జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ | CM YS Jagan Decision On YSR Congress Party Plenary | Sakshi
Sakshi News home page

జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ

Published Thu, Jun 2 2022 6:04 AM | Last Updated on Thu, Jun 2 2022 8:28 AM

CM YS Jagan Decision On YSR Congress Party Plenary - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్సార్‌సీపీ ప్లీనరీని నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహించే పార్టీ ప్లీనరీని గుంటూరు – విజయవాడ రహదారిపై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2017 జూలై 8, 9న జరిపిన ప్రదేశంలోనే ఇప్పుడు కూడా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రతిష్టాత్మకంగా ప్లీనరీ : విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జూలై 8వ తేదీన ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ జరుగుతుందన్నారు.

పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అందరూ సమష్టిగా పనిచేయాలనేది సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్ష అని చెప్పారు. ఐకమత్యానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, వర్గాలను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. దీనిని గుర్తించి నేతలందరూ ఐకమత్యంతో ముందుకు నడవాలని చెప్పారు.

పార్టీ కమిటీలకు పేర్లు సూచించండి
పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలకు పేర్లు సూచించాలని చెప్పారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం లభిస్తుందని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పార్టీ పటిష్టత కోసం పాటు పడే వారిని సూచించాలనేది సీఎం జగన్‌ ఆకాంక్ష అని వివరించారు.

ఈ పేర్లను జూన్‌ పదో తేదీ నాటికి జిల్లా అధ్యక్షుల ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ తయారు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కమిటీల నిర్మాణం చూడాలన్నారు. రీజనల్‌ కోఆర్డినేటర్లు కూడా వారి పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీలను ప్లీనరీలో ప్రకటిస్తారని వివరించారు. సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం బూత్‌ కమిటీలకు కూడా పేర్లను పంపాలని కోరారు. 

జగన్‌ పాలన పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అద్భుతమైన ప్రజా స్పందన లభిస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారనే విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమెందన్నారు. సీఎం జగన్‌ నాయకత్వం పట్ల ప్రజలు అచంచలమైన విశ్వాసంతో ఉన్నారనేది కూడా స్పష్టమైందన్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని తెలిపారు. ప్రజల్లో సీఎం జగన్, వైఎస్సార్‌సీపీకి ఉన్న ఆదరణను ఈ బస్సు యాత్ర కళ్లకు కట్టిందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌కు పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement