శ్రీశైలం, మడకశిర పర్యటనలో సీఎం చంద్రబాబు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి
మడకశిరలో రూ.60 కోట్లతో రింగు రోడ్డు నిర్మిస్తాం
రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు కూడా..
సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణ విధానం తెచ్చాం
సాక్షి, నంద్యాల, పెద్దదోర్నాల, సాక్షి, పుట్టపర్తి/ మడకశిర: సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్లామని, ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో శ్రీశైలం డ్యామ్ 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే నిండిందన్నారు.
మరో రెండు మూడు రోజుల్లో నాగార్జునసాగర్, ఆ తర్వాత పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయని చెప్పారు. గురువారం శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో నిర్వహించిన మన నీరు– మన సంపద కార్యక్రమం, శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
సున్నిపెంటలోని యువత న్యూయార్క్‌లో ఉద్యోగం సంపాదించేలా స్కిల్స్ డెవలప్ చేస్తామన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని రాయలసీమకు తరలించి సీమలోని జలాశయాలన్నింటినీ నింపుతామన్నారు. రానున్న ఐదేళ్లలో కరువు అనే మాట వినపడకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత తాను తీసుకుంటానని మల్లన్న సాక్షిగా చెబుతున్నట్లు పేర్కొన్నారు.
సీమకు పరిశ్రమలు తెస్తాం
రాయలసీమలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా స్థితిమంతులైన ప్రతి ఒక్కరూ 25 మందిని వృద్ధిలోకి తెచ్చేందుకు సహకరిస్తే సమాజంలో పేదరికం అనేది లేకుండా పోతుందన్నారు. నాకు సంపద సృష్టించడం తెలుసు.. దాన్ని పేదలకు పంచడమూ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
శ్రీశైలం దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందేలా సహకారం అందిస్తామన్నారు. కేంద్రంతో చర్చించి సిద్ధేశ్వరం వద్ద ఐకానిక్ హైవే బ్రిడ్జితో పాటు బ్యారేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని చంద్రబాబు విమర్శించారు.
తమ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.69 వేల కోట్లను కేటాయిస్తే గత ప్రభుత్వం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. హంద్రీనీవాకు తాము రూ.5,520 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. గాలేరు నగరికి తాము రూ.2,050 కోట్లు వ్యయం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.448 కోట్లను మాత్రమే ఖర్చు పెట్టిందని చెప్పారు.
రాళ్లపల్లి, రత్నగిరిలో రిజర్వాయర్లు..
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో రామన్న అనే పింఛన్‌దారుడి ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు రూ.4 వేలు ఫించన్ అందించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామన్నకు భూమితో పాటు పిల్లలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వితంతువు ఓబుళమ్మకు ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టు రైతు రంగనాథ్ మల్బరీ ప్లాంటేషన్, రేషం షెడ్‌ను పరిశీలించారు. గ్రామంలోని కరియమ్మదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
హంద్రీనీవాలో భాగంగా మడకశిర నియోజకవర్గంలో రాళ్లపల్లి, రత్నగిరి వద్ద రిజర్వాయర్లు నిర్మించి సాగు, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఆర్.అనంతపురం వద్ద 1,600 ఎకరాలలో ఇండస్ట్రియల్ క్లస్టర్, వక్క రైతుల కోసం మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. మడకశిరలో రూ.60 కోట్లతో రింగు రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. మడకశిరను రెవెన్యూ డివిజన్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
పుట్టపర్తి నుంచి వచ్చే జాతీయ రహదారి 7ని 44వ జాతీయ రహదారికి అనుసంధానం చేసి పెనుకొండ, గుడిబండ, మడకశిర, అమరాపురంను అనుసంధానం చేస్తామని చెప్పారు. సున్నిపెంట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు సీఎం చంద్రబాబు గుండుమల ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన గుండుమల వచ్చారు. అనంతరం పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు.
ప్రయాణికులకు అవస్థలు
సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి సున్నిపెంట చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో శ్రీశైలం క్షేత్రానికి చేరుకోగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దాదాపు రూ.12 కోట్లతో స్వామి, అమ్మవార్లకు బహూకరించిన బంగారు రథాన్ని పరిశీలించారు. అనంతరం నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని మ్యాప్‌లను పరిశీలించారు.
జలహారతి ఇచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడకు 50 కి.మీ. దూరంలో ఉన్న ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేయడంతో భక్తులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
మండల కేంద్రంలో కాకుండా మార్గం మధ్యలో బసులను నిలిపివేయడంతో చిన్న పిల్లలతో కలసి ప్రయాణిస్తున్న వారు ఇబ్బంది పడ్డారు. గేట్లు తెరవడంతో ఆ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు బయల్దేరిన వారికి నిరాశ ఎదురైంది. కొన్ని బస్సులు శ్రీశైలం చేరుకుని మధ్యాహ్నం భోజనం అనంతరం తిరిగి గమ్యస్థానాలకు బయలుదేరాల్సి ఉంది. దోర్నాలలోనే ఇంత అలస్యమైతే తాము తిరిగి ఎప్పుడు వెళ్లాలని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్గీకరణపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాను మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీల వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ వర్గీకరణ విధానం తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం సామాజిక సమతుల్యాన్ని పాటిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment