
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని హామీలు చాలావరకు అమలు చేశామని, మిగతా కొన్ని అంశాలు అమలులో వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటుకు చట్టంలో పదేళ్ల కాల వ్యవధిని నిర్దేశించారన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 28 సార్లు సమీక్షా సమావేశాలు జరిగాయని కేంద్రమంత్రి వెల్లడించారు.
మరోవైపు పద్నాలుగవ ఆర్థిక సంఘం (ఎఫ్‌ఎఫ్‌సి) రాష్ట్రాల మధ్య పన్నుల సమాంతర పంపిణీలో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య ఎటువంటి వ్యత్యాసాన్ని చూపలేదన్నారు. ఎఫ్‌ఎఫ్‌సి సిఫారసుల ప్రకారం, 2015–20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32% నుంచి 42%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అంతేగాక 2020–21, 2021–26 కాలానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ కూడా 41% వద్ద అలాగే కొనసాగించిందని తెలిపారు.
కాగా పన్నుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వనరుల అంతరాన్ని సాధ్యమైనంత వరకు భర్తీ చేయడమే దీని ఉద్దేశ్యమన్నారు. అలాగే, డెవల్యూషన్ మాత్రమే అంచనా వేసిన అంతరాన్ని పూడ్చలేని రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్లు అందించినట్లు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి బదులిచ్చారు.
చదవండి: మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు: ఎంపీ వంగా గీత
Comments
Please login to add a commentAdd a comment