ప్రజలతో మమేకమవుదాం: సీఎం జగన్‌ | CM YS Jagan directed ministers in AP Cabinet Meeting | Sakshi
Sakshi News home page

ప్రజలతో మమేకమవుదాం: సీఎం జగన్‌

Published Tue, Mar 8 2022 3:21 AM | Last Updated on Tue, Mar 8 2022 12:55 PM

CM YS Jagan directed ministers in AP Cabinet Meeting - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాబోయే రెండేళ్లు ప్రజల్లోనే ఉందాం. జనంతో మమేకమవుతూ.. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిద్దాం. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. వీలైనంత త్వరలోనే వైఎస్సార్‌ఎల్పీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలకు భవిష్యత్‌ కార్యాచరణ వివరిస్తానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండా అంశాలు ముగిసి, అధికారులు వెళ్లిపోయిన అనంతరం మంత్రులతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేశామని, దానిపై ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ఆరంభమవుతుందని వివరించారు. అధికారంలోకి వచ్చిన 33 నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పారు. కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ, సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.

రాబోయే రెండేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని సూచించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించాలని సూచించారు. గడప గడపకూ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలని ఉద్బోధించారు. చేసిన అభివృద్ధిని వివరించి, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. ఈ భవిష్యత్‌ కార్యాచరణను ఎమ్మెల్యేలకు వివరించడానికి  వైఎస్సార్‌ఎల్పీ సమావేశం నిర్వహిస్తామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement