ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌ | CM Jagan Attends International Womens Day Celebration At Vijayawada | Sakshi
Sakshi News home page

ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్‌

Published Tue, Mar 8 2022 8:00 AM | Last Updated on Tue, Mar 8 2022 9:33 PM

CM Jagan Attends International Womens Day Celebration At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ పేరుతో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తూ ఏమన్నారంటే..

మన మహిళలకు దక్కిన గౌరవం:
ఈరోజు ఇక్కడ మహిళా ప్రపంచాన్ని చూస్తుంటే, మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ఇక్కడికి రాలేకపోయిన అందరు అక్కచెల్లెమ్మలకు మీ అన్న, మీ తమ్ముడు జగన్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు మన సమాజంలో, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు అందరూ ప్రతినిధులు. ఎక్కడైనా ఏ సభలో చూసినా నాయకులు స్టేజ్‌ మీద ఉంటే ప్రజలు కింద ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఇటు స్టేజ్‌ మీద, అటు స్టేడియం నిండా ఈ వేల మందిలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరు ఎంపవర్డ్‌ ఉమెన్‌. ప్రతి ఒక్కరు సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తున్నారు. 

ఆమె మాటలు గుర్తుకొస్తున్నాయి:
మీలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే అయిన్‌ రైన్డ్‌ అనే మహిళ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ‘నేను ఒక స్త్రీని కాబట్టి, నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న’.. నిజంగా ఆమె చెప్పిన మాటలు, ఆ అర్థం ఈ రోజు ఇక్కడ కనిపిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలోనూ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మ విశ్వాసం ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో నిదర్శనంలా కనిపిస్తోంది. 

ఇంత మంది ప్రజా ప్రతినిధులు:
నా ఎదురుగా ఉన్న ఈ అక్కచెల్లెమ్మల్లో దాదాపు 99 శాతం మంది వార్డు మెంబర్లుగానో, సర్పంచ్‌లుగానో, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగానో, మున్సిపల్‌ కౌన్సిలర్లుగానో, మున్సిపల్‌ ఛైర్మన్లుగానో, కార్పొరేటర్లుగానో, మేయర్లుగానో లేదా ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానో, డైరెక్టర్‌గానో ఉన్నారు. ఇంకా నా మంత్రివర్గ సహచరులైన అక్కచెల్లెమ్మలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మహిళా కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు. బహుషా దేశ చరిత్రలో ఇటువంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదని గర్వంగా చెబతున్నాను.

ఇంటింటా చెప్పండి:
ఇది మన ఆధ్వర్యంలో, మన ప్రభుత్వంలో జరుగుతుంది అంటే, ఇదంతా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో జరుగుతుందని తెలియజేస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో లభించిన ఈ అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగించామో, ఎలా అడుగులు వేశామో క్లుప్తంగా ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. ఈ నిజాలు, సందేశాన్ని గ్రామ గ్రామాన, ప్రతి నగరంలో ప్రతి ఇంట్లో చెప్పాలని సవినయంగా కోరుతున్నాను.

రాజకీయ సాధికారత:
రాజకీయ సాధికారత పరంగా మనం ఏం చేశామో మీ ముందుంచుతున్నాను. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఏ డిమాండ్లు లేకపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం ఇచ్చేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నాను.

నామినేటెడ్‌ పదవుల్లో 51 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదే. మొత్తం 1,154 డైరెక్టర్‌ పదవుల్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన పదవులు 586 అని గర్వంగా చెబుతున్నాను. 202 మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చాం. అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం అక్కచెలెక్లమ్మలకు కేటాయించాం.

అంతే కాకుండా మనం ఇచ్చిన పదవులు చూస్తే, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్‌ ఛైర్మన్‌గా నా సోదరి జకియాఖాన్‌ను నియమించాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నా మరో సోదరి, ఎస్టీ మహిళ పుష్పశ్రీవాణిని, రాష్ట్ర హోం మంత్రిగా నా మరో దళిత సోదరి సుచరితను నియమించాం. రాష్ట్ర తొలి చీఫ్‌ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నా సోదరి నీలం సాహ్నిని నియమించాం.

జడ్పీ ఛైర్మన్లు.. ఆ 13 పదవుల్లో 7గురు నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. అంటే అక్షరాలా 54 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 26 జడ్పీ వైస్‌ఛైర్మన్‌ పదవుల్లో 15 మంది, అంటే 58 శాతం నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇంకా 12 మేయర్‌ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్‌ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. మొత్తం మున్సిపల్‌ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే, వారిలో అక్కచెల్లెమ్మలకు 54 శాతం అంటే, 361 పదవులు దక్కాయి.

ఇటీవల 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైయస్సార్‌సీపీ విజయం సాధించింది. వాటిలో అక్షరాలా 45 మంది, అంటే 64 శాతం నా అక్కచెల్లెమ్మలే ఛైర్‌పర్సన్లుగా ఉన్నారు. ఇంకా 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది, అంటే 55 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేట్లు చేశామని గర్వంగా చెబుతున్నాను. సర్పంచ్‌ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేలా చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నాను.

సచివాలయాలు–వలంటీర్లు:
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన దాదాపు 2.60 లక్షల  వలంటీర్‌ ఉద్యోగాల్లో 53 శాతం నా చెల్లెళ్లు ఉన్నారు. ఇంకా దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తుండగా, వారిలో 51 శాతం నా చెల్లెమ్మలు ఉన్నారు. దేశంలో 28 రాష్ట్రాల చరిత్రలో మనకు సరిసమానంగా ఆడపడుచులను బలపర్చిన ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు.

పథకాలు-అక్కచెల్లెమ్మలు:
ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఉందో లేదో మీరే చెప్పాలి.

అమ్మ ఒడి:
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయిన తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు రూ.15 వేలు ఇచ్చే జగనన్న అమ్మ ఒడి ఉందా? ఇక్కడ 44.50 లక్షల అక్కచెల్లెమ్మలకు ఈ రెండేళ్లలో రూ.13,022 కోట్లు ఈ పథకంలో ఇచ్చాం. 

వైఎస్సార్‌ ఆసరా:
మిమ్మల్ని అడుగుతున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాల వల్ల వారు ఇబ్బంది పడొద్దని, ఆ డబ్బులు తిరిగి ఇస్తున్న వైయస్సార్‌ ఆసరా వంటి పథకం ఉందా? ఈ పథకంలో పొదుపు సంఘాలకు చెందిన 80 లక్షల అక్కచెల్లెమ్మలకు చెల్లించిన సొమ్ము రూ.12,758 కోట్లు. మొత్తంగా 4 విడతల్లో నా అక్కచెల్లెమ్మలకు అక్షరాలా రూ.25,512 కోట్లు ఇవ్వనున్నది మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం.

అంతే కాకుండా ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వ్యాపారం చేయాలనుకునే అక్కచెల్లెమ్మలకు బ్యాంకులతో మాట్లాడి అవకాశం చూపించడమే కాకుండా ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు రుణాలు క్రోడీకరించే కార్యక్రమం కొనసాగుతోంది.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ:
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం మరెక్కడైనా ఉందా? వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు కోటి మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాలా రూ.2,354 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం.

వైఎస్సార్‌ చేయూత:
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండి, ఏ పథకం అందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు వరసగా 4 ఏళ్లలో రూ.75 వేలు ఇస్తూ వైయస్సార్‌ చేయూత పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకం ద్వారా 24.95 లక్షల నా అక్కచెల్లెమ్మలకు రెండు విడతలుగా ఇప్పటి వరకు రూ.9,180 కోట్లు అందించాం. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకులు, వివిధ కార్పొరేట్‌ సంస్థలతోనూ మాట్లాడి, వారికి వ్యాపార అవకాశాలు చూపాం. ఆవులు, గేదెలు కొనుక్కుని అమూల్‌ సంస్థతో వ్యాపారం చేస్తున్నారు. రిలయన్స్, ఐటీసీ వంటి సంస్థలు వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఆ విధంగా వారికి బ్రతికే మార్గాలు కూడా చూపుతున్నాం. ఇది దేశంలో ఎక్కడైనా ఉందా?

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక:
దేశంలోనే అత్యధికంగా రూ.2500 పెన్షన్‌ ఇవ్వడమే కాకుండా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు ఈ స్థాయిలో ఇవ్వడం, అది కూడా ప్రతి నెలా ఒకటో తేదీన సెలవైనా, పండగైనా సరే ఇంటికి వెళ్లి ఏ ప్రభుత్వం అయినా ఇస్తోందా? వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకలో 61.74 లక్షల పెన్షన్లు ఇస్తుండగా, వారిలో 36.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వారికి రూ.28,885 కోట్ల పెన్షన్‌ ఇవ్వడం జరిగింది.

ఇళ్లు-ఇళ్ల స్థలాలు-ఆస్తి:
ఇల్లు లేని ప్రతి నిరుపేదకు, అది కూడా అక్కచెల్లెమ్మ పేరుతో ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా, అక్షరాలా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తూ, వాటిలో ఇళ్లు కట్టించడం దేశంలో మరెక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకమే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఇల్లు పూరై్తన తర్వాత కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు.

విద్యాదీవెన-వసతి దీవెన:
పెద్ద చదువుల కోసం అప్పులపాలు కాకుండా ఏ ప్రభుత్వమైనా ఇక్కడి మాదిరిగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ, విద్యాదీవెన, వసతి దీవెన వంటివి అమలు చేస్తోందా? అక్షరాలా జగనన్న విద్యాదీవెన ద్వారా 21.50 లక్షల తల్లులకు రూ.6,260 కోట్లు ఇచ్చాం. ఇందులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.1800 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు మరో రూ.2,305 కోట్లు జమ చేశాం. 

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ:
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద గర్భిణిలు, బాలింతలకు మంచి ఆహారం అందజేస్తున్నాం. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్‌వాడీలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చడం, ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రారంభిస్తున్నాం. మరోవైపు ఏడు షెడ్యూల్‌ ప్రాంతాల్లో, అంటే గిరిజన ప్రాంతాల్లోని వారికి ఇంకా మంచి పౌష్టికాహారం అందజేస్తూ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకంలో అక్షరాలా 30.16 లక్షల మందికి మేలు కలుగుతోంది. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా, మనందరి ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది దేశంలో ఎక్కడా లేదు.

వైఎస్సార్‌ కాపు నేస్తం:
వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.28 లక్షల అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, రూ.75 వేలు ఇస్తున్నాం. ఇప్పటికే రెండు దఫాలుగా రూ.982 కోట్లు ఇచ్చాం. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ పథకం అమలు చేస్తున్నాం. ఇలాంటి పథకాన్ని గత ప్రభుత్వం ఏనాడూ అమలు చేయలేదు.

ఈబీసీ నేస్తం:
వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య ఉన్న దాదాపు 3.93 లక్షల నిరుపేద ఓసీ అక్కచెల్లెమ్మలకు, ఒక్కో కుటుంబానికి ఏటా రూ.15 వేల చొప్పున వరసగా మూడేళ్లపాటు అందించనున్నాం. ఇప్పటికే రూ.589 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 

ఈ 34 నెలల్లో ఎంత మొత్తం?:
ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన మొత్తం ఏకంగా రూ.83,509 కోట్లు. అదే విధంగా పరోక్షంగా అక్కచెల్లెమ్మలకు రూ.34,841 కోట్ల లబ్ధి జరిగింది. ఆ విధంగా మొత్తంగా ఈ 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన సొమ్ము అక్షరాలా రూ.1.18 లక్షల కోట్లు. 

నిశ్శబ్ద విప్లవం:
ఇవి కాక జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైయస్సార్‌ స్వేచ్ఛ, ఇంగ్లిష్‌ మీడియమ్, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు.. ఇవన్నీ కూడా బాలికలను పెద్ద చదువులు చదివించడంలో ఒక నిశ్శబ్ద విప్లవంగా తోడ్పడుతున్నాయి.

దిశ చట్టం-దిశ యాప్‌:
ఇంకా మహిళల రక్షణ కోసం మనందరి ప్రభుత్వం ఎక్కడా జరగని విధంగా దిశ బిల్లు రూపొందించింది. నేరాల సంఖ్య తగ్గాలంటే శిక్ష విధించే కాలం తగ్గాలని చూశాం. అందుకే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా బిల్లు రూపొందించాం. అయితే ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఒకవైపు ఆ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు అందులో అంశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ తెచ్చాం. ఇప్పటి వరకు 1.13 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఫోన్‌లో ఆ దిశ యాప్‌ ఉంటే, అన్న తోడుగా ఉన్నట్లే. అక్కచెల్లెమ్మ ఆపదలో ఉంటే, ఆ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ నొక్కినా లేదా ఆ ఫోన్‌ 5సార్లు ఊపితే చాలు, నగరాల్లో అయితే 10 నిమిషాలు, గ్రామాల్లో 20 నిమిషాలు కూడా దాటకముందే పోలీసులు చేరుకుంటున్నారు. ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ పని చేస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 900 మంది అక్కచెల్లెమ్మలను కాపాడడం జరిగింది.

తగ్గిన దర్యాప్తు కాలం:
అలా అక్కచెల్లెమ్మల కాల్స్‌ అటెండ్‌ చేయడమే కాకుండా, నేరాల దర్యాప్తు, ఛార్జ్‌షీట్‌ల దాఖలులో చాలా వేగం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో, అంటే 2017లో ఆ నేరాల దర్యాప్తుకు ఒక్కో కేసుకు సగటున 169 రోజుల సమయం పడితే, ఇప్పుడు 2021లో ఒక్కో కేసు దర్యాప్తు సగటు సమయం 61 రోజులకు తగ్గిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద అచీవ్‌మెంట్‌

కేవలం 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన కేసులు మొత్తం 1,132. దేశంలో మహిళలపై నేరాలకు సంబందించి ఇంత వేగంగా దర్యాప్తు చేయడం లేదు. మహిళలపై సైబర్‌ నేరాలకు పాల్పడిన వారిపై 2,134 హిస్టరీ షీట్స్‌ను, 1,531 సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్లు ఇప్పటి వరకు ఓపెన్‌ చేయడం జరిగింది. ఇంకా సెక్సువల్‌ అఫెండర్లకు సంబంధించిన క్రైమ్‌ డేటా ఆధారంగా దాదాపు 2 లక్షల మందిని గుర్తించి, వారిని జియో ట్యాగింగ్‌ ద్వారా వెంబడిస్తున్నాం. ఎక్కడైనా అక్కచెల్లెమ్మలకు ఏ ఇబ్బంది కలిగినా ఈ ప్రభుత్వం ఊర్కోదు.

దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు:
దిశ ఫోరెన్సిక ల్యాబ్‌ల ఏర్పాటు దేశంలోనే అతి పెద్ద అడుగు. రూ.87 కోట్లు కేటాయించి, ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా సిబ్బంది నియామకం కూడా జరిగింది.

బ్రహ్మాస్త్రాలు:
దిశ యాప్‌ ఒక బ్రహ్మాస్త్రం అయితే, మరో అస్త్రం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ నియామకం. ఇది ఒక విప్లవాత్మక మార్పు.

సమానంగా చూడాలి:
పాప అయినా, బాబు అయినా ఇద్దరినీ ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. ఆడవారి మీద ఆధిపత్యం, వేధించడం, చులకన చేయడాన్ని మనందరం కలిసికట్టుగా వ్యతిరేకించాలి. అలాంటి రాక్షస గుణాలు ఏ మనిషి కూడా చేయకూడని పనులు. మారుతున్న సమాజంలో మనుషులూ ఎదగాలి. గత పాలకులు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ‘కోడలు మగ పిల్లవాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?’ అన్నారు. అదే ఇవాళ మీ అన్నగా, తమ్ముడిగా ఒక మాట చెబుతున్నాను. నాకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే.

మహిళాభ్యుదయమే లక్ష్యం:
మహిళాభ్యుదయానికి కట్టుబడి అడుగులు ముందుకు వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ అందరికి ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కేక్‌ కట్‌ చేసిన ముఖ్యమంత్రి అక్కచెల్లెమ్మలకు స్వయంగా తినిపించారు.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ..
► మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీ మహిళలకు దక్కిందని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. 

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..
► 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ..  మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలను సీఎం జగన్‌ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..
సీఎం జగన్‌ లాంటి మహిళా పక్షపాతి.. దేశంలోనే ఉండరని తెలిపారు. నారీ భేరీ సౌండ్‌.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్‌ రావాలని అన్నారు. సీఎం జగన్‌ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని తెలిపారు. సీఎం జగన్‌ మహిళలను మహారాణులను చేశారని గుర్తుచేశారు. మహిళ బావుంటే, కుటుంబం బావుంటుందని నమ్మే వ్యక్తి..  సీఎం జగన్‌ అని అన్నారు. సీఎం జగన్‌ మహిళలందరికీ దేవుడితో సమానమని రోజా తెలిపారు.


మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..
► 
మహిళ సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేయాలనేది మహానేత వైఎస్సార్‌ కల అని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధనకు సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మహిళలను దగా చేశారని తెలిపారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. 

► అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఎంపీలు బీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గొట్టేటి మాధవి, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement