CM YS Jagan disburses Jagananna Videshi Deevena, assured Govt support to them - Sakshi
Sakshi News home page

AP: రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం

Published Sat, Feb 4 2023 4:26 AM | Last Updated on Sat, Feb 4 2023 11:12 AM

CM Jagan Disburses Jagananna Videshi Deevena, assured Govt support to them - Sakshi

జగనన్న విదేశీ విద్యా దీవెన చెక్కును ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచి పోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ పథకం కింద విదేశీ టాప్‌ యూని­వర్సిటీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని చెప్పారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి వచ్చిన గొప్ప వాళ్లను చూసి.. ఆ స్థాయిలో కలలు కని, వాటిని నిజం చేస్తూ దేశ, రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి మానవ వనరుల మీద పెట్టినట్టేనని తెలిపారు. అందుకే రాష్ట్రంలో ఈ రంగానికి పెద్ద పీట వేశామని చెప్పారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రతిభతో ప్రపంచంలోని టాప్‌ యూనివర్సిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా చేపట్టిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలుకు శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగస్తులైన ప్రతి చెల్లెమ్మ, తమ్ముడు ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం మీపై పెడుతున్న పెట్టుబడితో రేపు మీరు మెరుగైన స్థానానికి వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అప్పుడే ప్రపంచ స్థాయిలో మన దేశ, రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

సామాన్యులకు అండగా..
– రూ.1.16 కోట్ల ఫీజుతో కార్నిగీ మిలన్‌ యూనివర్సిటీ, రూ.కోటి ఫీజుతో యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, మాస్టర్స్‌ ఇన్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేటిక్స్, బోస్టన్‌ యూనివర్సిటీ, రూ.97 లక్షల ఫీజు, రూ.88.70 లక్షల ఫీజుతో హార్వర్డ్‌ యూనివర్సిటీ.. వీటన్నింటిలో ప్రతిభతో సీటు తెచ్చుకున్నప్పటికీ పేదలు, సామాన్యులు డబ్బులు కట్టలేని పరిస్థితి. ఈ యూనివర్సిటీలో చదవగలమా అన్న పరిస్థితి. 
– తల్లిదండ్రుల మీద భారం పెట్టలేక ఎందుకు ఇంత పెద్ద యూనివర్సిటీకి వెళ్లడం.. మనకు స్తోమత లేదు కదా.. అని వెనుకడుగు వేస్తారు. ఇకపై ఆలా పెట్టుబడి పెట్టలేక వెనుకడుగు వేసే పరిస్థితి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా మీకు అండగా, తోడుగా నిలిచి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి వల్ల ఎన్నో కుటుంబాల తలరాతలు మారడమే కాకుండా   ప్రతి ఒక్కరి తలరాత మార్చే గొప్ప పరిస్థితి వస్తుంది. 

గత ప్రభుత్వ స్కీం వైట్‌ వాష్‌
– విదేశాల్లో చదివించే విషయమై గత ప్రభుత్వంలో ఉన్న స్కీం ఎలా అమలు జరిగేదో చూశాం. అదొక వైట్‌ వాష్‌ కార్యక్రమం. కేవలం రూ.10–15 లక్షలకు పరిమితమైన కార్యక్రమం. దీనివల్ల ప్రయోజనం అరకొరే. దీనివల్ల వారికి మంచి జరగదు. కేవలం నీరుగార్చే కార్యక్రమం తప్ప మరో ప్రయోజనం లేదు. 2016–17కు సంబంధించిన బకాయిలను కూడా పిల్లలకు చెల్లించలేదు. దాదాపు రూ.300 కోట్ల బకాయిలు ఇవ్వకపోవడంతో దాదాపు పథకాన్ని ఆపేసే పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో ఇవాళ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
– ఒకవైపు మన రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీల రూపురేఖలను మారుస్తూ విద్యా ప్రమాణాలను పెంచుతున్నాం. మరోవైపు పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నాం. దీంతో పాటు పెద్ద యూనివర్సిటీల్లో మన పిల్లలకు సీట్లు వస్తే.. వారికి తోడుగా నిలవాలన్న ఆలోచనలో నుంచే విదేశీ విద్యాదీవెన పథకం వచ్చింది.

పారదర్శకంగా ఎంపిక 
– పారదర్శకంగా టాప్‌ లిస్ట్‌ను ఎంపిక చేశాం. టాప్‌ 100 కాలేజీలు అయితే గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్‌ చేస్తామని చెప్పాం. టాప్‌ 100 – 200 వరకు ఉన్న కాలేజీలకు అయితే గరిష్టంగా రూ.75 లక్షల వరకు చెల్లిస్తామని చెప్పాం. టాప్‌ 100 కాలేజీల జాబితాలో 100 శాతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తామని గతంలో చెప్పాం. అందుకు అనుగుణంగానే రూ.1.60 కోట్ల ఫీజు కూడా కవర్‌ చేస్తున్నాం.
– 100 నుంచి 200 వరకు క్యూఎస్‌ ర్యాంకులు పొందిన వాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 100 శాతంతో రూ.75 లక్షల వరకు ఇచ్చాం. ఇవన్నీ పారదర్శకంగా చేపడుతున్నాం. తల్లిదండ్రుల మీద భారం తగ్గేలా మీ కాళ్ల మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చేలా అడుగులు వేస్తున్నాం. నాలుగు వాయిదాల్లో ఇస్తున్నాం.
– ఐ–94 వచ్చిన వెంటనే మొదటి వాయిదా ఇస్తాం. మొదటి సెమిస్టర్‌ ఫలితాల తర్వాత రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇస్తాం. రెండో సెమిస్టర్‌ తర్వాత మూడో ఇన్‌స్టాల్‌మెంట్, విజయవంతంగా నాలుగో సెమిస్టర్‌ పూర్తి చేసి మార్క్స్‌షీట్‌ అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఫైనల్‌ చెల్లింపు చేస్తాం. రూ.8 లక్షల వరకు ఆదాయం ఉన్న ఏ కుటుంబానికి అయినా ఈ పథకం వర్తింపజేసే దిశగా అడుగులు వేశాం. రెండు సీజన్లలోనూ వచ్చే అడ్మిషన్లను ప్రోత్సహిస్లూ.. వాళ్లను కూడా ఈ జాబితాలో యాడ్‌ చేసున్నాం.
– ఇప్పటి వరకు ఈ ఏడాది 213 మంది పారదర్శకంగా ఎంపికయ్యారు. వీరిలో ఎస్సీలు 30 మంది, మైనార్టీలు 35, బీసీలు 35, ఈబీసీలు 67 మంది, కాపులు 46 మంది ఉన్నారు. ఎవరికైనా మంచి ప్రతిభ ఉంటే వారందరికీ మంచి జరగాలని ఈ పథకం పెట్టాం. ఆర్థికంగా దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గరిష్టంగా రూ.1.25 కోట్ల సీలింగ్‌ పెట్టాం. మిగిలిన వాళ్లకు కూడా టాప్‌ 100 కాలేజీల జాబితాలో రూ.1 కోటి వరకు సీలింగ్‌ పెట్టాం. 100–200 కాలేజీల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.75 లక్షలు, మిగిలిన వాళ్లకు రూ.50 లక్షల వరకు పెట్టాం.  

ఏ అవసరం ఉన్నా సిద్ధంగా ఉన్నాం
– ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంవోలో) మీకు ఒక ఐఏఎస్‌ అధికారిని కేటాయిస్తున్నాం. మీకు ఆ అధికారి నంబర్‌ ఇస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి.. వెంటనే సహాయం తీసుకోవచ్చు. ప్రతి విషయంలో మీకు తోడుగా ఉంటాం. తద్వారా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చేదోడుగా ఉంటాం. మీ కుటుంబతో పాటు రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలబడాలి. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు యూ.  
– ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) షేక్‌ అంజాద్‌ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎఎండి ఇంతియాజ్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమచంద్రారెడ్డి, కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ జి రేఖారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ప్రతిభతో విదేశీ వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్నప్పటికీ, ఆర్థిక స్తోమత లేక ఆ చదువులకు దూరం కాకూడనే సంకల్పంతో పేద విద్యార్థులను చేయి పట్టుకుని నడిపించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ లాంటి గొప్ప నాయకులు గొప్ప, గొప్ప యూనివర్సిటీల నుంచి వచ్చిన వాళ్లే. నేటి ప్రపంచంలో మెరుగైన స్థానాల్లో ఉన్న ఇండస్ట్రీ లీడర్స్‌.. మైక్రోసాప్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల, ఐబీఎం సీఈఓ అరవింద కృష్ణ, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్, గూగూల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఛానెల్‌ సీఈఓ లీనా నాయర్‌  మొదలు.. బ్రిటీష్‌ ప్రధాని రిషి సునక్, అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ వరకు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా ఆ స్థాయిలో కలలను నిజం చేయాలి. అలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అందుకోసం అద్భుతమైన వేదికను మీకందిస్తున్నాం. ఆ స్థాయిలోకి మీరు కూడా వెళ్లి దేశ, రాష్ట్ర ప్రతిష్టను పెంచాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement