వైఎస్సార్ బీమా చెక్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో అధికారులు, లబ్ధిదారులు
ఎవరైనా శతమానం భవతి అని దీవిస్తుంటారు. అంటే వందేళ్లు వర్ధిల్లండి అని అర్థం. అలా రాష్ట్రంలో అందరూ నిండు నూరేళ్ల ఆయుష్షుతో జీవించాలి. ప్రతి కుటుంబం చల్లగా ఉండాలి. ఏ ఒక్కరికీ ఎటువంటి ఆపద రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనది. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలి.
సాక్షి, అమరావతి: బీమా పథకం నుంచి కేంద్రం తప్పుకున్నా.. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం భారం భరిస్తూ ఏకంగా 1.32 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకాన్ని వర్తింప చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి రాకూడదని, అలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు. తన పాదయాత్రలో అలాంటి గాథలు చాలా చూశానని.. విన్నానని, అందుకే దురదృష్టవశాత్తు కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆదుకునే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చామన్నారు.
అలాంటి కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద ఆర్థిక సాయం అందిస్తూ పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైఎస్సార్ బీమాను అమలు చేసే కార్యక్రమాన్ని గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజంగా కూలీ పనులు చేసుకుంటున్న.. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటివి లేకుండా అసంఘటిత రంగంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ బతుకు బండిని లాగుతున్న దాదాపు 1.32 కోట్ల కుటుంబాలు మన రాష్ట్రంలో వైఎస్సార్ బీమా పరిధిలోకి వస్తాయన్నారు. కుటుంబ పెద్దను ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల 2021–22 సంవత్సరానికి గాను రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ పథకం కోసం ఈ రెండేళ్లలో మనందరి ప్రభుత్వం రూ.1,307 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఒక్క రూపాయి భారం పడనివ్వం
► గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల విపరీతమైన ధ్యాస పెట్టాం. అందులో భాగంగా ఆరోగ్యశ్రీలో చాలా చాలా మార్పులు చేశాం. ఆ పథకం రూపురేఖలు మార్చాం. రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. గతంలో వెయ్యి లోపు ఉన్న రోగాలను, ప్రొసీజర్స్‌ను ఏకంగా 2,450కి వర్తింపచేసేలా కార్యాచరణ చేశాం.
► ఇవన్నీ చేసినప్పటికీ ఒక్కోసారి మన బతుకులు మన చేతిలో ఉండవు. సంపాదించే వ్యక్తి కనుక చనిపోతే ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈ బీమా పథకం తీసుకొచ్చాం.
► పేద కుటుంబం మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నాం.
► 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద ప్రమాదంలో మరణించినా లేక శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇచ్చేలా వైఎస్సార్ బీమాను రూపొందించాం.
ఈ నిర్ణయం వెనుక..
► కేంద్రం 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం నుంచి తప్పుకుంది. దీనికి తోడు ఇన్సూరెన్స్ కన్వర్జెన్స్ స్కీం స్థానంలో అర్హుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల ద్వారా బీమా చేయించాలని ఆదేశించింది. దీంతో 1.21 కోట్ల కుటుంబాలకు బీమా ప్రీమియం మొత్తం రాష్ట్రమే చెల్లించింది.
► అయితే బ్యాంకులు వ్యక్తిగత ఖాతాలు తెరిచి, ఆ ఖాతాల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు కట్టి.. ఎన్‌రోల్ చేయించలేకపోతున్నాయి. కేవలం 62.5 లక్షల మంది లబ్ధిదారులనే బ్యాంకులు ఎన్‌రోల్ చేయగలిగాయి. మిగిలిన 58.5 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించినా బ్యాంకులు ఎన్‌రోల్ చేయలేకపోయాయి.
► అర్హులై ఉండి బ్యాంకులలో ఎన్‌రోల్ కాకుండా మిగిలిపోయిన వారు, ఎన్‌రోల్ అయినా 45 రోజుల లీన్ పీరియడ్ పూర్తికాక ముందే దురదృష్టవశాత్తు గత సంవత్సరం మరణించిన వారు దాదాపుగా 12,039 మంది ఉన్నారు. ఆ కుటుంబాలను అలానే వదిలేయలేక, మన ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఆ బీమా క్లెయిమ్స్ రూ.254.72 కోట్లు చెల్లించింది. ఈ కారణాలన్నింటి వల్ల రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లింది.
గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ
► ఏ నెలలో ఘటన జరిగితే ఆ నెలలోనే సెటిల్ అయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాం.
► ఇకపై ఎలాంటి ఘటన జరిగినా ఆ నెలలోనే చెల్లింపులు జరుగుతాయి. వలంటీర్లు, గ్రామ సచివాలయాలు తోడుగా ఉంటాయి. అదే గ్రామంలో అప్లికేషన్ పెట్టగానే వెరిఫికేషన్ జరుగుతుంది.
క్లెయిమ్స్ జాయింట్ కలెక్టర్‌కు వెళతాయి. అదే నెలలోనే క్లెయిమ్ సెటిల్ అయ్యేలా మార్పులు తీసుకొచ్చాం. దీని వల్ల త్వరితగతిన అప్పటికప్పుడే క్లెయిమ్ సెటిల్ అవుతుంది. 1.32 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment