ఒక్క స్కూలు కూడా మూత పడకూడదు | CM Jagan Comments In Nadu Nedu Review On Schools and Anganwadis | Sakshi
Sakshi News home page

ఒక్క స్కూలు కూడా మూత పడకూడదు

Published Thu, May 20 2021 3:49 AM | Last Updated on Thu, May 20 2021 8:12 AM

CM Jagan Comments In Nadu Nedu Review On Schools and Anganwadis - Sakshi

అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పుస్తకం, సీడీలను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: కొత్త ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి స్కూలు వినియోగంలో ఉండాల్సిందేనని  పేర్కొన్నారు. స్కూళ్లు, అంగన్‌ వాడీల్లో నాడు–నేడు, పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం,  ఎఫెక్టివ్‌ ఫౌండేషనల్‌ ఎడ్యుకేషన్‌ మార్గదర్శక ప్రణాళికపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్‌ వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లిష్‌ పుస్తకం, సీడీలను ఆవిష్కరించారు. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను అధికారులు సీఎంకు చూపించారు. కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు ఉన్నాయని చెబుతూ కొన్ని కొత్త ప్రతిపాదనలను చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. శిక్షితుడైన టీచర్‌ పీపీ(ప్రీ ప్రైమరీ)–1, పీపీ–2 పిల్లలకూ అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశమన్నారు. ఈ దశలో పిల్లల మెదడు చురుగ్గా పని చేస్తుందని, అప్పటికే దాదాపు 80 శాతం పైగా అభివృద్ధి చెంది ఉండటం వల్ల వారిలో గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల పీపీ–1, పీపీ–2పై దృష్టి సారించి, మంచి బోధన లభించేలా చూస్తే ఆపై తరగతులతో అనుసంధానం బావుంటుందని వివరించారు. ఈ దిశగా అధికారులు మరోసారి కూర్చొని చర్చించి, మరింత మంచి ఆలోచనలు చేయాలని, ఈ నెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దామని  సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..


మనిషిని కష్టపెట్టి ఏమీ సాధించలేం
► మనిషిని కష్టపెట్టి, బాధ పెట్టి ఏమీ సాధించలేం. ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పని తీరు సాధించుకోగలం. అసహనాన్ని ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదు. మనం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోవడం ద్వారా  మంచి పనితీరు రాబట్టుకోవాలి. 
► స్కూళ్ల నిర్వహణ, టీచర్లను వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి. పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే బడి ఉండాలి. ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుంది.
► నాడు–నేడు కింద అన్ని రకాల స్కూళ్లు, అంగన్‌వాడీలను అభివృద్ధి చేస్తున్నాం. ఏ పాఠశాలనూ మూసివేసే పరిస్థితి ఉండకూడదు. అవసరమైన చోట అదనపు తరగతి గదులను నాడు–నేడు కింద నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి.

అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి
► రూపొందించిన పాఠ్యాంశాలను అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు బోధించగలగాలి. ఇందుకోసం అంగన్‌ వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి. పెద్ద వాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లిష్‌లో మంచి విద్యను అందుకోవాలి. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోడంతో పాటు పాఠ్య ప్రణాళిక పటిష్టంగా ఉండేలా చూడాలి.
► నాడు – నేడు కింద బాగు చేసిన భవనాల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ఏ సమయానికి ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఓపీ తయారు చేయాలి. రూ.వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాల్సి ఉంటుంది.
► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొత్త ప్రతిపాదనలు ఇలా.. 
► రాష్ట్రంలో 10 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్లు, 30 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్న స్కూళ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల పిల్లల సంఖ్య తక్కువ.. టీచర్లు ఎక్కువగా ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయి. 
► స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు చేయాలి.
► పిల్లలు తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకునే విషయం పరిశీలించాలి. అప్పుడు అంగన్‌వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారు.
► తద్వారా శిక్షితులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశ నుంచే మంచి బోధన ఇవ్వగలరు. అలాగే స్కూళ్లు కూడా సమర్థవంతంగా వినియోగమవుతాయి. అవకాశం ఉన్న చోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కూడా హైస్కూల్‌ పరిధికి తీసుకురావాలి.
► అవసరమైన చోట అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లుగా మార్చాలి. 
► స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, టీచర్ల సేవలను అదే రీతిలో వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించాలి. విద్యాభ్యాసంలో గట్టి పునాదుల కోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement