రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలి. పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాల (గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్‌మెంట్)ను ప్రతి కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలి. ఫలానా సదుపాయం లేదనిపించుకోకుండా పూర్తి సమాచారం తెప్పించుకోవాలి. చేపట్టాల్సిన పనుల గురించి వివరిస్తూ ఒక నివేదిక రూపొందించి అందజేయాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, వాటిని సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనుల పురోగతిపై ఆరా తీశారు. ఫౌండేషన్ స్కూళ్లుగా మారిన సుమారు 10 వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.
మిగిలిన సుమారు 45 వేల అంగన్‌వాడీల్లో కూడా వచ్చే మూడేళ్లలో ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అయితే అప్పటిలోగా వీటిలో ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలన్నారు. ప్రస్తుతం వాటిలో ఏయే సౌకర్యాలున్నాయి.. ఇంకా ఏయే సదుపాయాలు కావాలనే పూర్తి సమాచారాన్ని గ్రామ సచివాలయాల ద్వారా తెప్పించుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, టాయిలెట్ల వంటి సౌకర్యాల గురించి వాకబు చేయాలన్నారు. పూర్తి సమాచారంతో ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలతో తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
సమర్థవంతంగా నిర్వహణ
అంగన్‌వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పోషణ పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన నిర్వహణ పద్దతి(ఎస్‌ఓపీ) రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎంత పకడ్బందీగా పంపిణీ చేస్తున్నామో ‘సంపూర్ణ పోషణ’ పంపిణీ కూడా అంతే సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. ఇందుకోసం అంగన్‌వాడీలపై పర్యవేక్షణ పెరగాలన్నారు. ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ సెంటర్లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులు మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ చూడాల్సిన సూపర్‌వైజర్లపై కూడా పకడ్బందీ పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీ చరణ్, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సంచాలకులు ఎం.విజయ సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ (మౌలిక సదుపాయాలు) కాటమనేని భాస్కర్, పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీర పాండియన్, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment