సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం జగన్.. విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటుపై చర్చించారు. అలాగే కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కలిశారు.
కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సీఎం జగన్ భేటీ అరగంట పాటు కొనసాగింది. సమావేశంలో ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు.
చదవండి: పెండింగ్.. పరిష్కరించండి
కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం సుమారు గంటపాటు సాగింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సీఎం జగన్.. కేంద్ర మంత్రికి తెలిపారు.
సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌కారిడర్ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందని సీఎం జగన్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని కేంద్రమంత్రికి వివరించారు. విశాఖ నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని మంజూరు చేయాలని సీఎం జగన్ కోరారు.
►
Comments
Please login to add a commentAdd a comment