
తిరుపతి రూరల్: అక్కచెల్లెమ్మల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ డౌన్‌లోడ్లలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రికార్డు సృష్టించింది. ఆ నియోజకవర్గంలో 1.6 లక్షల కుటుంబాలు ఉండగా శనివారం నాటికి 1,77,363 మంది మహిళలు దిశ యాప్‌ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. తద్వారా దిశ యాప్ డౌన్‌లోడ్లలో రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలిచింది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ‘దిశ’ యాప్ అమలుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుడితే.. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మహిళలంతా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
సీఎం వైఎస్ జగన్ సంకల్పం మేరకు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముందుకు కదిలారు. నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఉన్న మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్‌లకు ‘దిశ ’ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు సంకల్పించారు. ఇందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో భారీ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరితో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. అనంతరం మండలాలు, గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి యాప్ పట్ల అవగాహన కల్పించాలని వలంటీర్లు, వార్డు సభ్యులు, మహిళా పోలీస్‌లకు దిశానిర్దేశం చేశారు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య తోడున్నట్టేనని వివరించాలన్నారు. ఆపద ఎదురైతే ‘దిశ‘ యాప్ ద్వారా నిమిషాల్లో పోలీసుల రక్షణ ఉంటుందని చెప్పాలన్నారు. ప్రయాణాల్లోనూ ఎంతో భద్రత ఉంటుందని వివరించాలని సూచించారు. ఇలా నిత్యం వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారుల వరకు ప్రతి ఒక్కరితో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రోత్సహించారు. సంబంధిత అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి దిశ లక్ష్యాన్ని అధిగమించారు.
Comments
Please login to add a commentAdd a comment