సూళ్లూరుపేటలో కాళంగి నది పొంగడంతో జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న నీరు
సాక్షి, అమరావతి/నెల్లూరు/చిత్తూరు/సాక్షి నెట్‌వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలంలో 17.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ విస్తృతంగా వర్షాలు కురిశాయి. మిగిలిన చోట ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో 8 జలాశయాలు నిండటంతో గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై రాకపోకలు çస్తంభించాయి. స్వర్ణముఖి నదిలో ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా స్థానికులు రక్షించారు.
మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 9 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సురుటుపల్లె ఆనకట్ట కుడివైపు దెబ్బతినడంతో పల్లపు ప్రాంతాల్లోని గ్రామాలు జలమయమయ్యాయి. సత్యవేడు మండలం ఊతుకోట, రాజులకండ్రిగ వద్ద ఉన్న వంతెన, నాగలాపురం మండలం టీపీకోట, ఓబులరాజుల కండ్రిగ వద్ద ఉన్న వంతెన, చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె వద్ద ఉన్న చెక్‌డ్యాంలు కూలిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. స్వర్ణముఖి నది, నక్కలవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్లను రాత్రి వేళ మూసివేస్తున్నట్లు టీటీడీ భద్రతా అధికారులు తెలిపారు.
నది మధ్యలో బిక్కుబిక్కుమంటూ..
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురానికి చెందిన రాజశేఖర్, లక్ష్మి దంపతులు ఏడాది బిడ్డతో కలిసి పందులను మేపేందుకు గురువా రం స్వర్ణముఖి తీరానికి వెళ్లారు. వరద ప్రవాహం చుట్టుముట్టడంతో నదిలోనే చిక్కుకుపోయారు. వారిని వైఎస్సార్‌సీపీ శ్రేణు లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బయట కు తెచ్చారు.
పిచ్చాటూరు మండలం అప్పంబట్టు వద్ద చొక్కలింగం(45) ప్రమాదవశాత్తు కాలు జారి అరుణానదిలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న కేవీబీ పురం మండలం బంగారమ్మ కండ్రిగకు చెందిన లోకేష్ నదిలో దూకి చొక్కలింగంను కాపాడేందుకు ప్రయత్నించాడు. ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వీలు కాలేదు. ఇతని మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. లోకేష్ కూడా వరదలో కొట్టుకు పోతుండగా స్థానికులు కాపాడారు.
రాకపోకలకు అంతరాయం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాళంగినది, పాములకాలువలు ఉగ్రరూపం దాల్చాయి. ఫలితంగా పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి.
సూళ్లూరుపేట సమీపంలోని తారకేశ్వరా టెక్స్‌టైల్స్ కంపెనీ, విండ్ ఎనర్జీ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది కార్మికులు పాముల కాలువ వరదనీటిలో చిక్కుకుపోగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించాయి. వెంకటగిరి మండలం పాళెంకోట గ్రామం కాజ్‌వే కొంత మేర వరదకు కొట్టుకుపోయింది.
సోమశిల ఉగ్రరూపం
సోమశిల తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఏడు గేట్ల నుంచి 74 వేల క్యూసెక్కుల నీటిని పెన్నాకు వదులుతున్నారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెన్నా పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రంలో చిక్కుకుపోయిన 11 మంది మత్స్యకారుల్ని కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డు సిబ్బంది సురక్షితంగా తీరానికి చేర్చారు. ఈ నెల 9న చేపల వేటకు వెళ్లి మర పడవ చెడిపోవడంతో మైపాడు వద్ద వీరు సముద్రంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
కూలిన స్తంభాలు.. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు
చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో వేలాది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. వందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.
బుగ్గవంక డ్యామ్ గేట్లు ఎత్తివేత
వైఎస్సార్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కడపలో బుగ్గవంక డ్యామ్ గేట్లు ఎత్తి కిందకు నీటిని వదిలారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా నగరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఒంటిమిట్ట చెరువు అలుగు పారుతోంది. రాజంపేట మండలం భువనగిరిపల్లెకు, చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లె నాగిరెడ్డిపల్లెకు రాకపోకలు నిలిచిపోయాయి.
కమలాపురం వద్ద పొడదుర్తి పాపాఘ్ని నదిలో చిక్కుకున్న ఓ యువకుడిని, సిద్దవటం మండలం నేకనాపురానికి చెందిన పలువురిని అధికారులు కాపాడారు. పించా, వెలిగల్లు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. ఝరికోన ఉధృతంగా పారుతోంది.
రాయచోటి ప్రాంతంలో సుద్దకోళ్ల వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుండుపల్లె, రాజంపేటలకు రాకపోకలు ఆగిపోయాయి. బుగ్గవంక సమీపంలోని శాస్త్రి నగర్ వద్ద వరద నీటిలో చిక్కుకుపోయిన ఓ వృద్ధురాలిని హోంగార్డు రమేష్ రక్షించాడు.
Comments
Please login to add a commentAdd a comment