AP CM YS Jagan Chaired a Meeting of the Road Safety Council! - Sakshi
Sakshi News home page

AP News: సీఎం జగన్​ అధ్యక్షతన రోడ్​ సేఫ్టీ కౌన్సిల్​ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోదం

Published Mon, Feb 14 2022 4:33 PM | Last Updated on Mon, Feb 14 2022 9:15 PM

CM YS Jagan Conducts AP Road Safety Council Meeting - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం రహదారి భద్రతా మండలి (ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ సేఫ్టీ కౌన్సిల్‌) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పలు కీలక అంశాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణాలు తదితర అంశాలను సీఎంకు అధికారులు వివరించారు. అనంతరం అధికారులకు కొన్ని సూచనలు చేసిన సీఎం జగన్​.. కీలక నిర్ణయాలు కొన్నింటి అమలుకు ఆమోదం సైతం తెలిపారు.

ప్రమాదాలకు గురైన వారి ప్రాణాలు కాపాడటం, నిర్ణీత సమయంలో ఆస్పత్రులకు చేర్చడంలో ‘108’ కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్​ జగన్​కు తెలియజేశారు. గోల్డెన్‌ అవర్‌లోగా వారిని ఆస్పత్రులకు చేర్చడంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయన్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 1190 బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించామని, అందులో 520 స్పాట్స్‌ను రెక్టిఫై చేశామని అధికారులు వివరించారు. ఆర్‌ అండ్‌ బీ నిర్వహిస్తున్న నేషనల్​ హైవేల్లోనూ 78 బ్లాక్‌ స్పాట్స్‌ను  రెక్టిఫై చేసినట్లు అధికారులు తెలిపారు.

సీఎం వైఎస్​ జగన్​ సూచనలు
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం సహకారంతో కలిపి ఒక డ్రైవింగ్‌ స్కూలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్​ జగన్​ అధికారులకు సూచించారు. అలాగే ఈ సదుపాయాలను ఆర్టీసీ వినియోగించుకోవడంతో పాటు, డ్రైవింగ్‌ శిక్షణ కోసం కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. 

ట్రామా కేర్‌ సెంటర్లను కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కళాశాలల్లో కూడా ట్రామా కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు అందించాలన్న సీఎం. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా వైజాగ్‌లో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఇక తిరుపతి బర్డ్‌ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ సదుపాయాల్ని మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలకు అధికారులు పలు కారణాలు వివరించగా.. సీఎం జగన్​ పలు సూచనలు సైతం చేశారు. ప్రమాదాలను నివారించేందుకు రోడ్డుపై లేన్‌మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా చూడాలని,  బైక్‌లకు ప్రత్యేక లేన్, ఫోర్‌వీల్‌ వాహనాలకు ప్రత్యేక లేన్స్‌ ఏర్పాటుపై ఆలోచన చేయాలని తెలిపారు. అలాగే ఎంత స్పీడులో పోవాలనే దానిపై సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్లు పక్కన ధాబాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూస్తూ.. ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని అధికారులకు సీఎం సూచించారు. ప్రధాన రహదారులు, ముఖ్యమైన రోడ్ల పక్కన యాక్సెస్‌ బారియర్స్‌ ఉండాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారుల్ని సీఎం జగన్​ కోరారు.

అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ విధానాన్ని పునఃసమీక్షించాలన్న సీఎం వైఎస్​ జగన్​.. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా ఏర్పాటవుతున్న కమిటీలు కూడా రోడ్డు ప్రమాదాలపై సమీక్ష చేయాలని, ఆశించిన ఫలితాలు రావాలంటే జిల్లా కమిటీలు తీసుకుంటున్న చర్యలపై కూడా అధికార గణం సమీక్ష చేయాల్సిందేనని కోరారు సీఎం​.

పలు నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్‌
రోడ్‌ సేఫ్టీ  మీద లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటుకు పచ్చ జెండా. పోలీసు, ట్రాన్స్‌పోర్ట్, హెల్త్‌ & రోడ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి నిపుణులు ఇందులో ఉంటారు.

రోడ్‌ సేఫ్టీ ఫండ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌

ప్రమాద బాధితులకు చికిత్స కోసం క్యాష్‌లెస్‌ ట్రీట్‌ మెంట్‌ అందేలా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితాలోకి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం

రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చే వారిపట్ల మంచి ప్రోత్సాహం అందించాలన్న సీఎం జగన్​.

ఐరాడ్‌ యాప్‌ వినియోగించుకుని ప్రమాదాలపై లైవ్‌ అప్‌డేట్‌ పొందేలా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి

పీపీపీ పద్ధతిలో రవాణాశాఖద్వారా ఆటోమేటెడ్‌ ఎఫ్‌సీ టెస్టింగ్‌ ఏర్పాటుపై కార్యాచరణ.

రోడ్డు ప్రమాద బాధితులకు బీమా పరిహారం దక్కేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. 

ఈ సమీక్షా సమావేశంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, లా సెక్రటరీ వి సునీత, రవాణాశాఖ కమిషనర్‌ పి సీతారామాంజనేయలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement