చదువుకు సహకరిస్తాం.. సీఎం జగన్‌ హామీ | CM YS Jagan Assurance to students return from Ukraine | Sakshi
Sakshi News home page

చదువుకు సహకరిస్తాం.. సీఎం జగన్‌ హామీ

Published Tue, Mar 22 2022 3:43 AM | Last Updated on Tue, Mar 22 2022 11:12 AM

CM YS Jagan Assurance to students return from Ukraine - Sakshi

ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకొచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతా పత్రం అందజేస్తున్న విద్యార్థులు

సాక్షి, అమరావతి: యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర విద్యార్థులు వారి చదువు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వారి సమస్యకు పరిష్కారాలను అన్వేషించాలని, ఎలాంటి అవసరమున్నా వెంటనే సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. వారి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన  విద్యార్థులు సోమవారం శాసన సభలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అక్కడ పడ్డ ఇబ్బందులను సీఎంకు వివరించారు. తమను రాష్ట్రానికి తీసుకురావడంలో విశేష కృషి చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ బాగోగులు మా బాధ్యత
మీరంతా రాష్ట్రానికి చెందిన పిల్లలని, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకోవడం తమ బాధ్యత అని సీఎం జగన్‌ విద్యార్థులతో అన్నారు. ‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని అధికారులను ఆదేశించాను. నా ఆదేశాలను అందుకున్న వెంటనే వారంతా రంగంలోకి దిగారు. మిమ్మల్ని సురక్షితంగా తీసుకొస్తూ చేసిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు నాకు నివేదించారు. మీ బాగోగులు చూసుకొనే బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించారు’ అని సీఎం చెప్పారు. ఈ విషయంలో సమర్ధవంతంగా వ్యవహరించిన అధికారులను సీఎం అభినందించారు. విద్యార్థులతో సీఎం వివిధ అంశాలపై మాట్లాడారు. వారి చదువుల గురించి ఆరా తీశారు. కోర్సులను ఎంతవరకు పూర్తిచేశారు, వాటిని  కొనసాగించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను తెలుసుకున్నారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రపటం అందజేస్తున్న విద్యార్థులు 

వీవీఐపీల్లా చూసుకున్నారు : విద్యార్థులు
ఉక్రెయిన్‌ నుంచి తమను తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేసిందని విద్యార్థులు సీఎంకు వివరించారు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్ని రకాల చర్యలు తీసుకుందని చెప్పారు. ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకున్న దగ్గర నుంచి ఆహారం, వసతి,  దేశంలోని విమానాశ్రయాల్లో తమకు స్వాగతం పలకడం, అక్కడి నుంచి ఫ్లైట్‌ టికెట్లు, వసతి వంటి అన్ని సదుపాయాలు కల్పించారని చెప్పారు. తమను వీవీఐపీల్లా చూసుకున్నారని తెలిపారు. చేసిన పనిని చెప్పుకోకుండా వెనుక ఉండి యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి నడిపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ తరహా చర్యలు తీసుకున్నప్పుడు సహజంగానే విపరీత ప్రచారం చేసుకుంటారని, అలాంటి పోకడలకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం, అధికారులు దూరంగా ఉండటం, చిత్తశుద్ధితో పని చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. తమకు అండగా నిలిచినందుకు వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తమకందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. డాక్టర్‌ వైఎస్సార్‌ స్ఫూర్తితో వైద్య విద్యను ఛాలెంజ్‌గా తీసుకున్నానని కడపకు చెందిన ఓ విద్యార్థిని సీఎంకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉక్రెయిన్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ప్రెసిడెంట్‌ మేడపాటి వెంకట్, సీఈవో కె.దినేష్‌ కుమార్, టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సభ్యులు అహ్మద్‌ బాబు, నార్త్‌ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, యూకేలో ప్రత్యేక ప్రతినిధి రవి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement