కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలి బాగోలేదు
వారి తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది
అలాంటి వారిని మంత్రులే కంట్రోల్ చేయాలి
కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
సాక్షి, అమరావతి: కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలి బాగోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వస్తోందన్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై మాట్లాడిన ఆయన.. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం నాటి పత్రికల్లో వచ్చి న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ఉదంతాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని చెప్పినట్లు సమాచారం.
కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని చెప్పినట్లు తెలిసింది. వంద రోజుల ప్రభుత్వ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దామని సీఎం చెప్పారు. అలాగే మంత్రుల పనితీరుపైనా ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తానని చెప్పి, జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్‌కు అందిస్తానన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఇంకా విమర్శలు వస్తున్నాయని, దానిపైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇసుక సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పగటి సమయాల్లో కాకుండా రాత్రిళ్లు కూడా ఇసుక లోడింగ్, సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపివేస్తే విమర్శలు వస్తాయేమోనని సమావేశంలో చర్చ జరిగింది.
చివరికి బాగా అధ్యయనం చేసిన తర్వాత దీనిపై ముందుకెళ్లాలని నిర్ణయించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పనకు సంబంధించి ప్రతి కేసులోనూ విచారణ జరపాలని చంద్రబాబు సూచించారు. ఫ్రీ హోల్డ్ అయ్యాక జరిగిన ప్రతి రిజి్రస్టేషన్‌పైనా విచారణ చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment