరిగిన పనుల్లో మొత్తం రూ.970 కోట్లు దాకా ఆదా జరిగిందన్నారు. మరోవైపు సబ్సిడీ ధరకు సిమెంట్ సరఫరాలో ఎక్కడా ఎటువంటి అవినీతి చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందుకోసం ‘వైఎస్సార్ నిర్మాణ్’ పేరుతో ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment