‘‘మతం అనేది నాలుగు గోడల మధ్య దేవుడికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధం. ఆ గది బయటకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి సాటివారికి గౌరవం ఇవ్వాలి. మానవత్వం అంటే ఇదే. దీనినుంచి పక్కకు వెళ్తే సమాజంలో అశాంతి మొదలవుతుంది’’
– ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్ సీపీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలతో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా ముందుకు వెళ్లాలని సూచించారు. పోలవరం, ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణను ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సూచించారు. ఎంపీలతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ముఖ్యాంశాలు ఇవీ..
పోలవరంపై పట్టుబట్టాలి..
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.1,569.86 కోట్ల బకాయిలను రాబట్టేందుకు పార్లమెంట్‌లో ప్రస్తావించాలి. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం వల్ల పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేసింది. రివిజన్ కమిటీ నిర్ణయించిన ప్రకారం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను కేంద్రం ఆమోదించేలా ఎంపీలు పార్లమెంట్‌లో ఒత్తిడి తేవాలి.
పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రత్యేక హోదా.. మెడికల్ కాలేజీలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా పట్టుబట్టాలి. రాష్ట్రంలో మొత్తం 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా మూడు కాలేజీలకు కేంద్రం ఆమోదం తెలిపింది. మన ఎంపీల కృషి వల్ల ఈ కాలేజీలకు కేంద్రం నిధులు కూడా అందిస్తోంది. మిగిలిన కాలేజీల విషయంలోనూ ముందుకెళ్లేలా గట్టిగా ప్రయత్నించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నుంచి రూ.4,282 కోట్ల బకాయిలను రాబట్టేలా పార్లమెంట్‌లో ప్రస్తావించాలి. 14, 15వ ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు రాష్ట్రానికి రావాల్సిన రూ.1,842.45 కోట్లు నిధులు ఇవ్వాలని కోరాలి. నివర్ తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎన్టీఆర్‌ఎఫ్ కింద కేంద్రం ఇవ్వాల్సిన రూ.2,255.70 కోట్ల గురించి పార్లమెంట్‌లో అడగాలి.
విద్యుత్ ఒప్పందాల భారం తగ్గాలి..
ఎన్టీపీసీకి చెందిన కుడ్గీ, వల్లూరు థర్మల్ ప్రాజెక్టుల నుంచి అత్యధిక ధరలతో విద్యుత్ కొనేందుకు గత సర్కారు ఒప్పందాలు చేసుకుంది. యూనిట్ రూ.6 చొప్పున ఒకటి, రూ.9 చొప్పున చేసుకున్న మరో ఒప్పందాలను కేంద్రానికి ఇవ్వడం (సరెండర్ చేయడం) ద్వారా డిస్కమ్‌లపై రూ. 800 కోట్ల భారం తగ్గింది. వీటి పీపీఏలు రద్దు చేయడం వల్ల ఏటా రూ.350 కోట్ల ఫిక్స్‌డ్ ఛార్జీల చెల్లించాల్సిన ఇబ్బంది నుంచి విద్యుత్ సంస్థలు గట్టెక్కుతాయి. రాష్ట్రంలో విద్యుత్ ధరలను తగ్గించడం, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్తును అందించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన టెండర్లను పిలుస్తోంది. దీనికి కేంద్రం నుంచి అనుమతులను సాధించే దిశగా ఎంపీలు కృషి చేయాలి. దిశ బిల్లుకు అవసరమైన సవరణలు చేసి తిరిగి కేంద్రానికి పంపాం. దీనికి త్వరగా ఆమోదం లభించేలా ప్రయత్నించాలి.
కర్నూలుకు హైకోర్టు తరలింపుపై..
రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లులను ఆమోదించాం. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై తిరిగి రీ నోటిఫికేషన్ ఇవ్వాలని పార్లమెంట్‌లో ప్రస్తావించాలి. ఈ అంశాన్ని బీజేపీ కూడా వారి మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని పార్లమెంట్ వేదికగా గుర్తు చేయాలి. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.3,707.77 కోట్ల బకాయిల గురించి అడగాలి. పని దినాలను వంద నుంచి 150 రోజులకు పెంచాలని డిమాండ్ చేయాలి. వెనకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.700 కోట్ల బకాయిల విడుదలకు కృషి చేయాలి. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతోపాటు రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ.18,830.87 కోట్లు కేంద్రం ఇవ్వాలనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి తేవాలి.
ట్రిబ్యునల్స్ ఏర్పాటు కావచ్చు..
విశాఖ రైల్వే జోన్ విషయంలో అలసత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించాలి. అంతరాష్ట్ర జల వివాదాల బిల్లు పార్లమెంట్‌లో చర్చకొచ్చే వీలుంది. కొన్ని ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయవచ్చు. నదులను జాతీయం చేసి అనుసంధానించి ఎక్కడ ఎన్ని నీళ్లు వస్తాయో దామాషా పద్ధతిలో, ఏ రాష్ట్రాల్లో ఎంత భూవిస్తీర్ణం ఉందనే దాన్ని బట్టి 15 రోజులకోసారి నీళ్లను పంచుకోవాలనేది యోచనను కేంద్రానికి తెలియచేయాలి. మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెసీ, డీఎన్‌ఏ టెక్నాలజీ, పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ఎన్‌ఆర్‌ఐ వివాహ నియంత్రణ, సినిమాటోగ్రఫీ, డామ్‌సేఫ్టీ, పోర్టు అథారిటీ బిల్లులు చర్చకొచ్చే వీలుంది. మైనర్ పోర్టులపై కేంద్రం అధికారం తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనిపై బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందాం.
దాడుల ఘటనలపై చర్చకు సిద్ధం కావాలి..
ఇటీవల దేవాలయాల్లో జరిగిన ఘటనలపై చర్చకు ఎంపీలు సమగ్ర వివరాలతో సిద్ధం కావాలి. ఈ కేసుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఉన్నట్లు విచారణలో తేలింది. శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహాన్ని టీడీపీకి చెందిన వ్యక్తులు తొలగించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇది జరిగింది. ఈ ఘటనకు వైఎస్సార్ సీపీ వారు బాధ్యులని తొలుత ప్రచారం చేశారు. ఈనాడు విలేఖరి కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సీసీ కెమెరా విజువల్స్ బయటపడిన తర్వాత చంద్రబాబు తన వాదనను మార్చారు. వైఎస్సార్ విగ్రహాన్ని పెడుతున్నారు కాబట్టి నంది విగ్రహం పెట్టడం తప్పు ఎలా అవుతుంది అంటూ మాట మార్చారు. ఒకరి విగ్రహాలను అడ్డుకోవడానికి ఆలయాల్లోని విగ్రహాలను తొలగించి పెడతారా?
వ్యవసాయ చట్టాలపై స్పష్టత...
కేంద్రం తీసుకొచ్చే 11 బిల్లుల విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంపై ఎంపీలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలపై స్పష్టత ఇచ్చారు. ధాన్యం ఎవరు కొనుగోలు చేసినా, రైతులకు కచ్చితంగా కనీస మద్దతు ధర లభించేలా చూడాలన్నది ప్రభుత్వ విధానమన్నారు. ‘ఎక్కడ కొనుగోళ్లు జరిగినా కనీస మద్దతు ధరకు తగ్గకుండా ఉండాలి. ఎవరు కొన్నా ఎంఎస్‌పీ కంటే తక్కువకు కొనకూడదు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ షరతులతో కూడిన మద్దతు ఇచ్చింది. వాటిని అమలు చేయాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేయాలి’ అని సూచించారు.
దేవాలయాలపై దాడుల్లో టీడీపీ ప్రమేయం: విజయసాయిరెడ్డి
దేవాలయాల్లో జరిగిన దాడుల ఘటనల గురించి సమగ్ర వివరాలతో పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రకటించారు. పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాలయాలపై దాడులకు సంబంధించి పది కేసుల్లో టీడీపీ కార్యకర్తల ప్రమేయం ఉందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తెస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహాన్ని దేవాలయం నుంచి పెకలించి నడిరోడ్డుపై పెట్టిన ఘటనలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ప్రమేయం ఉందని తేలిందన్నారు. ఇందులో ఈనాడు దినపత్రిక విలేకరి పాత్ర కూడా ఉందని వెల్లడైందని, ఇవన్నీ కేంద్రానికి వివరిస్తామన్నారు. రూ.1.13 కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం అంతర్వేది రథాన్ని పునర్‌నిర్మించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment