రెండు నెలల్లోనే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తాం: సీఎం వైఎస్‌ జగన్‌ | CM Jagan assured AP flood victims Alluri Sitaramaraju Eluru Districts | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లోనే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తాం: సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Jul 28 2022 3:20 AM | Last Updated on Thu, Jul 28 2022 9:21 AM

CM Jagan assured AP flood victims Alluri Sitaramaraju Eluru Districts - Sakshi

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి

తక్షణ సాయం బాధితులందరికీ అందాలని చెప్పా. మాకు అందలేదని ఎక్కడా, ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. అందరికీ సాయం అందింది. మన ప్రభుత్వ పనితీరును చేతల్లో చూపించాం. ఇందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు. వరదల్లో నష్టపోయిన మొత్తాన్ని బాధితులకు అందించడంపై ఇక దృష్టి సారిస్తాం. ఇది మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి.

ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ ఉన్నారు. నష్టపోయిన వారందరి పేర్లతో రెండు వారాల్లో జాబితా తయారు చేసి, సచివాలయంలో ప్రకటిస్తారు. ఆ జాబితాలో పొరపాటున ఎవరి పేరు లేకపోయినా, రెండు వారాల్లోగా సరిచూసుకుని మళ్లీ మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మరో రెండు వారాల్లో ఈ జాబితాను రీ వెరిఫై చేస్తాం. ఆ తర్వాత మరో రెండు వారాల్లో మీరు నష్టపోయింది మీకు వచ్చేలా చేస్తాను. అంటే 2 నెలల్లో మీకు పూర్తి నష్టపరిహారం చెల్లిస్తాం. ఇదంతా నా చేతుల్లో ఉన్న పని. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీకు అన్నగా.. మీ అందరికీ మంచి చేస్తాను.    
– సీఎం వైఎస్‌ జగన్‌

బాధపడకు తల్లీ.. నేనున్నా
ప్రధాన మంత్రి మోదీ అపాయింట్‌మెంట్‌ అడిగా. నేను చూసిన పరిస్థితులన్నింటినీ ఆయనకు వివరిస్తా. 1986లో ఇంత స్థాయి నీరు వచ్చిందని, మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో నీళ్లు వచ్చాయని చెబుతా. ఇది జాతీయ ప్రాజెక్టు. అందువల్ల ఏరోజైనా పరిహారం ఇవ్వక తప్పదు కదా సర్‌.. ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే.. వారంతా సంతోషిస్తారు. నిర్వాసితులు మిమ్మల్నే తలుచుకుంటారు.. లేదంటే తిట్టుకుంటారు.. బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి మీరే డబ్బు పంపండి అని ప్రధాన మంత్రిని కోరుతా.  
– సీఎం వైఎస్‌ జగన్‌ 


నిమ్మలగూడెంలో ఓ మహిళను ఓదార్చుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ఏలూరు: వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని, నష్టపోయిన మొత్తాన్ని బాధితులకు రెండు నెలల్లో అందజేసే బాధ్యత మీ వాడిగా తనదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాటాకు గుడిసెలో ఉన్న వారికి నష్ట పరిహారాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని చెప్పారు. బుధవారం ఆయన రెండవ రోజు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద ముంపు వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఇప్పటికే రేషన్‌ అందించడంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు సాయం చేశామని చెప్పారు. ఎన్యూమరేషన్‌ ప్రక్రియ (నష్టం అంచనా) మరో రెండు వారాల్లో పూర్తి చేసి, వరద నష్ట పరిహారాన్ని రెండు నెలల్లో చెల్లిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకే మీ అన్న, తమ్ముడు, మనవడు ఉన్నాడని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

తేడా గమనించండి..  
► చింతూరులో 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు దాదాపు 20 రోజులపాటు మొదటి ప్రమాద ఘంటికపైనే నీళ్లు నిలిచి ఉండడం గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో ఇటువంటి పరిస్థితి వస్తే పట్టించుకునే వారు కాదు. ఈ నాలుగు మండలాలకు సంబంధించి ఇక్కడే కాపురం పెట్టిన కలెక్టర్‌ను ఎప్పుడైనా చూశారా? ఎన్నడూ చూడలేదు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.. అందరికీ సహాయం అందించేందుకు అధికారులందరూ ఇప్పుడు ఇక్కడకు వచ్చారు. గతంతో పోలిస్తే ఎంత మార్పు వచ్చిందో గమనించాలని కోరుతున్నా.
► మామూలుగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు జేసీలు ఉండేవారు. ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు, ఆరు మంది జేసీలు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు, ఆశా వర్కర్లు ఇంత మంది కలిసి అందరికీ సహాయం అందేలా చూడాలని తపన, తాపత్రయం పడే పరిస్థితి. గతం కంటే ఇప్పుడు భిన్నంగా పరిస్థితి ఉందన్న విషయం గమనించాలి.
► అందరికీ 25 కేజీల బియ్యం, పామాయిల్, వీటన్నింటితో పాటు ఇంటింటికీ రూ.2 వేలు అందించాం. ప్రతి ఒక్కరికీ ముట్టిందా.. అందిన వాళ్లు చేతులు పైకి ఎత్తండి. (అందరూ చేతులు పైకి ఎత్తారు.. ఏ ముఖ్యమంత్రీ చేయలేదండి అని నినదించారు) ఇంత పారదర్శకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ఒక్కరూ మిగిలిపోకుండా సహాయం అందిస్తున్నాం. 

అందరికీ మేలు జరగాలని చెప్పా.. 
► ఎన్ని రోజులు అయ్యింది ఇంటికి వెళ్లి అని కలెక్టరును అడిగాను. 20 రోజులు అయ్యింది అని చెప్పారు. ఒక్క అల్లూరి జిల్లాలో నాలుగు మండలాలకు ఇబ్బంది వస్తే.. కలెక్టరు ఇక్కడే ఉండి ఏ ఒక్కరికీ ఇబ్బంది రాకుండా స్వయంగా చూసుకునే మంచి ఆలోచనతో అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ విధంగా ప్రజలకు సేవ చేసిన కలెక్టరుతో మొదలుకుని అధికారులందరికీ ప్రజల తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా.
► మాములుగా నాయకులు.. అది బాగోలేదు.. ఇది బాగోలేదు అని నాలుగు మాటలు మాట్లాడి.. ఆ అధికారిని, ఈ అధికారిని సస్పెండు చేసి వెళ్లిపోయే పరిస్థితి. అలా కాకుండా అధికారులకు ఏ వనరులు కావాలో.. ఆ వనరులు వారి చేతుల్లో పెట్టి... వారం తర్వాత నేను వస్తాను. ఏ ఇంట్లో కూడా నాకు ఫలానా సహాయం అందలేదన్న మాట వినిపించకూడదని ఆదేశించా. ఒక్క ఇంట్లో కూడా నాకు మంచి జరగలేదన్న మాట వినిపించలేదు. 

14 రోజుల్లో ఎన్యూమరేషన్‌ 
బుధవారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట, తిరుమలాపురం గ్రామాల్లో ముంపు వల్ల నష్టపోయిన కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ సహాయం అందిందా.. పింఛను తీసుకుంటున్నారా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. బాధితులతో మాట్లాడుతూ.. ‘పారదర్శకంగా ఎన్యూమరేషన్‌ను 14 రోజుల్లో పూర్తి చేయండని చెప్పాం. కలెక్టర్లే ఇక్కడ తిష్ట వేశారు. అధికారులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో మమేకం అయ్యారు.  మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు కాబట్టి, ఎన్యూమరేషన్‌ను ఇవాళే మొదలు పెట్టండని చెప్పాం’ అన్నారు. 

ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా..
అల్లూరి జిల్లాలో సీఎం పర్యటించిన ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. వేదికకు దూరంగా బాధితులను కూర్చోబెట్టారు. రాజమండ్రి నుంచి నేరుగా కుయిగూరుకు వచ్చిన సీఎం.. ఈ బారికేడ్లు, ఏర్పాట్లను చూసి మీతో మాట్లాడేందుకు నాకు ఈ అడ్డు ఎందుకు.. అని బారికేడ్ల నుంచి పక్కకు వచ్చి నేరుగా బాధితుల వద్దకు చేరుకుని వారితో ముచ్చటించారు.  చింతూరు, నిమ్మలగూడెంలలో బస్సు దిగి మరీ వారి బాధలను తెలుసుకుని ఓదార్చారు. కొద్ది మంది తమ ఆరోగ్యం, పింఛను సమస్యలను విన్నవించిన వెంటనే.. పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ సందర్భం గా జై జగన్‌ అంటూ ప్రజలు నినదించారు. సీఎంతో మాట్లాడాలని, ఫొటో దిగాలని పోటీ పడ్డారు. ‘సీఎం మామూలు మనిషిలా ఇంత ఆప్యాయంగా మాట్లాడతా రని మేము ఊహించలేదు’ అని ఆయా గ్రామాల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ‘గత 60–70 ఏళ్ల నుంచి మాకు 20 ఎకరాల భూమి ఉంది. అయితే, ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్నప్పటికీ మాకు నష్టపరిహారం రాదని అంటున్నారు’ అని కుయిగూరుకు చెందిన బండి శ్రీలత సీఎం జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ‘షెడ్యూల్‌ ప్రాంతంలో కాబట్టి నాన్‌ షెడ్యూల్‌ కుటుంబాలకు భూమి ఉండకూడదు. అయితే, వేరే విధంగా చేయవచ్చో ఆలోచిస్తాం. ఏ ఆడకూతురు కంట నీరు పెట్టుకోకూడదనే నా తాపత్రయం. ఏదో ఒక విధంగా మంచి చేస్తాం’ అని భరోసానిచ్చారు.   

లైడర్‌ను విశ్లేషిస్తున్నాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టుపై లైడర్‌ (లైట్‌  డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌) సర్వే 4రోజుల క్రితమే పూర్తయింది. ప్రతి కాంటూరు లెవల్‌పై జరిగిన ఈ సర్వేను నెల పాటు క్షుణ్ణంగా విశ్లేషిస్తాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలుంటే సరిదిద్ది అందరికీ న్యాయం చేస్తాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ పోలవరం నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట, తిరుమలాపురం గ్రామాల్లో బుధవారం సీఎం ముంపు బాధితులతో మాట్లాడారు.  

ఎవరెవరు ఏ కాంటూరు పరిధిలోకి వస్తారో మళ్లీ పరిశీలన చేస్తామని సీఎం చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో స్థానిక రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఏలూరు, రాజమండ్రి జిల్లా కలెక్టర్‌లు మాట్లాడుకుని ఉద్యోగ కల్పన చేయాలని, అక్కడే కలెక్టర్‌లకు ఆదేశాలిచ్చారు. ‘టీడీపీ వారు పగ తీర్చుకోవడంలో భాగంగా 41 కాంటూరులో ఉన్న వాళ్లని 45లోకి చేర్చారు. పూర్తిగా ముంపులో ఉన్నప్పటికీ ఫస్ట్‌ ఫేజ్‌లోకి తీసుకెళ్లలేదు. దీని వల్ల గిరిజనులకు నష్టం. గత ప్రభుత్వ పొరపాటు ఇది. వరదల్లో మునిగినందున కుక్కునూరు ఎ బ్లాక్‌కు పరిహారం ఇవ్వాలి. ఆర్‌ అండ్‌ ఆర్‌ అందిస్తే, తాడువాయిలో పునరావాస కాలనీకి వెళ్లిపోతాం’ అని మాదిరాజు వెంకన్నబాబు, కేసగాని శ్రీనివాస గౌడ్, కుక్కునూరు సర్పంచ్‌ రాయి మీనా, స్థానికులు విన్నవించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement