
గత ప్రభుత్వంలో గాలి మాటలు విన్నాం. ఏం మాట్లాడారో, ఏం చేశారో చూశాం.అందుకు తగ్గట్లు గ్రాఫిక్స్ అలాగే ఉండేవి. అదిగో మైక్రోసాఫ్ట్.. అదిగో బిల్‌గేట్స్ అనేవారు. అదిగో బుల్లెట్ ట్రెయిన్ అని గొప్పలు చెప్పేవారు. మన ప్రభుత్వం అలా కానేకాదు. ఏం చెప్పామో అది చేసి చూపిస్తున్నాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం.. వీటన్నింటిని దైవ కార్యంగా భావించి నిబద్ధతతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ ఉండాలి.
– సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నవరత్నాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ఆయన ప్రసంగించారు. అమ్మ ఒడి చదివించే తల్లులకు రూ.15 వేలు సహాయం చేస్తుండటం ఒక్క మనరాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోందన్నారు.
ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 44.48 లక్షల మంది తల్లులకు రూ.19,674 కోట్లు సాయం చేశామని చెప్పారు. 75 శాతం అటెండెన్స్ ఉండాలని చెప్పి ఓ మంచి మేనమామగా తాపత్రయ పడి పిల్లల చదువుల కోసం ఆరాటపడుతూ తెచ్చిన గొప్ప పథకం ఇదని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా 52.38 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.27,062 కోట్లు సాయం అందించామన్నారు.
కౌలు రైతులు, ఆర్వోఎఫ్‌ఆర్ రైతులకు సైతం ఈ సాయం అందిస్తున్న ప్రభుత్వం మనదేనని తెలిపారు. బీమా ప్రీమియంగా రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండా బీమా భారాన్ని మోస్తున్నామన్నారు. ఇలా ఇప్పటి వరకు 44.05 లక్షల మంది రైతులకు రూ.6,872 కోట్లు పరిహారంగా అందించామని తెలిపారు.
ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నావడ్డీ, పగటిపూటే తొమ్మది గంటల ఉచిత విద్యుత్, ఎంఎస్‌పీకి ఏమాత్రం తగ్గకుండా ఆహార ధాన్యాల కొనుగోలు, ధాన్యం సేకరణ, ఆర్‌బీకేల ద్వారా ఈ–క్రాపింగ్.. ఇలా ప్రతి విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు.
సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..
► 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండ దండలు అందిస్తున్న వైయస్సార్ చేయూత వంటి పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడూ, ఎక్కడా లేదు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 26.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,129 కోట్లు అందించాం.
► ఐటీసీ, పీ అండ్ జీ, రిలయెన్స్, అమూల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకుని వచ్చి ఆ అక్కచెల్లెమ్మల జీవనోపాధికి మార్గాలు చూపుతూ.. బ్యాంకులను మమేకం చేస్తూ వాళ్లకు దారి చూపించిన గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం.
సున్నా వడ్డీతో అక్కచెల్లెమ్మలకు భరోసా
► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25 వేల కోట్లను నాలుగు విడతల్లో వారికి చెల్లిస్తామని మాట ఇచ్చాం. ఆ మేరకు ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లు 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. మూడో విడత చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాం.
► గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎన్‌పీఏల కింద 18 శాతం అక్కచెల్లెమ్మల ఏ, బి గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ఇవాళ అవుట్ స్టాండింగ్ లోన్స్ కేవలం 0.5 శాతమే ఉన్నాయి. అంటే 99.5 శాతం ఇవాళ అక్కచెల్లెమ్మలు సంతోషంగా లోన్లు కడుతున్నారు.
► వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3.94 లక్షల మందికి రూ.595 కోట్లు ఇచ్చాం.
ఉద్యోగాలు, ఉపాధి కల్పనతో పెరిగిన వృద్ధి రేటు
► ఐదున్నర కోట్ల జనాభాలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను ఆరు లక్షలకు పెంచాం. అంటే 50 శాతం ఉద్యోగాలను పెంచాం. పెద్ద, పెద్ద పరిశ్రమలు మిగిలినవి అన్నీ చూసుకుంటే మరో 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ ఉద్యోగాలు ఎంఎస్‌ఎంఈ సెక్టారులోనే ఉన్నాయి. ఒక్కో ఎంఎస్‌ఎంఈ యూనిట్ కనీసం 10 మందికి ఉపాధి కల్పిస్తుంది.
► ఇంతకు ముందున్న 1.10 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు అదనంగా మరో 1.56 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిని ప్రోత్సహిస్తూ పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లను క్లియర్ చేస్తూ వాటికి ప్రభుత్వం తోడుగా ఉందని భరోసా ఇస్తున్నాం.
► వృద్ధి రేటుకు బూస్ట్‌నిచ్చే మరొక రంగం స్వయం ఉపాధి. వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 1.20 లక్షల మంది మత్స్యకారులకు రూ.422 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల కుటుంబాలకు రూ.778 కోట్లు అందించాం. వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలతో తోడుగా నిలబడ్డాం.
► జగనన్న చేదోడు ద్వారా పుట్‌పాత్‌ల మీద కూరగాయలు అమ్ముకునేవారు, తోపుడు బండ్లమీద వ్యాపారులు.. ఇలాంటి 15 లక్షల మందికి తోడుగా నిలబడ్డాం. వీటితో పాటు 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. సిమెంటు, స్టీలు అమ్మకాలతో మార్కెట్ పెరిగి కార్మికులకు ఉపాధి పెరిగింది. తద్వారా వృద్ధిరేటులో ఏపీ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది.
అక్కచెల్లెమ్మల భద్రతకు కీలక నిర్ణయాలు
► మనందరి ప్రభుత్వంలో గ్రామ, వార్డు స్థాయిలో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించాం. మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చాం. ఇప్పటికే 1.36 కోట్ల అక్క చెల్లెమ్మలు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
► దిశ బిల్లు కూడా తీసుకొచ్చాం. అది ఉమ్మడి జాబితా (కాంకరెన్స్ లిస్ట్)లో అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాం. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం.
► నా మంత్రి మండలిలో, మన ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవులు, ఆలయ బోర్డులు, ఏఎంసీలు, స్థానిక సంస్థల్లో.. ఎందులో చూసినా సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ పదవుల్లో కనీసం సగం వాటా అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా, సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చేలా అడుగులు ముందుకు వేశాం.
కోవిడ్‌ను దీటుగా ఎదుర్కొన్నాం
► కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న అగ్రగామి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒకటి. వైద్య రంగంలో కనీవినీ ఎరగనిరీతిలో ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం.
► గ్రామాలు, పట్టణాల్లో 10,550 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. వాటితోపాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, డిస్ట్రిక్ట్ ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు కార్యక్రమంతో పూర్తిగా మారుస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment