ప్రజలతోనే మా పొత్తు  | CM Jagan Comments At laid foundation stone for Varikapudisela Project | Sakshi
Sakshi News home page

ప్రజలతోనే మా పొత్తు 

Published Thu, Nov 16 2023 4:03 AM | Last Updated on Thu, Nov 16 2023 10:08 AM

CM Jagan Comments At laid foundation stone for Varikapudisela Project - Sakshi

మాచర్లలో నిర్వహించిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని, పేద ప్రజల కోసమే తమ పార్టీ ఉందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెరవేర్చిన హామీలు, ప్రజలే తన ధైర్యం, నమ్మకం అని స్పష్టం చేశారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌కు, వైఎస్‌ జగన్‌కు తెలిసిందల్లా ప్రజల్లో నడవడం, ప్రజల గుండెల్లో ఉండటమేనన్నారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం కింద రూ.340.26 కోట్ల వ్యయంతో చేపడుతున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి కీలకమైన అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి బుధవారం ఆయన మాచర్లలో పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మాచర్ల నియోజకవర్గంలో పక్కనే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి ఎద్దడి దశాబ్దాలుగా మన కళ్లెదుటనే కనిపిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితులు లేవన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందలేదన్న మాదిరిగా.. సముద్రంలో ప్రయాణిస్తున్న వారికి గుక్కెడు మంచి నీరు దొరకలేదన్న చందంగా ఇన్ని దశాబ్దాల పాటు కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ ప్రాంతానికి నది నీరు దక్కలేదని చెప్పారు. ఈ పరిస్థితిలో పల్నాటి ప్రాంత రూపురేఖలు మార్చేలా ఈ రోజు రూ.340 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీరు అందిస్తామని గర్వంగా చెబుతున్నానన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..   


సభా ప్రాంగణం నిండిపోవడంతో బయటే భారీగా నిలిచిపోయిన జనం

గతంలో టెంకాయ కొట్టి మోసం 
► 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేకపోయినా, ఏ మాత్రం భూమి సేకరించకుండానే అందరిని మోసం చేసేందుకు ఇదే పథకానికి ఎన్నికలకు కేవలం నెల ముందు టెంకాయ కొట్టారు. ప్రాజెక్టు ప్రారంభం అవుతుందని నమ్మించే ప్రయత్నం చేసి నిస్సిగ్గుగా మోసం చేశారు. ఇదే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 6వ తేదీన అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చా­యి. అభయారణ్యం కావడం వల్ల నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ నుంచి కూడా ఈ ఏదాది మే నెలలో అనుమతులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూములను కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే సేకరించాం. అన్ని అనుమతులు తీసుకొచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తున్నాం.  

► ఈ లిఫ్ట్‌ను నాలుగు పంపులతో నాగార్జునసాగర్‌కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్నాం. వరిక పూడిశెల వాగు నుంచి రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటి దశ కింద 1.57 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లిఫ్ట్‌ ద్వారా 20 వేల మంది జనాభాకు తాగు నీరందించవచ్చు. దాదాపు రూ.340 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతానికి నీటిని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. 


సభా ప్రాంగణం నిండిపోవడంతో బయటే భారీగా నిలిచిపోయిన జనం


పౌరుషాల గడ్డ నుంచి అభివృద్ధి గడ్డగా..
► పల్నాడు ప్రాంతాన్ని, ఈ పౌరుషాల గడ్డను, అభివృద్ధి గడ్డగా మార్చడానికి గత 53 నెలలుగా అడు­గులు ముందుకు వేస్తూ వచ్చాం. పల్నాడును ప్రత్యేక జిల్లా చేయడమే కాకుండా మెడికల్‌ కాలేజీని కూడా తీసుకొచ్చాం. పల్నాడు గుండె చప్పుడు విన్న మనిషిగా ఈ ప్రాజెక్టు ఎంత అవసరమో నాకు తెలుసు. ఈ ప్రాజెక్టును దశల వారీగా మాచర్ల నియోజకవర్గం, తర్వాత వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి, ఆ తర్వాత ఎరగ్రొండపాలెం వరకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు, దాదాపు లక్ష మందికి తాగు నీరు అందించవచ్చు. 

► ఏ కార్యక్రమం చేసినా అందులో చిత్తశుద్ధి, నిజాయితీ ఉండాలి. ప్రజలను, రైతులను, అక్కచెల్లెమ్మలను, చదవుకుంటున్న పిల్లలను మోసం చేయాలనే ఆలోచనతో అడుగులు వేస్తే ఏం జరుగుతుందనేది 2019లోనే ప్రజలు గట్టిగా చెప్పారు. 175 నియోజకవర్గాలకు గానూ చంద్రబాబు నాయుడిని కేవలం 23 స్థానాలకే పరిమితం చేస్తూ తీర్పునిచ్చారు. 

► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కూడా ప్రజల్ని ప్రధానంగా పేద వర్గాలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను, నా నిరుపేద వర్గాలందరికీ కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా సాధికారతను ఇవ్వడానికి 53 నెలలుగా మనందరి ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి రూపాయి ఖర్చు చేసింది. మీ బిడ్డ బటన్‌ నొక్కడం ద్వారా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా రూ.2.40 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యింది. నాన్‌డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ లాంటి కార్యక్రమాల ద్వారా మరో రూ.1.70 లక్షల కోట్లు.. వెరసి మొత్తం రూ.4.10 లక్షల కోట్ల పైచిలుకు మేర ప్రజలకు లబ్ధి కలిగించింది. కోవిడ్‌ అతలాకుతలం చేసినప్పటికీ.. ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గినా సంక్షేమాభివృద్ధి మాత్రం ఆగలేదు.  

► మీ బిడ్డ 53 నెలల పాలనలో పల్నాడు జిల్లా అయింది. పల్నాడుకు రెవెన్యూ డివిజన్‌ వచ్చింది. జిల్లాకో మెడికల్‌ కాలేజీ, గ్రామ గ్రామాన సచివాల­యాలు, వలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటా జల్లెడ పట్టి వైద్యం అందించే ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతోంది. ఇంగ్లిష్‌ మీడి­యం బడులొచ్చాయి.    


సభలో థ్యాంక్యూ జగనన్న అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న మహిళలు


మోసాల మాటలు నమ్మగలమా?
► గత చంద్రబాబు పాలనలో మనం మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాల చరిత్ర చూశాం. ఈ పెద్దమనిషి 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ కనీసం ఒక మంచి పని చేశానని చెప్పి ఓటు అడగలేడు. అందుకే మళ్లీ మోసం చేసేందుకు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచేందుకు వెనుకాడడు. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌ కారిస్తాను.. ఓటు వేయండి అని చంద్రబాబు అడుగుతాడు. 34 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా కుప్పం నియోజకవర్గానికి నీరిచ్చిన చరిత్ర లేదు. ఇలాంటి వ్యక్తి మన మాచర్లకు, పల్నాడుకు మరో ప్రాంతానికి నీరు ఇస్తానని చెబితే నమ్మగలమా? కన్నతల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు కొనిస్తానని ఒకడు అన్నాడట. ఈ పెద్దమనిషిని చూస్తుంటే ఆ మాటలు గుర్తుకొస్తాయి. చివరికి కుప్పానికి నీళ్లు కావాలన్నా.. కుప్పానికి రెవెన్యూ డివిజన్‌ కావాలన్నా చేసేది మీ బిడ్డే.  

► పొదుపు సంఘాల రుణాల్ని మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు. దీంతో ఏ గ్రేడ్, బీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. చివరకు నా అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశాడు. ఒక జగనన్న అమ్మ ఒడి గానీ, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ గానీ, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ ఏనాడైనా చేయగలిగాడా? ఇప్పుడు చేస్తానంటే నమ్మగలమా?  

పల్నాడు జిల్లా మాచర్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు 

► ఒకాయన ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటాడట. లేస్తే మనిషిని కాదంటాడట. కానీ మంచంలోంచి లేవడు. చంద్రబాబు పరిస్థితీ ఇంతే. తాను చేసిన మంచి ఏమిటనేది ఎప్పుడూ చెప్ప డు. ఆయన 2000లో ఉంటే 2047 గురించి చెబుతాడు. ఇప్పుడేం చేస్తావంటే చెప్పడు. 50 ఏళ్ల విజన్‌ అంటాడు. 50 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోందని చెబుతాడట. 50 ఏళ్ల తర్వాత ఎవడుంటాడో..ఎవడు పోతాడో? ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెట్టడం ఈజీ కదా అని ఆలో చిస్తాడు. ఇలాంటి బాబు మాటలు నమ్మగలమా?

వెన్ను పోటు వీరుడు
►  సొంత కూతురును ఇచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వాడు, రాష్ట్రంలోని కోటీ 50 లక్షల కుటుంబాలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా?   ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని అహంకారంతో మాట్లాడాడు. ముస్లింలకు, ఎస్టీలకు కనీసం మంత్రి పదవి ఇవ్వని ఈ పెద్దమనిషి.. సమాజంలో ఏ వర్గానికైనా ఏనాడైనా న్యాయం చేశాడా? ఇలాంటి ఆయన నేను మారాను అంటే మనం నమ్మగలమా?  

► తన కొడుకు, మనవడు.. వీళ్లు వెళ్లే బడులు మాత్రం ఇంగ్లిష్‌ మీడియం. ఆ కొడుక్కు తెలుగు మా ట్లాడటమూ సరిగా రాదు. పోనీ ఇంగ్లిష్‌ వస్తుందా అంటే అదీ రాదు. అది వేరే విషయం. మన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మన నిరుపేద వర్గాల పిల్లలు వెళ్లే మన ప్రభుత్వ బడులు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంకు మారకూడదట. అవి తెలుగు మీడియంలోనే ఉండాలట.  

► గతంలో ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నాడు. జాబు రావాలంటే బాబు రావాలి అని ఊదరగొట్టి మోసం చేశాడు. స్వాత­ంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా మన ప్రభుత్వం వచ్చేదాక గవర్నమెంట్‌ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మరో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిది.  

► మన అదృష్టం కొద్దీ చంద్రబాబు దిగాడు గానీ, దిగకపోయి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదు. కరెంటు కంపెనీలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఉండేవి కాదు. ప్రభుత్వ రంగంలో ఏ కంపెనీలు ఉండేవి కావు. అన్నింటినీ నీట్‌గా అమ్మేసి మూసేసేవాడు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆర్టీసీ ప్రభుత్వంలో కలిసింది. ఆస్పత్రులు, స్కూళ్లు మారాయి.  

► రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న ఈ పెద్దమనిషిది ఉచిత విద్యు త్‌ కోసం రైతులు ధర్నాలు చేస్తే కాల్చి చంపిన చరిత్ర. రైతులకు రూ.87,612 కోట్ల రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేస్తానన్న పెద్దమనిషి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని టీవీల్లో అడ్వర్టయిజ్‌మెంట్లు ఊదరగొట్టిన ఈ పెద్దమనిషి.. అధికారంలోకి వచ్చాక నిండా ముంచాడు. ఈరోజు మైకు పట్టుకొని అది చేస్తా ఇది చేస్తాఅంటే నమ్మగలమా? 
 

పల్నాడు రూపురేఖలు మార్చాలన్నది నా తపన
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
సాక్షి, అమరావతి: పుట్టిన బిడ్డకు అందని తల్లిపాల మాదిరిగా.. పక్కనే కృష్ణా నది ప్రవ­హిస్తున్నా పల్నాడు ప్రాంతానికి నీరు దక్కని పరిస్థితి ఉందని, కొన్ని దశాబ్దాలుగా అక్కడ దుర్భర పరిస్థితులు దర్శనమిస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అందుకే ‘పల్నాడు రూపురేఖలు పూర్తిగా మార్చా­లనే తపన, తాపత్రయంతో ఇవాళ రూ.340.26 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపో­తల పథకం ద్వారా కృష్ణా జలాలు అందించే బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపన చేశా­నని చెప్పడానికి సంతోషిస్తున్నా’ అని బుధ­వా­రం ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.   

నూజివీడులో రేపు సీఎం పర్యటన
సాక్షి, అమరావతి: ఈ నెల 17న (శుక్రవారం) ఏలూరు జిల్లా నూజివీడులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్య­టించనున్నారు. 2003కు మందు అసైన్డ్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్డ్‌ భూముల పట్టాల పంపిణీ కార్యక్ర­మంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నూజివీడు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనం­తరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


బాబు – దత్త పుత్రుడి మోసం
► తన బినామీ భూముల ధర బాగా పెరగాలన్న దుర్భుద్ధితో ఈ పెద్దమనిషి అమరావతిని ఒక రాజధానిగా భ్రమ కల్పించాడు. మూడు ప్రాంతాలకు ఏనాడైనా సమన్యాయం చేశాడా? తన హయాంలో పేదలకు కనీసం సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మనం 31 లక్షల ఇంటి స్థలాలను నా అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపేందుకు కేసులు వేశారు. కులాల మధ్య సమతుల్యం దెబ్బ తింటుందని, ఏకంగా ఎదురు దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు.  

► 2014లో ఇదే దత్తపుత్రుడు చంద్రబాబుతో కలిసే పోటీ చేశాడు. కలిసే మేనిఫెస్టో రిలీజ్‌ చేశాడు. ఆ మేనిఫెస్టోకు నాదీ పూచీ అన్నాడు. వీళ్లద్దరూ అయితే సరిపోరని వీరికి తోడు మోడీ గారి పేరు కూడా తెచ్చుకున్నారు. దారుణంగా ప్రజలను మోసం చేశారు. ఇది గత చరిత్ర. మేమంతా కలిసికట్టుగా మేనిఫెస్టోలో 5 హామీలు చెబితే... నేను దత్తపుత్రుడు కలిశాము కాబట్టి మరో 6 హామీలు ఇస్తున్నామని చెబుతారు. ఇవాళ వీళ్లు మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా వీళ్లు మనుషులేనా అనిపిస్తుంది.  

► ఇలాంటి రాజకీయాలు, పొత్తులు మీ బిడ్డకు చేత కాదు. ఒక వైఎస్సార్‌కు గానీ, ఒక జగన్‌కు గానీ తెలిసిందల్లా ఒక్కటే. ప్రజల్లో నడవటం, ప్రజల గుండె చప్పుడు వినడం. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఒక్కటే ఒక్కటి చెబుతాను. నేను విన్నాను, నేను ఉన్నానని మాత్రమే మీ బిడ్డ జగన్‌ చెబుతాడు.  అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటను, ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అక్కచెల్లెమ్మల బతుకుల్లో మార్పు తీసుకురావడానికి తపిస్తూ అడుగులు వేశాను.  

► మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి కొన్ని అభివృద్ధి పనులు అడిగాడు. ఇవాళ జరుగుతున్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులే కాకుండా ఇక్కడ ఉన్న సీహెచ్‌సీని 100 పడకలకు అప్‌గ్రేడ్‌ చేయమని కోరారు. దాన్ని మంజూరు చేస్తున్నాను.  

► ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జెడ్పీ చైర్మన్‌ హెన్రీ క్రిష్టినా, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు పాల్గొన్నారు. 

ప్రాజెక్టుకు వైఎస్సార్‌ పేరు పెట్టండి
వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు డాక్టర్‌ వైఎస్సార్‌ పేరు పెట్టాలి. 15వ శతాబ్దంలో పల్నాడులో పర్యటించిన కవిసార్వభౌముడు శ్రీనా­థు డు ఇక్కడి కరువు పరిస్థితిని వివరించారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ కట్టించిన కాటన్‌న్‌దొరను గుర్తించుకున్నట్లు ఈ ప్రాంత ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ని గుర్తుంచుకుంటారు. ఇది ఆరు దశాబ్దాల కల. 1996లో శంకుస్థాపన చేసి, మా ప్రాంత రైతాంగాన్ని జిత్తులమారి చంద్రబాబు మోసం చేశాడు.

జగనన్న ఇచ్చిన మాటను నిలబెట్టు­కుంటూ ఇవాళ శంకుస్థాపన చేశారు. జగనన్న ఆదేశాల మేరకు నరస­రావు­పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అనుమతుల కోసం ఢిల్లీలో కృషి చేశారు. ఇది మాచర్ల, వినుకొండ, ఎరగ్రొండపాలెం 3 నియో­జకవర్గాల ప్రజలకు ఉపయోగకరం. వరుసగా మూడు­సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేను నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే ఉంటాను. 
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement