తుపానుపై సర్వత్రా అప్రమత్తం | cm jagan review cyclone effect ordered officials undertake relief operations | Sakshi
Sakshi News home page

తుపానుపై సర్వత్రా అప్రమత్తం

Published Tue, Dec 5 2023 6:37 AM | Last Updated on Tue, Dec 5 2023 10:09 AM

cm jagan review cyclone effect ordered officials undertake relief operations - Sakshi

సాక్షి, అమరావతి: మిచాంగ్‌ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.

అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ఐదు జీఓలు, ఒక మెమో విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుపాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రూ.11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ జీఓ నంబరు 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబి­రా­లకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షిత­మైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది. 

సహాయక చర్యలు ముమ్మరం
► తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి, ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్, 6 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్‌ నెల్లూరు, తిరుపతి, కాకి­నాడ, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు 7,361 మం­దిని తరలించామన్నారు. ప్రభావిత జిల్లాల్లోని 2.38 కోట్ల మందికి తుపాను హెచ్చరిక సందేశాలు (సెల్‌ ఫోన్‌కు) పంపినట్లు తెలిపారు. 

► ముందస్తు చర్యల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ లోతట్టు ప్రాంతాలను గుర్తించి సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 1,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి లోతట్టు ప్రాంతాలలోని పేదలకు ఆహారం అందజేశారు. రెస్క్యూ టీంలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు, నెలటూరు ప్రాంతాల్లో  లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.

► తిరుపతి జిల్లాలోని 162 మంది గర్భిణిలను ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాలలో 2,620 మందిని  పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, సింగరాయకొండ, టంగు­టూరు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలా­ల్లోని తీర ప్రాంతాల్లో పూరిళ్లు, ప్రమాదకర పరి­స్థితుల్లో ఉన్న పాత ఇళ్లలో ఉంటున్న వారిని 47 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రతి శిబి­రానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. 

► బాపట్ల జిల్లాలో 14 పునరావాస కేంద్రాలు, 43 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి, లోతట్లు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు. 18 మంది గర్భిణీలను వైద్యశాలలకు తరలించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌(నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌), ఎస్‌డిఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌) బృందాలను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. సూర్యలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం పరిశీలించారు.  

► కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా నేతృత్వంలో శిబిరాల్లో తాగునీరు, ఆహారంతో పాటు వైద్య సహాయం కోసం వైద్య సిబ్బంది, మరుగుదొడ్లను, వైర్‌లెస్‌ సెట్లను ఏర్పాటు చేశారు. 40 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 20 వేల టన్నుల ధాన్యాన్ని గోడౌన్‌కు తరలించారు. ఇంకో 10 వేల టన్నుల ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

► పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంత మండలాల్లో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఎం లంక నుంచి 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆరుగురు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఈతగాళ్లు, మెకనైజ్డ్‌ బోట్లను సిద్ధం చేసినట్టు కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. 

►అనకాపల్లి జిల్లాలో 52 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 60 వేల మందికి పైగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు.  ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏలూరులో విద్యుత్‌ శాఖ 9440902926 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది.  

రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయం
సహాయక శిబిరాల నుంచి బాధిత కుటుంబాలను ఇంటికి పంపే ముందు ఆర్థిక ఆసరా కోసం రూ.1,000 నుంచి రూ.2,500 ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ జీఓ నెంబరు 73 విడుదల చేసింది. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక లీటర్‌ పామాయిల్, కేజీ చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఉచితంగా పంపిణీ చేయాలని మరో జీఓ ఇచ్చింది. తుపాను వల్ల దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లు, గుడిసెలకు ఇచ్చే పరిహా­రాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇవ్వాలని ఆదేశించింది. సీఎం జగన్‌ సమీక్షలో ఈ విషయంపై ఆదేశాలు ఇవ్వడంతో అందుకనుగుణంగా ఉత్తర్వులు వెలువ­డ్డాయి.

పశు వైద్య శిబిరాల ఏర్పాటు, పశువులకు గడ్డి సరఫ­రా వంటి అవసరాలకు నిధులు వినియోగించుకునేందుకు కలెక్టర్లకు అనుమతి ఇచ్చారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో సహక­రించేందుకు 8 జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాపట్ల జిల్లాకు కాటంనేని భాస్కర్, అంబేడ్కర్‌ కోనసీమకు జి జయలక్ష్మి, తూర్పుగోదావరికి వివేక్‌ యాదవ్, ప్రకాశంకు పీఎస్‌ ప్రద్యుమ్న, కాకినాడకు ఎన్‌ యు­వ­రాజ్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుకు సీహెచ్‌ హరికిరణ్, తిరుపతికి జే శ్యామలరావు, పశ్చిమ­గోదావరికి కే కన్నబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభు­త్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి జీఓ జారీ చేశారు. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement