వైఎస్సార్ లా నేస్తం చెక్కును న్యాయవాదులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పేదల పక్షాన అడ్వొకేట్ సోదరులు, చెల్లెమ్మలు ఔదార్యం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌ను ఇదే కోరుతున్నానని, దీనిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విడుదల చేశారు.
నెలకు రూ.5,000 చొప్పున 2023 జూలై–డిసెంబర్ వరకు 6 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 మేరకు మొత్తం రూ.7,98,95,000 కంప్యూటర్‌లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, అదే రీతిన మీరంతా పేద వాడి పక్షాన నిలవాలన్నారు. వారి పట్ల మానవతా దృక్పథం చూపించాలని కోరారు. లా డిగ్రీ పూర్తి చేసుకుని, న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకునే సమయంలో వారికి ప్రోత్సాహకంగా నిలుస్తూ వరుసగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
నెలకు రూ.5 వేలు స్టైఫండ్ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ కార్యక్రమం ద్వారా తోడుగా నిలిచామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్‌లకు మంచి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు
► ‘ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేస్తూ.. మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు సాయం చేసింది. ఈ మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం ముందడుగు అవుతుంది. అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వైఎస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచాం.
► ఈ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వీళ్లలో 643 కుటుంబాలకు రూ.52 లక్షలు ఇచ్చాం. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు ఇచ్చారు. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి అడ్వొకేట్ కమ్యూనిటీకి ఇచ్చి, వారికి తోడుగా నిలబడగలిగాం.
► నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేశాం. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం అన్నారు.
► ఈ కార్య‘క్రమంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి సత్యప్రభాకర రావు, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
విజనరీ స్కీమ్స్ మీకే సాధ్యం
గుంటూరు జిల్లా కోర్టులో నేను జూనియర్ అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. హ్యాట్సాఫ్ సార్. నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్‌కు వెళ్లాను. చాలా బాగుంది. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. విదేశీ విద్య చాలా బాగుంది.
తుపాను సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఒక విజనరీ. మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది. మా కాళ్లపై మేం నిలబడుతున్నాం. – శశిధర్, జూనియర్ అడ్వొకేట్, గుంటూరు
లా నేస్తం మాకు ధైర్యాన్నిచ్చింది
నేను వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు చాలా ఉపయోగపడుతోంది. మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు, బుక్స్, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ వృత్తిలో తొలుత ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలా రాణించాలి.. ఖర్చుల మాటేంటి.. అని భయపడ్డాం. కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది. మా జూనియర్స్‌కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను. చాలా సంతోషం. మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఆరీ్టసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం. – కోట ఆశ్రిత, జూనియర్ అడ్వొకేట్, నందిగామ
Comments
Please login to add a commentAdd a comment