సాక్షి, అమరావతి: ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏప్రిల్ 1వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో అవ్వాతాతలకు ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ప్రజాభ్యుదయానికి దోహదం చేసే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది.
ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి జగన్ కృషిని మంత్రివర్గం కొనియాడింది. ప్రభుత్వ విశ్వసనీయత, పనితీరుకు ఈ సదస్సు అద్దం పట్టిందని ప్రశంసించారు. సీఎం జగన్‌ను అభినందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హర్షధ్వానాలతో ఆమోదించారు.
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను మంత్రివర్గం అభినందించింది. నూతన పారిశ్రామిక విధానం 2023–27ను కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు.
► సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లు) విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పన, సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణకు అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం. సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లను (సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్) క్లస్టర్ల వారీగా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్. మూడు మండలాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి ఏడాది కాలపరిమితితో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
► ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్ వాచ్‌మెన్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 5,388 హైస్కూళ్లలో పేరెంట్స్ కమిటీల ద్వారా వాచ్‌మెన్ల నియామకం. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున టీఎంఎఫ్ నుంచి గౌరవ వేతనం చెల్లింపు.
పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం
► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్ –2019 (యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2020) సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ (ఆర్ధిక వనరుల ప్రణాళిక, కేటాయింపు మరియు వినియోగానికి సంబంధించి) యాక్ట్ –2013 సవరణల డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్టు 2019 (యాక్టు 9 ఆఫ్ 2021) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీ కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ యాక్టు 2019 (యాక్టు 19 ఆఫ్ 2019) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్ట్ 1998 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్.
► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్ రూల్స్ సవరణకు కేబినెట్ ఆమోదం.
► ఏపీ మహిళా కమిషన్ పదవీ కాలానికి సంబం«ధించి ఏపీ వుమెన్ కమిషన్ యాక్ట్ –1998 సవరణలకు కేబినెట్ ఆమోదం. మహిళా కమిషన్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
► గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు 2022 ఆర్డినెన్స్‌కు బదులుగా ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల 2023 బిల్లు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
► ఏపీ కార్ల్– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం.
► ది మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్) అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సేప్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ బిల్లు 2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. బిల్లు ద్వారా పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం.
► ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్ 2019కు మార్పులు చేస్తూ సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
► జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960 సవరణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ అమెండ్‌మెంట్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
► ఎయిడెడ్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్ 2022 స్థానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ బిల్లు 2023కు కేబినెట్ ఆమోదం.
► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు నీటి సరఫరా పైప్‌లైన్ కోసం 29.67 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. దీంతోపాటు నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన 78.46 ఎకరాల భూమిని కూడా కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ బిల్లు 2023 ప్రతిపాదనలకు ఆమోదం.
► మున్సిపల్ యాక్ట్ సవరణలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సవరణలకు కేబినెట్ ఆమోదం.
► అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. రెండు పట్టణ స్థానిక సంస్థలు, 120 రెవెన్యూ గ్రామాలతో కూడిన 11 మండలాలతో కలిపి మొత్తం 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు కానున్న అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.
► ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్‌లో సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం. లోక్‌సభ, రాజ్యసభలో పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం సర్వీసులో ఉన్న సెక్రటరీ జనరల్ ఈ పోస్టుకు అర్హులు.
► అనపర్తి, పిడుగురాళ్ల, మైదుకూరు, మైలవరం, ఉదయగిరి, నిడదవోలు మండలాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భర్తీకి కేబినెట్ ఆమోదం. 18 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
► ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987 సవరణలకు ఆమోదం.
► రిజిస్ట్రేషన్ సేవలకు ఇ–స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. తప్పుడు రిజిస్ట్రేషన్లను నివారించేలా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సవరణకు కేబినెట్ ఆమోదం.
► ఎక్సైజ్ చట్టం సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
► ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం అన్ని దేవస్ధానాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. దేవాలయాల్లో క్షురకర్మలు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేలు కచ్చితం కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కనీసం వంద పనిదినాలు నమోదైన వారికి ఇది వర్తింపు.
► పట్టాదార్ పాస్‌బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం.
► ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (అప్‌డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్) ఆర్డినెన్స్ 2022 లో సవరణలకు కేబినెట్ ఆమోదం.
► మచిలీపట్నంలో 220 గజాల స్థలం మదర్సాకు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి అభినందనలు
అంతర్జాతీయంగా ఉర్రూతలూగించిన నాటు...నాటు పాట ద్వారా ఆస్కార్ అవార్డు సాధించిన “ఆర్‌ఆర్‌ఆర్’’ చిత్ర యూనిట్‌ను మంత్రివర్గం అభినందించింది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ బృందానికి కేబినెట్ అభినందనలు తెలియచేసింది.
Comments
Please login to add a commentAdd a comment