మీరంతా నావాళ్లే. మీ అందరి ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. మీ అందరి కుటుంబాలూ చల్లగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేను. ఈ పరిస్థితిలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా, బాధ్యత గల స్థానంలో ఉన్న ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తిరుపతిలో నా బహిరంగ సభను రద్దు చేసుకుంటున్నాను.
సాక్షి, అమరావతి: కరోనా ఉధృతి కారణంగా, ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభకు రాలేకపోతున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రచారం కన్నా తిరుపతి పార్లమెంటు ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించి తన బహిరంగ సభను రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. అందరి కుటుంబాల ఆరోగ్యం దృష్ట్యా తాను రాలేకపోయినా, మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తమందరి అభ్యర్థి, తన సోదరుడు డాక్టర్ గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాద్‌కు ఇచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం తిరుపతి పార్లమెంటు ఓటర్లకు ఆయన లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
మీరంతా నా వాళ్లే..
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో మనందరి అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాల్సిందిగా నేను రాసిన ఉత్తరం మీ ఇంటికి చేరిందని భావిస్తున్నాను. ఈ నెల 14న నేనే పాల్గొనాలనుకున్న తిరుపతి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ సభకు రావటం ద్వారా మీ ఆత్మీయతను, అనురాగాన్ని ప్రత్యక్షంగా అందుకోవాలని భావించాను. అయితే తాజా హెల్త్ బులెటిన్ చూసిన తర్వాత ఈ లేఖ రాస్తున్నాను. దేశంతో పాటు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి బులెటిన్ ప్రకారం 24 గంటల్లో రాష్ట్రంలో 31,892 శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 2,765 మందికి పాజిటివ్ అని తేలింది. పాజిటివిటీ రేటు 8.67 శాతంగా కనిపిస్తోంది. ఇది మన రాష్ట్ర సగటు పాజిటివిటీ రేటు అయిన 5.87 శాతం కంటే ఎక్కువ. ఇందులో చిత్తూరులో 496 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. నెల్లూరులోఒక్క రోజులోనే 292 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల వ్యవధిలో మరణించిన 11 మందిలో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వారున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న తిరుపతి పార్లమెంటులో నేను వ్యక్తిగతంగా బహిరంగ సభకు హాజరైతే అభిమానంతో, ఆప్యాయతతో వేలాదిగా తరలి వస్తారు. ఈ పరిస్థితిలో మీ ఆరోగ్యం నాకు ముఖ్యం కాబట్టి, తిరుపతి సభను రద్దు చేసుకుంటున్నా.
మీ కోసం ఏం చేశానో ప్రతి ఇంటికీ ఉత్తరం రాశా
నేను వ్యక్తిగతంగా వచ్చి బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేసి మిమ్మల్ని ఓటు అడగకపోయినా, మనందరి ప్రభుత్వం మీ పిల్లల కోసం, మన అవ్వా తాతల కోసం, మన అక్కచెల్లెమ్మల కోసం, మన రైతుల కోసం, మన గ్రామాలు, పట్టణాల కోసం మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం, మన అక్క చెల్లెమ్మల కోసం ఏం చేసిందన్నది మీ అందరికీ వివరిస్తూ లేఖ రాశాను. ప్రతి కుటుంబంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు వ్యక్తిగతంగా, మీకు కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో, నా సంతకంతో, ఇంటింటికి అందేలా ఉత్తరం రాశాను. మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాకుండా ఆగిపోయినా, మనందరి ప్రభుత్వం ఈ 22 నెలల్లో ఇంటింటికీ మనిషి మనిషికీ చేసిన మంచి మీ అందరికీ చేరిందన్న నమ్మకం నాకుంది.
గతంలో కంటే మంచి మెజార్టీ ఇవ్వాలి..
మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో, గుండె నిండా ప్రేమతో, రెట్టింపయిన నమ్మకంతో మీ అందరి చల్లని దీవెనలను ఓటు రూపంలో ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను. మనందరి అభ్యర్థి, నా సోదరుడు డాక్టర్ గురుమూర్తిని గతంలో బల్లి దుర్గాప్రసాద్ అన్నకు ఇచ్చిన మెజారిటీ (2.28 లక్షల) కన్నా ఇంకా ఎక్కువగా, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మరో నలుగురితో మన అభ్యర్థి గురుమూర్తిని తిరుగులేని మెజారిటీతో గెలిపించేలా ఓట్లు వేయిస్తారని ఆశిస్తూ, అభ్యర్థిస్తూ దేవుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలకూ, మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment