CM YS Jagan: మీరే నా సైన్యం | CM YS Jagan Comments at closing meeting of YSRCP plenary | Sakshi
Sakshi News home page

CM YS Jagan: మీరే నా సైన్యం

Published Sun, Jul 10 2022 2:26 AM | Last Updated on Sun, Jul 10 2022 2:58 PM

CM YS Jagan Comments at closing meeting of YSRCP plenary - Sakshi

ప్లీనరీ ప్రాంగణమంతా కిక్కిరిసి.. జాతీయ రహదారిపై కనుచూపుమేర కనిపిస్తున్న పార్టీ శ్రేణులు

మనకు అసత్యాలు ప్రచారం చేయడం రాదు. వెన్నుపోట్ల ద్వారా అధికారంలోకి రావడం అంతకంటే రాదు. ఆ చరిత్ర మనకు లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ఎవరూ మనకు లేరు. మనకు ఉన్నదల్లా నీతి, నిజాయితీ. మాటకు ప్రాణం ఇచ్చే గుణం. నిబద్ధతతో పనిచేసే ఆలోచనలు. ప్రజలకు మేలు చేయాలనే తపన. అయినా దుష్టచతుష్టయం ప్రతి రోజూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో నాకున్న గుండె ధైర్యం మీరే. రెండు సిద్ధాంతాలు, భావాల మధ్య మనకు, వాళ్లకు జరుగుతున్న యుద్ధమిది. ఈ యుద్ధంలో న్యాయాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఈ పార్టీ మీది. జగన్‌ మీ వాడు.  

‘సంక్షేమం, అభివృద్ధి పథకాలన్నీ ఆగిపోవాలి.. వారి బాబు మాత్రమే సీఎం కుర్చీలో కూర్చోవాలన్నది దుష్టచతుష్టయం, వారి దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా లక్ష్యం. అప్పుడు చంద్రబాబు ఈనాడు కానుక, బాబు ఏబీఎన్‌ దీవెన, నారా టీవీ5 భరోసా.. లాంటి పథకాలు తీసుకొచ్చి, గతంలోలాగా దోచుకో.. పంచుకో అన్నదే ఆచరిస్తారు. ఇప్పుడు అది ఆగిందనే వీరికి కడుపు మంట. అందుకే దుష్ప్రచారం. ఈ దొంగల ముఠాతో తస్మాత్‌ జాగ్రత్త’ అని ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.
 – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో యుద్ధం మొదలైంది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుండడం ఒకవైపు, ఆ మేలు జరగకుండా ఆపాలనుకుంటున్న వారు మరోవైపు.. ఈ యుద్ధంలో మీరే నా సైన్యం.. కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదే. న్యాయాన్ని ఎలా నిలబెడతారన్నది మీ చేతుల్లోనే ఉంది’ అని వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేదలకు, దిగువ మధ్య తరగతి వర్గాలకు న్యాయం చేయడానికి వీల్లేదని టీడీపీ, దుష్టచతుష్టయం ఎలా వాదిస్తున్నాయో.. ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో గమనించాలని కోరారు.

విజయవాడ– గుంటూరు రహదారిని ఆనుకుని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ రెండవ రోజు శనివారం ఆయన ముగింపు సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. దుష్టచతుష్టయం.. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరి దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా నుంచి మనందరి ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను, మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులు, లబ్ధిదారులపై ఉందని చెప్పారు.

చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా వేసినట్లేనని ప్రజలందరికీ వివరించాలని స్పష్టం చేశారు. ఈ మూడేళ్లలోనే 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చి, రాష్ట్రంలో 85 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నందున  రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు గెలుచుకోవడమే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ లక్ష్యం సుసాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలే తన ధైర్యం.. స్థైర్యం అని.. రాష్ట్ర భవిష్యత్, కార్యకర్తల భవిష్యత్‌ బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అభిమాన సముద్రం.. ఆత్మీయ సునామీ
► విజయవాడ–గుంటూరు మధ్య ఈ రోజు ఒక మహా సముద్రం కనిపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. వర్షం పడుతున్నప్పటికీ ఏ ఒక్కరూ చెక్కుచెదరలేదు. పార్టీ కార్యకర్తలు, అభిమానుల మహాసముద్రం కనిపిస్తుంది. ఇది ఆత్మీయుల సునామీ. దశాబ్దం పాటు కష్టాలు భరించి, అవమానాలు సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఇక్కడుంది. 
► మన పార్టీ భావాలను, విధానాలను, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఈ మహాసైన్యానికి నిండుమనసుతో సెల్యూట్‌ చేస్తున్నాను. 13 ఏళ్లుగా నాపై అభిమానం చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. 

ఒక్కడితో ప్రారంభమైన ప్రయాణం..
► ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే.. 2009 సెప్టెంబర్‌ 2న దివంగత నేత, మన ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించడంతో ఇక తమకు ఎవరు దిక్కన్న భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 700 మందికి పైగా మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వీల్లేదన్న పార్టీని ఎదురించినందుకు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ రెండూ కలిసి నాపై కేసులు వేశాయి. 
► దేశంలో శక్తివంతమైన వ్యవస్థలను ఉసిగొల్పారు. అన్యాయమైన ఆరోపణలు, అరెస్టు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. అలాంటి బెదిరింపులకు జగన్‌ లొంగే వ్యక్తే అయితే.. ఈరోజు మీ జగన్‌.. మీ ముందు ఇలా ఉండేవాడే కాదు. ఆరోజు నన్ను టార్గెట్‌ చేసిన మనుషులు ఒకటి అనుకుంటే.. దేవుడి స్క్రిప్టు మరోలా రాశాడు. మరి ఈ రోజున ఆ పార్టీల పరిస్థితి ఏంటి? మన పార్టీ పరిస్థితి ఏంటి?.. అన్నది చూడండి. 
► ఆ రోజున చట్టసభల్లో మన సంఖ్యా బలం కేవలం రెండు. నేను ఎంపీగా, అమ్మ ఎమ్మెల్యేగా.. అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రయాణం ప్రారంభించాం. ఒకటితో ప్రారంభమైన ఎమ్మెల్యేల ప్రయాణం ఈ రోజు 151కి చేరింది. ఒక్కడితో ప్రారంభమైన ఎంపీల ప్రయాణం.. ఈ రోజు లోక్‌సభలో 22కు చేరింది. ఇక రాజ్యసభ సభ్యుల సంఖ్య సరేసరి. అన్యాయంగా అరెస్టు చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశారు ప్రజలు, దేవుడు. 

దేవుడి స్క్రిప్ట్‌ గొప్పగా రాశాడు
► 2014 ఎన్నికల్లో 45 శాతం ఓట్లు వచ్చి.. కేవలం 1 శాతం ఓట్ల తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా జగన్‌కు ఊపిరాడనివ్వకూడదని మళ్లీ కుట్రలు చేశారు. మనకున్న 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మంది ఎమ్మెల్యేలను, 9 మంది ఎంపీల్లో ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల మాదిరిగా కొన్నారు. పార్టీ నిర్వీర్యం అయిపోవాలి.. జగన్‌ కనపడకుండా పోవాలని కుయుక్తులు, కుతంత్రాలు చేశారు. 
► కానీ, దేవుడు మరోలా స్క్రిప్టు రాశాడు. మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసిందో.. అదే పార్టీకి మళ్లీ 2019 ఎన్నికల్లో వచ్చింది సరిగ్గా 23 ఎమ్మెల్యే స్థానాలు.. 3 ఎంపీ స్థానాలు. దేవుడు స్క్రిప్టు చాలా గొప్పగా రాస్తాడు. అది కూడా మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఎప్పటికైనా కూడా మంచే గెలుస్తుందనేందుకు ఇదే నిదర్శనం. 

మంచి చేయడంపైనే నా ఫోకస్‌
► గత ప్రభుత్వం మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, ఆ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలు నేను ఎప్పుడూ చేయలేదు. నా ఫోకస్‌ ప్రతిపక్షం మీద పెట్టలేదు. ఎంత మంచి చేస్తాం.. ఎలాంటి పాలన అందించగలుగుతామనే అంశంపై దృష్టి పెట్టాను. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు.. అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా, అధికారంలో వాటాపరంగా రెండు అంశాల్లో న్యాయం చేయడం. అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయడం.. ఇలాంటి అంశాల మీదనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.
► నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఏ మాటలు చెప్పానో.. ఆ మాటలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టాను. 
క్యారెక్టర్, క్రెడిబిలిటీయే మన పార్టీ ఫిలాసఫీ. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఐదు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించాం. ఏడాదిలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. 
► అంతకు ముందు ప్రభుత్వం గ్రామాలను దోచుకోడానికి జన్మభూమి కమిటీలు పెడితే.. మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలన చరిత్రలోనే గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టింది. ఈ రోజు వలంటీర్‌ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ స్థానిక పరిపాలనలో గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నాయి. మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా పాలనను అందించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్‌ విభజన చేశాం. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త పోలీస్‌ డివిజన్లు ఏర్పాటు చేశాం. 

చిప్‌ మైండ్‌లో, గుండెలో ఉండాలి
► 44 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం ఉన్నాయని ఢంకా భజాయించుకొని కొంతమంది చెప్పుకుంటుంటారు. నేను అడుగుతున్నా.. ఏ రోజు అయినా ఇలాంటి విప్లవాత్మక ఆలోచన వచ్చిందా ? ఎందుకంటే ప్రజల కష్టాలు, వారి బాగోగుల గురించి అర్థం చేసుకొని ఆలోచించే చిప్‌ మైండ్‌లోనూ, గుండెలోనూ ఉండాలి. 
► ఈ మధ్య చంద్రబాబు ఒక రింగ్‌ను చూపించి ఆ రింగ్‌లో చిప్‌ ఉందని చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో, మోకాళ్లలోనో, పాదాల్లోనో చిప్‌ ఉంటే లాభం లేదు. చిప్‌ ఉండాల్సింది మెదడులో, గుండెలో. అప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు వస్తాయని చంద్రబాబుకు తెలియజేస్తున్నా.

దోచుకోవడం..పంచుకోవడమే చంద్రబాబు రాజకీయం
► చంద్రబాబుకు మంచి చేయాలనే ఆలోచన, తపన లేదు. ఆయనకు ఉన్నది పదవి వ్యామోహం ఒక్కటే. అందుకే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. అప్పట్లో ఏమీ చేయలేదు. ప్రజల ఒత్తిడి మేరకు చివరకు తన నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా మార్చండని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆ రెవెన్యూ డివిజన్‌ ఇచ్చింది మన ప్రభుత్వమే. 
► కుప్పం ప్రజలకు మంచి జరగాలని చేశాం. చంద్రబాబు దృష్టిలో రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. ప్రజలను ఎలా దోచుకోవాలి.. దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలన్నదే వారికి తెలిసిన నిర్వచనం. మనకు రాజకీయం అంటే ప్రజల మీద మమకారం. అదే మన నిర్వచనం. 
► టీడీపీ అంటేనే పెత్తందారుల పార్టీ. పెత్తందారుల చేత, పెత్తందారుల వల్ల, పెత్తందారుల కోసం నడుస్తున్న  పార్టీ. చంద్రబాబు హయాంలోని తెలుగుదేశం పార్టీ భావజాలంలోనే ఏ కోశాన మానవత్వం, పేదల పట్ల మమకారం అన్నవే కనిపించవు. చంద్రబాబు పార్టీ చరిత్ర అడుగడుగునా కనిపించేది వెన్నుపోట్లు. టీడీపీ స్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఎన్నికలప్పుడు ఆయన పేరునే ఉపయోగించుకోవడం బాబుకే చెల్లింది. టీడీపీ సిద్ధాంతం వెన్నుపోట్లే.
వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కిక్కిరిసిన ప్లీనరీ ప్రాంగణం 

రెండు కళ్ల సిద్ధాంతం
► తమ పిల్లలను, తమ మనవళ్లను ఇంగ్లిష్‌ మీడియం బడుల్లో చదివిస్తారట. పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడుల్లోనే చదవాలట. ఈ టీడీపీ, దుష్టచతుష్టయం భావాలకు.. పేద పిల్లలు చదివే గవర్నమెంట్‌ బడుల్లో కూడా ఇంగ్లిష్‌ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 
► పేద కుటుంబాల పిల్లలు వారి పొలాల్లో కూలీలుగా, వారి వ్యాపారాల్లో, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేసేవారిగా 
మిగిలిపోవాలనేది ప్రతిపక్షాలు, దుష్టచతుష్టయం ఆలోచన. అణగారిన కులాలు, వర్గాలు ఏనాటికి ఎదగకూడదు అనేది చంద్రబాబు విధానం.
► ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు 8వ తరగతిలోకి వచ్చేసరికి మంచి ట్యాబ్‌ ఉచితంగా ఇచ్చి.. మార్కెట్‌లో రూ.24 వేలకుపైగా విలువ చేసే పాఠాలను ఆ పిల్లలకు ఉచితంగా అందించేందుకు బైజూస్‌ యాప్‌ను ఉచితంగా ఇస్తుంటే.. అదేం జ్యూస్‌ అని చంద్రబాబు వెటకారం చేస్తున్నారు. 
► ఇలాంటి ఉద్దేశాలు ఉన్న చంద్రబాబును ఒక్కసారి చూడండి. టీడీపీ నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం, వారి బాగు కోసం శ్రమిస్తుంది. మన ప్రభుత్వం గవర్నమెంట్‌ బడులను కార్పొరేట్‌ స్థాయికి తీసుకెళ్లేందుకు పని చేస్తుంది. 
► పేదల తల రాతలు మారాలంటే గవర్నమెంట్‌ బడుల్లో కార్పొరేట్‌ స్థాయిలో చదువులు అందాలని మనం శ్రమిస్తున్నాం. ఒక్క విద్యా రంగంలోనే తొమ్మిది పథకాలను అమలు చేస్తున్నాం. జగనన్న అమ్మ ఒడి ద్వారా ఇప్పటి వరకు మనం రూ.19,617 కోట్లు అందించాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. ఒక్క బటన్‌ నొక్కగానే 44 లక్షల మంది ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతున్నాయి. 80 లక్షల మంది పిల్లలకు మంచి జరుగుతోంది. 
► నాడు–నేడు పథకం కింద 56,703 గవర్నమెంట్‌ బడుల రూపురేఖలు మార్చడం కోసం రూ.16,352  కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మూడేళ్లలో విద్యా రంగంలో మనం ఖర్చు చేసింది అక్షరాల రూ.52 వేల కోట్లని సగర్వంగా చెబుతున్నా.
ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం జగన్‌. వేదికపై రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ముఖ్యనేతలు 

నా కష్టం.. మీ త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వమిది
► చంద్రబాబు తాను సైకిల్‌ తొక్కలేక.. తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుడిని తెచ్చుకున్నారు. నా కష్టంతో పాటు, మీ త్యాగాలు, శ్రమ పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఇది. ఈ మూడేళ్లలో తీసుకువచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవం.. రైతు, మహిళా, విద్య, వైద్యం, వ్యవసాయ, పరిపాలన రంగాల్లో విప్లవాత్మక మార్పులు.. రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా గట్టి పునాదులు వేస్తున్నాం.   
► ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడుతూ ఈ మూడేళ్లలో విద్య, వైద్య, వ్యవసాయ, పరిపాలన, సామాజిక న్యాయ విప్లవాలను తీసుకువచ్చాం. ఎక్కడా లంచాలుగానీ వివక్ష గానీ లేకుండా బటన్‌ నొక్కగానే అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అందుకే 2019 ఎన్నికల తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఫ్యాన్‌ గిర్రున తిరిగితే సైకిల్‌ చక్రాలు ఊడిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement