కాకినాడ సిటీ: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. కుటుంబ పోషణ నిమిత్తం ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించగా.. 3 గంటల్లోనే ఆమె చేతికి ఉద్యోగ నియామక పత్రం అందించారు. వివరాలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తొత్తరమూడికి చెందిన గన్నవరపు ఝూన్సీరాణి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కూలి పనితో వచ్చే అంతంత మాత్రం ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం.
ఈ నేపథ్యంలో బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాకకు వచ్చిన సీఎం జగన్‌ను ఝూన్సీరాణి కలిసింది. తన బాధను ముఖ్యమంత్రికి తెలియజేసింది. ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆమె పరిస్థితి తెలుసుకున్న సీఎం జగన్.. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే ఝాన్సీకి విద్యార్హతల ఆధారంగా ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం జగన్ కార్యక్రమం ముగిసిన వెంటనే కలెక్టర్ కృతికా శుక్లా తన క్యాంపు కార్యాలయానికి ఝూన్సీరాణిని తీసుకెళ్లారు.
డిగ్రీ, డీఈడీతో పాటు పీజీ డిప్లామో ఇన్ కంప్యూటర్ అప్లికేషన్(పీజీడీసీఏ) చదివినట్లు తెలుసుకున్న కలెక్టర్.. వికాస సంస్థ సమన్వయంతో రూ.14 వేల ప్రారంభ వేతనంతో ఇంటి నుంచే పని చేసేలా కోజెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం కల్పించారు. వెంటనే నియామక పత్రాన్ని అందించారు. అలాగే ఆమెకు ఉచిత వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తను ఆదేశించారు. ఝాన్సీరాణి కుటుంబసభ్యులు స్పందిస్తూ.. అడిగిన వెంటనే స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment