వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు | CM Jagan Says Revolutionary changes in field of medicine | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Published Sun, Jul 10 2022 2:39 AM | Last Updated on Sun, Jul 10 2022 2:44 PM

CM Jagan Says Revolutionary changes in field of medicine - Sakshi

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: గత మూడేళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారని మండిపడ్డారు. ‘ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆరోగ్యశ్రీ పేషంట్లు భయపడే పరిస్థితి ఉండేది.

నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండేవి. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డాక్టర్లు ఉండేవారు కాదు. వసతులు కూడా లేవు. సెల్‌ఫోన్‌ లైట్లతో ఆపరేషన్లు చేసేవారు. ఆస్పత్రిలో పిల్లలను ఎలుకలు కొరికిన సంఘటనలు. 108, 104 వాహనాల సంగతి పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఈ మూడేళ్లలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి’ అని కోరారు. ఈ మూడేళ్లలో నాడు–నేడుతో  మొత్తంగా గవర్నమెంట్‌ ఆస్పత్రుల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నామని, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నామని చెప్పారు. ‘ఆరోగ్యశ్రీ పరిధిని 1,000 రోగాల నుంచి ఏకంగా 2,466 రోగాలకు పెంచాం. మండలానికి రెండు పీహెచ్‌సీలు, గ్రామంలో విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు దిశగా అడుగులు వేస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వైద్య, ఆరోగ్య రంగం మీద చేసిన ఖర్చు కేవలం రూ.7,464 కోట్లు మాత్రమే. మనందరి ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలోనే రూ.30 వేల కోట్లు ఖర్చు చేసింది’ అని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
ప్లీనరీ రెండో రోజు భారీ సంఖ్యలో హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

అన్నదాతను గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వమిది
► చంద్రబాబు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వకుండా దిగిపోయారు. సున్నా వడ్డీ ఎగ్గొట్టారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరెంటు, విత్తనాలు, ధాన్యం కొనుగోలులో కూడా బకాయిలు పెట్టివెళ్లారు. బీమాలో బకాయిలు పెట్టారు.
► అప్పట్లో ఎన్నికలప్పుడు మీకు గుర్తుందా? ప్రతి ఇంటికీ వెళ్లండి.. రెండు నెలలు ఓపిక పట్టండి.. జగనన్న వస్తున్నాడు.. రైతు భరోసా కింద సంవత్సరానికి రూ.13,500 మీ చేతుల్లో పెడతాడని చెప్పమని చెప్పాను. మన ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో కేవలం రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు ఖర్చు చేశాం. దాదాపు 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు మేలు జరుగుతోంది.
► ఈ మూడేళ్లలో ఉచిత విద్యుత్‌ మీద ఏకంగా 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పంటల బీమాగా ఇచ్చింది మరో 6,684 కోట్ల రూపాయలు. ధాన్యం కొనుగోలు మీద 45 వేల కోట్ల రూపాయలు. ఇతర పంటల కొనుగోలు మీద 7 వేల  కోట్ల రూపాయలు. గత ప్రభుత్వ కరెంటు బకాయిలు కూడా 9 వేల కోట్ల రూపాయిలు మన ప్రభుత్వమే చెల్లించింది. విత్తన బకాయిలు 385 కోట్ల రూపాయలు, ధాన్యం సేకరించిన బకాయిలు 960 కోట్ల రూపాయలు... ఇవన్నీ మనందరి ప్రభుత్వం చిరునవ్వుతో కట్టింది.
► రైతును గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం కాబట్టే గ్రామ స్థాయిలో ఆర్బీకేలు స్థాపించాం. విత్తనం దగ్గర్నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నలకు సూచనలు, సలహాలు ఇస్తూ తోడుగా నిలబడుతున్నాం. ఈ మూడేళ్లలో వ్యవసాయ రంగం మీద రూ.1.27 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఈ రోజు పామాయిల్‌ రేట్లు ఏకంగా టన్నుకు రూ.22 వేలు ఇక్కడ కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో మాత్రమే మంచి రేటు ఉండేదని పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వాపోయేవారు.

లక్షాధికారులుగా మన అక్కచెల్లెమ్మలు
► ఈ మూడేళ్ల పాలనలో ఒక్క జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44.49 లక్షల మంది తల్లులకు మేలు చేస్తూ రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఇప్పటికే 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు సగం డబ్బు రూ.12,758 కోట్లు ఇచ్చాం.
► వైఎస్సార్‌ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించిన సొమ్ము రూ.9,180 కోట్లు. ప్రతి అక్కకు రూ.18,750 చొప్పున రెండు దఫాల్లో రూ.37,500 అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వారి పేరుతోనే 31 లక్షల ఇంటి పట్టాలు ఇచ్చాం. ఇప్పటికే దాదాపు 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే.. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి పెట్టినట్టు అవుతుంది. 
► అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చాం. 1.20 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు వారి ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఐదుసార్లు ఫోన్‌ను షేక్‌ చేసినా.. ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినా పది నిమిషాల్లో పోలీసులు వస్తున్నారు. ఈలోగా ఫోన్‌ చేసి ఏమైందని ఆరా తీస్తున్నారు.
► దిశా పోలీస్‌ స్టేషన్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం. ఇవన్నీ చంద్రబాబు పాలనలో ఏనాడైనా చూశామా? పైపెచ్చు పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలు రూ.14,205 కోట్ల రుణాలను మొదటి సంతకంతో మాఫీ చేస్తానని చంద్రబాబు ఎగ్గొట్టారు. సున్నావడ్డీని కూడా రద్దు చేసిన పాపానికి ఏ, బి, గ్రేడులో ఉన్న ఆ అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. ఆ తర్వాత చాలా సంఘాలు ఎన్‌పీఏలకు దిగజారిపోయాయి. 

చేతల్లో సామాజిక న్యాయం చూపించాం
► చంద్రబాబు దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఎన్నికల సమయంలో వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం. మన సిద్ధాంతానికి, చంద్రబాబు సిద్ధాంతానికి తేడా చూడండి. మన ప్రభుత్వం తొలి కేబినెట్‌లో, రెండో క్యాబినెట్‌లో ఐదుగురు చొప్పున ఉప ముఖ్యమంత్రులు ఉంటే.. అందులో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలేనని సగర్వంగా తెలియజేస్తున్నాను. 
► శాసనసభ స్పీకర్‌గా కూడా బీసీ ఉన్నారు. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీ మహిళ ఉన్నారు. మండలిలో మన పార్టీ 32 మంది ఎమ్మెల్సీలను నియమిస్తే వారిలో 18 మంది ఎమ్మెల్సీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన రాజ్యసభ సభ్యులు ఎనిమిది మందిలో నలుగురు బీసీలే.
► నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇవ్వాలని ఏకంగా చట్టం చేశాం. అందులో సగం మహిళలకే ఇవ్వాలని చట్టంలో చెప్పాం. తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశాం. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది. వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా ప్రతి అక్క, చెల్లెమ్మకు, ప్రతి పేద కుటుంబానికి మంచి చేసేందుకు బటన్‌ నొక్కి నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేసింది అక్షరాల రూ.1.63 లక్షల కోట్లు. అలా లబ్ధి పొందిన వారిలో దాదాపు 80% నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు ఉన్నారు. 

చంద్రబాబు హేళన చేస్తే.. మనం అందలం ఎక్కిస్తున్నాం
► బాబు హయాంలో సామాజిక న్యాయం అంటే.. ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అవహేళన చేసిన రోజులు. బీసీల తోకలు కత్తిరిస్తా అని అపహాస్యం చేసిన రోజులు. ఎస్టీలకు, మైనార్టీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు.
► ట్రైబల్‌ అడ్వయిజరీ కమిటీ అనే రాజ్యాంగ బద్ధ సంస్థను ఏర్పాటు చేయని పాలన చంద్రబాబు హయాంలో ఉండేది. ఈ రోజు అందుకు భిన్నంగా ఈ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు, ఏఎంసీలు, ఆలయ బోర్డుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మొత్తం మంత్రి మండలిలో 70 శాతం పదవులు ఇచ్చాం. 
► పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు రకరకాలుగా కోర్టుల్లో కేసులు వేశారు. అమరావతిలో 54 వేల ఇళ్లు పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తుంటే అడ్డుకున్నారు. అమరావతిలో ఇళ్లు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది. బృహత్తర యజ్ఞంగా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తోంది.

లంచాలు లేవు.. వివక్షా లేదు
► చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడూ ఇదే బడ్జెట్‌. మరి అప్పుడు వారు ఎందుకు చేయలేకపోయారు.. ఇప్పుడు మీ జగన్‌ ఎలా చేయగలుగుతున్నాడని ఆలోచించండి. అప్పట్లో చంద్రబాబు మీ అన్న జగన్‌ కంటే ఎక్కువగానే అప్పులు చేశారు. 
► అయినా వారు ఎందుకు చేయలేకపోయారంటే.. ఇప్పుడు మీ జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడు.. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తున్నాయి. చంద్రబాబు హయాంలో బటన్‌లు లేవు, నొక్కేది లేదు.. డబ్బులు నేరుగా దోచుకో.. పంచుకో పద్థతి ఉండేది. డబ్బులో ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ5కు, ఇంత తన దత్తపుత్రుడికి, మిగిలిందంతా తనకు అన్నట్టుగా ఉండేది. ఈ తేడాను గమనించండి.

చెత్తబుట్టలో చంద్రబాబు మేనిఫెస్టో 
► చంద్రబాబు వాగ్దానం చేసిన మేనిఫెస్టో చెత్తబుట్టకు పరిమితమైంది. వాళ్ల వెబ్‌సైట్‌లో కూడా మేనిఫెస్టో కనిపించకుండా తీసేశారు. ఏకంగా 650 వాగ్దానాలు చేసి.. 10% కూడా అమలు చేయని అధ్వాన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. 
► మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. ఇంటింటికీ వెళ్లి ఇదిగో మా పార్టీ మేనిఫెస్టో.. మూడేళ్లలో అక్షరాల 95 శాతం అమలు చేశాం..అని మన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే.. మీకు జగనన్న న్యాయం చేశాడని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి.. జగనన్నకు తోడుగా నిలవండి అని చెబుతున్న నిబద్ధత మనది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement