స్పందించిన ఎంబసీ
సొంతూరికి రప్పించాలని వేడుకోలు
వాల్మీకిపురం: ఎన్నో ఆశలతో కువైట్‌కు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి ఏజెంట్ చేతిలో మోసపోయాడు. ఎడారిలో తాను కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘ఎడారిలో మేకలు, గొర్రెలు, కుక్కలకు నేనొక్కడినే మేత వేస్తున్నా..నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఎండలకు నా వల్ల కావడంలేదు. ఎవరైనా సాయం చేయండి.. లేదంటే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా కల్లూరుకు చెందిన రామచంద్రరావ్ కుమారుడు శివ (40) అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం బోయపల్లికి చెందిన శంకరమ్మను 18ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి వెన్నెల, వనిత అనే కుమార్తెలు ఉన్నారు. శివ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
బిడ్డలను చదివించలేని పరిస్థితి ఉండడంతో పెద్ద కుమార్తెతో పాటు భార్యను సైతం కూలీకి తీసుకెళ్లి వచ్చిన డబ్బుతో చిన్న కుమార్తె వనితను చదివిస్తున్నాడు. ఈ క్రమంలో కువైట్ వెళ్లి డబ్బు సంపాదించి పెద్ద కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పులు చేసి డబ్బులు పోగేసుకొని రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్‌ను సంప్రదించాడు. అతని ద్వారా శివ నెలక్రితమే కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో గొర్రెలు, పావురాలు, బాతులు మేపడానికి బాధితుడిని పెట్టారు. అయితే అక్కడ సంబంధిత యజమానులు నాలుగు రోజులైనా గొర్రెల దగ్గరికి రాకపోగా సరిపడా ఆహారం, నీటిని అందించకపోవడంతో బాధితుడు భయపడిపోయాడు.
ఈ తరుణంలో తన భార్యకు, ఏజెంట్‌కు సమాచారం అందించాడు. తిరిగి రావడానికి డబ్బులు ఎవ్వరు ఇస్తారని, నువ్వు అక్కడే పని చేయాల్సిందేనని ఏజెంటు చెప్పడంతో తన దగ్గర డబ్బులు లేవని, భార్య నిస్పహాయత చూపడంతో బాధితుడు చేసేది ఏమీలేక తనకు చావే శరణ్యమని, తనను ఎవరైనా దయగలవారు ఇండియాకు తీసుకెళ్లాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎంబసీ వారు స్పందించారు. బాధితుడు శివను భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
మా నాన్నను భారత్‌కు రప్పించండి
మా నాన్న శివ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఎడారిలో ఉన్నాడు. దయచేసి ఎవరైనా సహాయం చేసి మా నాన్నను భారత్‌కు రప్పించండి.
– వనిత, బాధితుడి కుమార్తె
Comments
Please login to add a commentAdd a comment