మరో శుభకార్యానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్‌ | CM Jagan Pay Rythu Bharosa And Nivar Cyclone Relief Fund | Sakshi
Sakshi News home page

మరో శుభకార్యానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్‌

Published Tue, Dec 29 2020 12:36 PM | Last Updated on Tue, Dec 29 2020 5:11 PM

CM Jagan Pay Rythu Bharosa And Nivar Cyclone Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారికి మరో కానుక అందించింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ పథకం మూడోవిడత నిధులు, అక్టోబరులో వచ్చిన నివర్‌ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమచేసింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ మూడోవిడత కింద రూ.1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.646 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. కంప్యూటర్‌లో మీట నొక్కి చెల్లింపుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రైతుల ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నాం. మూడో విడత రైతు భరోసాగా రూ.1,120 కోట్లు, నివర్ తుపాను పరిహారం కింద రూ.646 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులకు మంచి ధరలు రావాలనేదే మా లక్ష్యం.  గత ప్రభుత్వం రూ.87,612 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచింది. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రూ.13,101 కోట్లు అందించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ,13,500 ఇస్తున్నాం. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాయం చేశాం.
(చదవండి: పవన్‌ కల్యాణ్‌కు కొడాలి నాని కౌంటర్‌)

గత ప్రభుత్వం పెట్టిన సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లు తీర్చాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద ఈ ఖరీఫ్‌కు రూ.510 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1,968 కోట్లు చెల్చించాం. భారీ వర్షాలు, తుపాను పరిహారం రూ.1,038 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చాం. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు చెల్లించాం. ఉచిత విద్యుత్‌, ఆక్వా రైతుల బాగు కోసం రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఉచిత విద్యుత్ పగటి పూట ఇవ్వడం కోసం రూ.1700 కోట్లు వెచ్చించాం. విత్తనాల సబ్సిడీ కింద రూ.383 కోట్ల బకాయిలు కూడా చెల్లించాం. అధికారంలోకి రాగానే శనగ రైతులకు రూ.300 కోట్లు బోనస్ ఇచ్చాం. రైతుల కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించాం.

రైతులకు ఉచిత విద్యుత్ శాశ్వత ప్రాతిపదికన ఇవ్వడానికి..10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌కు టెండర్లను పిలిచాం. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు తోడుగా ఉంటున్నాం. గ్రామాల్లో గోడౌన్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, జనతాబజార్లు.. నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు.. ఈ ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని 51.59 లక్షల రైతులు లబ్ది పొందనున్నారు. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా రైతులకు సాయం అందించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
(చదవండి: ప్రాజెక్టులతో మహా సంక్రాంతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement