సాక్షి, అమరావతి : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్‌ఏ)లకు డీఏ పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వీఆర్‌ఏలకు రూ.300 ఉన్న డీఏను చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేయడంతో దీన్ని తిరిగి పునరుద్ధరించాలంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) సీఎంను కలిసి కోరగా తక్షణం సానుకూలంగా స్పందించినట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దీనికి సంబంధించిన ఫైల్ సర్క్యులేట్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడమే కాక అందులో డీఏను రూ.300 నుంచి రూ.500కు పెంచుతూ సీఎం సంతకం చేసినట్లు తెలిపారు. డీఏను పునరుద్ధరించడంతోపాటు దానిని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపట్ల వీఆర్‌ఏలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఈ నిర్ణయంవల్ల సుమారు 20,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వీరికి డీఏ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర రెవెన్యూ శాఖాధికారులకు ఏపీజీఈఎఫ్ తరఫున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
వీఆర్‌ఏలకు గతంలో కేవలం రూ.300గా ఉన్న డీఏను నేడు రూ.500కు పెంచే ఫైలును ఆమోదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన బొప్పరాజు, పలిశెట్టి దామోదర్‌రావు, చేబ్రోలు కృష్ణమూర్తిలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈ సమస్యపై ముఖ్యమంత్రికి సిఫార్సు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.
గత ప్రభుత్వం వీఆర్‌ఏల డీఏను రద్దుచేస్తే ఈ ప్రభుత్వం పునరుద్ధరించడమే కాక.. రూ.300 నుంచి రూ.500కు పెంచడంపై ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వాసా దివాకర్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడులు కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment