RIP Jahnavi : కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ | Cm Jagan Letter To External Affairs Minister Jaishankar On jahnavi Death In US | Sakshi
Sakshi News home page

RIP Jahnavi : కేంద్ర మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ లేఖ

Published Thu, Sep 14 2023 4:39 PM | Last Updated on Thu, Sep 14 2023 5:54 PM

Cm Jagan Letter To External Affairs Minister Jaishankar On jahnavi Death In US - Sakshi

సాక్షి, అమరావతి: అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి మృతిపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. లేఖలో..‘ఏపీకి చెందిన విద్యార్ధిని కందుల జాహ్నవి అమెరికాలో జనవరి 23, 2023న రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీస్‌ వాహనం ఢీకొట్టి ప్రాణాపాయానికి గురైంది. ఆమె అమెరికాలోని నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్శిటీ సీటెల్‌ క్యాంపస్‌లో ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతుంది.

ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే ఆమె కుటుంబాన్ని, తెలుగు అసోసియేషన్‌ను సంప్రదించి ఆమె మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఆమె స్వగ్రామానికి అంబులెన్స్‌ కూడా ఏర్పాటు చేసింది. 

తాజాగా కందుల జాహ్నవి మరణంపై దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్‌ అధికారి (సీటెల్‌ పోలీస్‌ అధికారి) ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వచ్చిన వీడియోను కూడా అందరూ గమనించే ఉంటారు. ఆ వీడియోలో ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడారు. నాన్‌ అమెరికన్ల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను అందరూ ఖండించాలి. తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలి.

భారతీయులలో విశ్వాసం, భరోసా కలిగించేలా చర్యలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నాను. యూఎస్‌లోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలి. భారతదేశంలోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్‌ అవ్వరా?

మరోవైపు అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్‌ పండుగాయల కూడా విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఈ విషయంలో జోక్యం చేసుకుని జాహ్నవికి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రవాసాంధ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. జాహ్నవి విషయంలో పోలీసు అధికారి వ్యవహరించిన తీరు, ఈ తరహ ఘటనల వల్ల అమెరికాలో వివక్ష పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement