కూటమి నేతల లబ్ధికే మద్యం, ఇసుక పాలసీలు
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం రూరల్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.
తప్పు చేయమని చంద్రబాబే చెప్తారు.. నేరాలు కట్టడి చేస్తున్నట్టు నాటకాలాడతారు.. అలా అని పచ్చ పత్రికల్లో రాయిస్తారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వారికి అనుకూలమైన మద్యం, ఇసుక పాలసీలను రూపొందించారని ఆరోపించారు. మద్యం షాపులు దక్కించుకునేందుకు టెండర్ వేసే వారి నుంచి 30 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. వీటన్నింటిపై ప్రశ్నించాల్సిన పవన్ ఏమైపోయారని ప్రశ్నించారు.
80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది..?
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేస్తే.. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడ్డారని వేణు విమర్శించారు. ఇదంతా సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే జరిగిందన్నారు. నూతన మద్యం, ఇసుక పాలసీ టీడీపీ, కూటమి నేతలు బాగుపడేందుకు తెచ్చినవేగానీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సంపద సృష్టిస్తానన్న బాబు.. కార్యకర్తల బాగు కోసం సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు.
కేవలం రెండు రోజుల్లోనే ఇసుక టెండర్లు ఎలా పూర్తిచేస్తారని ప్రశ్నించారు. సామాన్యులకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారన్నారు. గతంలో రూ.10 వేలకు వచ్చే ఇసుక.. ప్రస్తుతం రూ.30 వేలు పలుకుతుందంటే.. అది ఉచితమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అప్పులను పదే పదే ప్రస్తావించిన చంద్రబాబు.. అప్పులతోనే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇసుక కొరతకు కారణమేంటన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment