సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు, పక్కన మంత్రి కొడాలి నాని
సాక్షి, అమరావతి: రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఈ–పంట పోర్టల్‌లో రైతులు తమ పేర్లను, పంట వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఏపీలో తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు. పంటల కొనుగోలు, సూక్ష్మ సేద్యంపై వెలగపూడి సచివాలయంలో మంత్రులు కొడాలి నాని, ఎం. శంకరనారాయణతో కలిసి కన్నబాబు గురువారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారా నేరుగా రైతుల పొలాల వద్దకే వెళ్లి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడమే కాక 21 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామన్నారు.
2021–22లో మరో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నామని కన్నబాబు చెప్పారు. ఇందుకోసం రూ.1,190.11 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ప్రతీ రైతుకు ఆర్థికంగా మేలు చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. కాగా, తమ నియోజకవర్గాల్లో పంటల కొనుగోలు సందర్భంగా రైతులెదుర్కొంటున్న సమస్యలను పలు వురు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, మార్క్‌ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.
జూలై ఆఖరు వరకూ కొనుగోళ్లు : కోన శశిధర్
పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలు, కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. జూలై వరకు ఇది కొనసాగుతుందన్నారు. మరోవైపు.. ధాన్యం కొనుగోలుకు సంబంధిం చి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,229 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని.. దీనిపై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారని చెప్పారు. అలాగే, స్థానికంగా వినియోగించని 1010, 1001, ఎన్‌ఎల్‌ఆర్–145 వంటి వరి వంగడాలను ఖరీఫ్ నుంచి సాగు చెయ్యొద్దని ఆయన రైతులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment