వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురంలో రూ.2 కోట్లతో నిరి్మంచిన నూతన పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: పులివెందుల నియోజకవర్గం అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సింహాద్రిపురంలో రూ.11.6 కోట్లతో సుందరీకరించిన రహదారులు, జంక్షన్లను తొలుత ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో ఫోర్‌లైన్ సీసీ రోడ్, బీటీ రోడ్ జంక్షన్‌లున్నాయి. అనంతరం రూ.5.5 కోట్లతో 1.5 ఎకరాల్లో నిర్మించిన వైఎస్సార్ పార్కును ప్రారంభించారు. రూ.3.19 కోట్లతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయం, రూ.2 కోట్లతో రూపుదిద్దుకున్న నూతన పోలీసు స్టేషన్, రూ.3.16తో సిద్ధమైన ఎంపీడీవో నూతన కార్యాలయాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి.
వైఎస్సార్ ఘాట్ వద్ద ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి పాడా (పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పులివెందుల మండల ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రభుత్వ ఆశయాల సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రజలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలపై మమకారం, బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన సంతోషంతో సీఎం జగన్ అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు.
కలసి చాలా రోజులైంది..
‘మనమంతా కలసి చాలా రోజులైంది.. ఒకసారి కలిసినట్లుంటుంది.. కష్ట సుఖాలు పంచుకున్నట్లుంటుంది’ అనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతోందన్నారు. అందుకు అన్ని వర్గాల సమ్మతి, సహకారం ఎంతో అవసరమన్నారు.
సచివాలయాల ద్వారా గ్రామ లోగిళ్లలోనే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదనేదే మన ప్రభుత్వ సిద్ధాంతమని ముఖ్యమంత్రి తెలిపారు. పరిపాలన పారదర్శకంగా సాగినపుడే వ్యవస్థ పటిష్టంగా సాగుతుందనే విషయాన్ని నాలుగున్నరేళ్లుగా ప్రజలు గుర్తించారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని రెట్టింపు చేసేలా సుపరిపాలన కొనసాగిస్తామన్నారు.
‘పాడా’ పరిధిలో పనులపై సమీక్ష..
‘పాడా’ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ వి.విజయ్ రామరాజు ముఖ్యమంత్రికి క్లుప్తంగా వివరించారు. పులివెందుల రూరల్ మండలంలో గ్రామ పరిపాలన సంతృప్తికరంగా సాగుతోందన్నారు. పీబీసీ, సీబీఆర్ మైనర్, మైక్రో ఇరిగేషన్ ఆయకట్టు పరిధిలో దాదాపు 14 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి తెచ్చామన్నారు. రూరల్ పరిధిలో పాడా, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రూ.44.40 కోట్లతో మంజూరు చేసిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ.31.08 కోట్లు వెచ్చించి పలు పనులను పూర్తి చేసినట్లు చెప్పారు. మైక్రో ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, ఉపాధి హామీ, నాడు–నేడు పనులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో రూ.135.49 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.58.85 కోట్లు ఖర్చు చేశామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
సీఎం దృష్టికి పలు ప్రతిపాదనలు..
పులివెందుల పరిధిలో చేపట్టాల్సిన ఇతర అభివృద్ధి పనులపై పలువురు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించారు. సీబీఆర్–ఎర్రబెల్లి నూతన పైప్‌లైన్ పరిధిలోని మోతున్నూతనపల్లెలో స్టోరేజీ పాయింట్ ఏర్పాటు చేస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందన్నారు. గవేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కోరారు.
ఎర్రబల్లె చెరువు నుంచి పంపింగ్ ద్వారా చిన్న గుంతలకు నీటిని సరఫరా చేస్తే వ్యవసాయ అవసరాలు తీరుతాయని కొందరు గ్రామస్తులు విన్నవించారు. షాదీ తోఫా, కళ్యాణమస్తు ఆర్థిక సాయాన్ని పెంచి దూదేకుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడాన్ని నూర్‌బాషా దూదేకుల సంఘం నాయకుడు మహమ్మద్ రఫీ స్వాగతించారు. సర్టిఫికెట్ల జారీలో నూర్ బాషాలను ముస్లింలుగా గుర్తించాలని కోరారు.
పచ్చదనంతో కళకళ..
‘మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పులివెందుల మండలం పచ్చదనంతో కళకళలాడుతోందని.. ఇదంతా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే సాధ్యమైంది’ అంటూ పలువురు మండల నాయకులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వాయర్ల పరిసర ప్రాంత గ్రామస్తులు, రైతులకు ఇంకా ఏవైనా సమస్యలుంటే పూర్తి వివరాలను అందజేస్తే సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ సమీక్షను ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, జేసీ గణేష్‌కుమార్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ సలహా కమిటీ మెంబర్ బలరామిరెడ్డి, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు ఖాదరబాధర వరలక్ష్మి, కొమ్మా వరలక్ష్మి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తంరెడ్డి, మాజీ ఉప మండలాధ్యక్షుడు పుష్పనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానవత్వం పరిమళించి..
సింహాద్రిపురం: వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సింహాద్రిపురం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల అనంతరం తిరిగి వెళ్తుండగా రోడ్డు పక్కన కాగితాలతో నిరీక్షిస్తున్న పలువురు మహిళలను చూసి వాహనాన్ని నిలిపివేశారు. కాన్వాయ్ వేగంగా వెళ్తున్నప్పటికీ వారిని గుర్తించిన సీఎం వాహనాన్ని ఆపాలని ఆదేశించారు.
తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని, సహాయం చేయాలని ఓ మహిళ కోరగా.. మరో మహిళ తన భర్త చనిపోయారని, సాయం అందించాలని వేడుకుంది. వెంటనే వారికి తగిన సహాయం అందించాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. తన బిడ్డకు తలలో కణితి ఆపరేషన్‌కు సాయం చేయాలని తాడిపత్రికి చెందిన ఓ మహిళ అభ్యర్థించడంతో పూర్తి స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment