
సాక్షి, అమరావతి: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆవాల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. మిషన్ మస్టర్డ్–2025లో భాగంగా వచ్చే 4 ఏళ్లలో ఆవాల సాగును కనీసం 2 లక్షల ఎకరాలకు తీసుకెళ్లేలా రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది. ఈ బాధ్యతను ఆయిల్ సీడ్స్ విభాగానికి అప్పగించనుంది. నీటివసతి ఉన్నా లేకున్నా ఆవాలను సాగు చేయవచ్చు. నానాటికీ మారిపోతున్న సీజన్లు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే స్వల్పకాలిక పంటల్ని ప్రోత్సహించాలన్నది లక్ష్యం.
రెండో పంటగాను సాగు చేయవచ్చు
అంతర్జాతీయంగా సోయాబీన్ తర్వాత ఆవనూనెకు గిరాకీ పెరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రస్తుతం ఉన్న 86.93 లక్షల టన్నుల ఆవాల దిగుబడిని 2025–26 నాటికి రెట్టింపు చేయాలని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని నూనెగింజల విభాగం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఈ లక్ష్యసాధనకు అటు రైతులు, ఇటు పరిశ్రమవర్గాల సహాయ సహకారాలను తీసుకోనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాధార ప్రాంతాల్లో తప్ప ఎక్కడా ప్రధానపంటగా ఆవాల సాగు లేదు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆవాల సాగు పెరిగినా.. మిగతా ప్రాంతాల్లో కూడా పెంచేందుకు నూనెగింజల విభాగం నడుంకట్టనుంది. కోస్తా జిల్లాల్లో తొలిపంటగా వేసే వరి తర్వాత రెండోపంటగా ఆవాల సాగును పెంచనుంది. ఇందుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయడమేగాక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వనుంది.
ఎకరా సాగు ఖర్చు రూ.5 వేలకు మించదు
మాగాణి భూముల్లో తేమ ఎక్కువ. 90 రోజుల్లో చేతికి వచ్చే ఆవాల సాగుకు అనువుగా ఉంటుంది. విత్తనాలను ఆయా కంపెనీలతోనే రైతులకు ఇప్పిస్తారు. ఎకరానికి రూ.500 వరకు విత్తనాలకు ఖర్చవుతుంది. ఇతర పెట్టుబడి ఖర్చులు అన్నీ కలిపినా రూ.4 వేల నుంచి రూ.5 వేల మధ్య ఉంటాయి. కలుపు బెడద తక్కువ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండించాలి గనుక సేంద్రియ పద్ధతుల్లోనే పండించవచ్చు. కషాయాలు, వేపనూనెలతో తెగుళ్లను నివారించుకోవచ్చు. ఎకరానికి సగటున 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. విత్తనాలు ఇచ్చిన కంపెనీలే ఆవాలను కొనుగోలు చేస్తాయి. క్వింటాల్ ఆవాలను ప్రస్తుతం రూ.4,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి కనీసం రూ.30 వేలు సంపాదించవచ్చు. ప్రస్తుతం వేస్తున్న నువ్వు, మినుము, పెసర కన్నా ఆవాల సాగు సులువు. ఖర్చు తక్కువ. అంతరపంటగా కూడా సాగు చేయవచ్చు. ఆవాల సాగుకు అన్ని విధాల సహకరిస్తామని ఆయిల్ సీడ్స్ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment