బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
తాపీగా 52 రోజుల తర్వాత ‘పులివర్తి’ కేసులో ఏ–37గా చేర్చడంపై విస్మయం
ఘటన సమయంలో కలెక్టర్, జేసీ సమక్షంలో స్ట్రాంగ్ రూంలోనే ఉన్న మోహిత్‌రెడ్డి
ముందస్తు బెయిల్‌పై సోమవారం విచారణ.. కోర్టుకిచి్చన హామీని ఉల్లంఘించిన పోలీసులు
నాని ‘కట్టు’కథ బట్టబయలైనా కక్ష సాధింపా?
తిరుపతి రూరల్ : వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని పోలీసులు శనివారం సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ తర్వాత రోజు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నాని ఉద్రిక్తతలు రేకెత్తించిన ఘటనకు సంబంధించి మోహిత్‌రెడ్డిని ఏ–37గా చేర్చారు.
నిజానికి ఆ సమయంలో మోహిత్‌రెడ్డి వర్సిటీలోని స్ట్రాంగ్ రూంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఎన్నికల అధికారుల వద్ద ఉండటం గమనార్హం. సీసీ కెమెరాల సాక్షిగా ఇదే విషయం నిర్ధారణ అయింది. కేసు నమోదు సమయంలోనూ మోహిత్‌రెడ్డి పేరు ఎక్కడా లేదు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఘటన జరిగిన 52 రోజుల అనంతరం రాజకీయ కక్షతో మోహిత్‌రెడ్డి పేరును కేసులో చేర్చారు.
ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌పై కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోఅరెస్ట్ చేయబోమని కోర్టుకు నివేదించిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని రాజకీయ కక్షలో భాగంగానే తనపై ప్రత్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని కేసులో ఇరికించి అక్రమ అరెస్టుతో పైశాచిక ఆనందం పొందుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాటకమని తేలినా కక్ష సాధింపా?
తనపై హత్యాయత్నం జరిగిందని పులివర్తి నాని నాడు స్విమ్స్‌లో చేరి.. చేతులు, కాళ్లకు బ్యాండేజ్ కట్లతో చేసిన హడావుడి అంతా నాటకమని తేలింది. ఆ వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఎక్కడా గాయాల్లేవని ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా స్పష్టమైంది.
ఆ రిపోర్టులు ఇటీవలే బయటపడ్డాయి. మొత్తానికి ఆ రోజు అంతా డ్రామా నడిచిందని తేటతెల్లమైంది. ఆ నాటకం వల్ల ఇప్పటికే 37 మందిని జైలు పాలు చేశారు. అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎంత మందిని శిక్షిస్తారు? తప్పుడు కేసులు పెట్టి అమాయకులను మానసిక క్షోభకు గురి చేయడం దారుణం. ఆ వ్యక్తి గాయాలన్నీ ‘కట్టు’ కథలే అని తేలినప్పటికీ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గం.
విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు
నా కొడుకు వయస్సు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. విదేశాల్లో చదివిన నా కొడుకుని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు. నేను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగినవాడిని. నాకంటే మించి నా కొడుకు ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసు అధికారులకు రుచి చూపిస్తారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. – చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, చంద్రగిరి
Comments
Please login to add a commentAdd a comment