ఈ ఏడాదీ ఆర్బీకేల్లో మిరప విత్తనం.. 35 కంపెనీలతో ఏపీ సీడ్స్‌ ఒప్పందం | Chilli Seed In Rbk: Ap Seeds Agreement With 35 Companies | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదీ ఆర్బీకేల్లో మిరప విత్తనం.. 35 కంపెనీలతో ఏపీ సీడ్స్‌ ఒప్పందం

Published Tue, Apr 18 2023 8:57 AM | Last Updated on Tue, Apr 18 2023 3:28 PM

Chilli Seed In Rbk: Ap Seeds Agreement With 35 Companies - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప సాగు గత నాలుగేళ్లుగా పెరుగుతోంది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తు నుంచి మార్కెటింగ్‌ వరకు ప్రభుత్వం తీసు­కున్న చర్యల ఫలితంగా నాణ్యమైన దిగుబడులు పెరిగి, మార్కెట్‌­లో మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో మిరప సాగుకు రైతులు  ముందుకు వçస్తుండటంతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

గతంలో ప్రతి ఏటా మిర్చి రైతులకు బ్లాక్‌ మార్కెట్, అధిక ధరలు, నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు పెద్ద సమస్యగా ఉండేవి. రైతులను ఆర్థికంగా దెబ్బతీసేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విత్తనాలను అందించడం నుంచి పంటను అమ్ముకొనే వరకు రైతులకు అండదండగా నిలుస్తోంది. దీంతో విత్తనాలు, ఎరువుల బ్లాక్‌ మార్కెటింగ్, నకిలీ, కల్తీల బారి నుంచి అన్నదాత బయటపడ్డాడు.

ఈ ఖరీఫ్‌లో కూడా మిర్చి రైతులకు కల్తీ, నకిలీ విత్తనాలు, బ్లాక్‌ మార్కెట్‌ బెడద లేకుండా ఈ ఏడాది కూడా ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా విత్తనాల కంపెనీలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంటోంది. డిమాండ్‌ ఉన్న విత్తన రకాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతోంది. డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

రైతులు సాధారణంగా మేలో విత్తనాలు కొని జూన్, జూలైలో నారుపోస్తారు. సాగు విస్తీర్ణంలో 30 శాతం ఓపీ (ఓపెన్‌ పొలినేటెడ్‌), 70 శాతం హైబ్రీడ్‌ విత్తనం వేస్తారు. సీజన్‌లో 2.57 కిలోల ఓపీ, 35 వేల కిలోల హైబ్రీడ్‌ విత్తనం అవసరం. ఓపీ విత్తనానికి ఢోకా లేకున్నప్పటికీ, హైబ్రీడ్‌ విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేశారు.

వచ్చే ఖరీఫ్‌లో డిమాండ్‌ ఉన్న రకాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ సీడ్‌ యాక్టు కింద 35 విత్తన కంపెనీలతో ఏపీ సీడ్స్‌ ఎంవోయూ చేసుకుంది. అగ్రి ల్యాబ్స్‌లో జర్మినేషన్‌ టెస్ట్, నాణ్యతను పరీక్షించిన తర్వాతే ఆర్బీకేల ద్వారా కంపెనీలు నిర్దేశించిన ధరలకే రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు.

నకిలీ విత్తనాలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌
సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో విత్తనాలకు డిమాండ్‌ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మేవారు, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెటింగ్‌ ద్వారా అధిక ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారుల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. జిల్లాలవారీగా వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బందితో ఏర్పాటు చేస్తున్న ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయి. ఎవరైనా కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయించినా, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటాయి.

మరో వైపు నకిలీ నారు కట్టడికిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 50 శాతం మంది మార్కెట్‌లో కొన్న విత్తనాన్ని నారు కోసం షేడ్‌నెట్స్‌కు ఇస్తారు. మిగిలిన 50 శాతం రైతులు షేడ్‌నెట్స్‌ నుంచి నేరుగా నారు కొంటారు. నర్సరీలతో పాటు షేడ్‌నెట్స్‌ను కూడా నర్సరీ యాక్టు పరిధిలోకి తేవడంతో విధిగా సీడ్‌ రిజిస్టర్లు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. నారు అమ్మే ముందు నారుకు ఉపయోగించిన విత్తనం ఏ కంపెనీదో లాట్‌ నంబర్లతో సహా చెప్పాల్సి ఉంటుంది. నాణ్యమైన విత్తనం వాడలేదని తనిఖీల్లో తేలితే షేడ్‌నెట్స్‌ లైసెన్సులను రద్దు చేస్తారు.

పెరుగుతున్న సాగు విస్తీర్ణం
రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిరప సాగవుతోంది. అత్యధికంగా పల్నాడులో 1.42 లక్షల ఎకరాలు, ప్రకాశంలో 91,347 ఎకరాలు, గుంటూరులో 67,500 ఎకరాల విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. గత  సీజన్‌లో గుంటూరు మిర్చి యార్డులో క్వింటాలు ధర రూ.27వేలకు పైగా, వరంగల్‌లో ఏకంగా రూ.50 వేలకు పైగా పలికింది. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో పత్తి, వేరుశనగ రైతులు కూడా పెద్ద ఎత్తున మిరప వైపు మళ్లుతున్నారు. 2021–22 లో రికార్డు స్థాయిలో 5.62 లక్షల ఎకరాలు, 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది.  రానున్న ఖరీఫ్‌లో మిరప సాగు విస్తీర్ణం 6 లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.

విత్తనం కొరత రానీయం
రైతులకు సరిపడా హైబ్రీడ్‌ మిరప విత్తనాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. డిమాండ్‌ ఉన్న విత్తన రకాలను రైతులకు అందిస్తాం. ఎక్కడైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. లైసెన్సులు కూడా రద్దు చేస్తాం. బ్లాక్‌ మార్కెటింగ్‌ను నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
– డాక్టర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ

ఆర్బీకేల ద్వారా విత్తనం సరఫరా
విత్తనాల కోసం 35 కంపెనీలతో ఎంవోయూ చేసుకున్నాం. సర్టిఫై చేసిన తర్వాతే ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తాం. గతేడాది 9 వేల ప్యాకెట్లు ఆర్బీకేల ద్వారా విక్రయించాం. ఈ ఏడాది కూడా డిమాండ్‌ ఉన్న హైబ్రీడ్‌ రకాలను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. 29 రకాల విత్తనాలు 115 క్వింటాళ్లు అవసరమని ఉద్యాన శాఖ నుంచి ఇండెంట్‌ ఇచ్చింది. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నాం.
–డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ సీడ్స్‌

అధిక ధరలకు కొనొద్దు
మిరప, పత్తి విత్తనాలను ఆర్బీకేల ద్వారా సర­ఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆతృ­తపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులకు సూచించారు. కల్తీ, నకిలీ విత్తనాలను, బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించేందుకు జిల్లాలవారీగా టాస్క్‌ ఫోర్స్‌ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మిరప, పత్తి విత్తనాలను గ్రామ స్థాయిలో ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. విత్తనం దొరకదన్న ఆందోళన అవసరం లేదని, డిమాండ్‌ ఉన్న రకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 
– రైతులకు మంత్రి కాకాణి సూచన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement