అంతరాలపై 'విద్యా యుద్ధం' : సీఎం జగన్‌ | CM YS Jagan On Education Poor People at India Today conference | Sakshi
Sakshi News home page

అంతరాలపై 'విద్యా యుద్ధం' : సీఎం జగన్‌

Published Thu, Jan 25 2024 4:28 AM | Last Updated on Thu, Jan 25 2024 8:58 AM

CM YS Jagan On Education Poor People at India Today conference - Sakshi

ఇండియా టుడే సదస్సులో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ప్రశ్నలకు బదులిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘పేదరిక నిర్మూలన నాణ్య­మైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ము­తాను. అది ప్రతి ఒక్కరి హక్కు కావాలి. పేద పిల్లలు తెలుగు మీడియంకు పరిమితమైతే, సంప­న్నుల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదు­వుతున్నారు. సంపన్నులకు అందే నాణ్యమైన చదువులు పేద పిల్లలకూ అందాలన్నదే మా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ రెండో రోజు కార్యక్రమంలో బుధవారం సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు.

పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి వారి గురించి ఎవరూ పట్టించుకోరని, ఇది దురదృష్టకరమని అన్నారు. అయితే పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో దారిద్య్రం పోతుందని నొక్కి చెప్పారు. పది మంది నిరుపేద విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమెరికాకు పంపించడమే కాకుండా వైట్‌హౌస్‌కు కూడా తీసుకెళ్లడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు, పథకాలు చాలా ఆకర్షిస్తున్నాయని ఈ సందర్భంగా రాజ్‌దీప్‌ అభినందించారు. రాజ్‌దీప్, సీఎం వైఎస్‌ జగన్‌ మధ్య జరిగిన సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి. 

రాజ్‌దీప్‌: నిజంగా ఇంగ్లిష్‌ మీడియం, తెలుగు మీడియం మధ్య ఉన్న గ్యాప్‌ను అంత సులభంగా మార్చగలరా? దానివల్ల పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాదా?  

సీఎం జగన్‌:  గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏకపక్షంగా ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చడం లేదు. 
ప్రతి ఒక్కటీ ఒక పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ఒక సమగ్ర విధానంలో కొనసాగుతోంది. ప్రతి పుస్తకాన్ని బైలింగ్యువల్‌.. అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రిస్తున్నాం. ఇంకా బైజూస్‌ కంటెంట్‌ను కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో అనూహ్య మార్పులు చేస్తున్నాం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఆరో తరగతి నుంచి, ఆపై తరగతుల్లోని ప్రతి క్లాస్‌రూమ్‌లో ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌) ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు 62 వేల తరగతులు ఉండగా, ఇప్పటికే 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశాం. మిగిలిన తరగతి గదుల్లో వచ్చే నెల చివరి నాటికి ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఆ విధంగా ఒక ప్రణాళికా బద్దంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పుల దిశలో పని చేస్తున్నాం. బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్, టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపు, బైజూస్‌ కంటెంట్, తరగతి గదుల్లో ఐఎఫ్‌పీల ఏర్పాటు.. ఇలా వీటన్నింటి వల్ల ప్రాథమిక విద్యా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నే కాకుండా.. పిల్లలు 8వ తరగతిలోకి వచ్చే సరికి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇస్తున్నాం.   

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ : విద్యా రంగంలో ఇంత మంచి చేస్తున్నా, ప్రచారానికి ఎందుకు దూరంగా ఉంటారు?  
సీఎం జగన్‌ : ఇండియా టుడే జర్నలిస్టులు ఇక్కడి స్కూల్స్‌ సందర్శించి, అభివృద్ధి పనులు స్వయంగా చూడడం ఎంతో ఆనందంగా ఉంది. అందుకు మీకు అభినందనలు. ఇక్కడ మేము ఏయే పనులు చేశామనేది చెప్పుకోవడం కాకుండా, మీరు స్వయంగా చూడడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

రాజ్‌దీప్‌ : సాధారణంగా అన్ని ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలపై ఎక్కువగా వ్యయం చేయవనే విమర్శలు వినిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా మీరు ఈ రెండు రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, వాటిని అభివృద్ధి చేసి చూపించాలనుకుంటున్నారా?

సీఎం జగన్‌ : పేదరిక నిర్మూలనకు నాణ్యతతో కూడిన విద్య అనేది కీలకమని నేను గట్టిగా నమ్ముతాను. విద్యా హక్కు అనేది ఇంకా నినాదంగా మిగలకూడదు. నాణ్యతతో కూడిన విద్య అనేది హక్కుగా మారాలి. నిరుపేదలు ఒక చదువుకు పరిమితమైతే, సంపన్నుల పిల్లలు వేరే చదువులు చదువుతున్నారు. నిరుపేద పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవడం, అది కూడా కేవలం తెలుగు మీడియంలోనే చదవడం.. మరోవైపు ధనికులైన పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియంలో చదవడం సరికాదు. నిరుపేదలు, ధనికుల మధ్య కొనసాగుతున్న ఈ వ్యత్యాసం, తేడా తొలగాలి. ధనికుల మాదిరిగా నిరుపేద పిల్లలు కూడా చదవాలి. వారికి ఆ విధంగా విద్యను అందించాలి. ఆ ఆలోచన నుంచి వచ్చినవే ఈ మార్పులు. మా ప్రభుత్వం ఆ దిశలోనే పని చేస్తోంది. నిరుపేద పిల్లలకు కూడా అత్యుత్తమ నాణ్యతతో కూడిన విద్య, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన కొనసాగాలి. 

రాజ్‌దీప్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, మూడో తరగతి నుంచే గ్లోబల్‌ విద్య, టోఫెల్‌లో శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి నేత కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. 

సీఎం జగన్‌: ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మారుస్తున్నారని విమర్శలు చేస్తున్న వారందరినీ నేను ఒక్కటే అడుగుతున్నాను. వారి పిల్లలు, వారి మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు? వారిని తెలుగు మీడియం స్కూళ్లకే పంపిస్తున్నారా? అదే నా సూటి ప్రశ్న. ఇంగ్లిష్‌ మీడియం వైపు నా చొరవను ప్రశ్నించే ముందు.. ముందుగా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. 

రాజ్‌దీప్‌ : 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి మీరు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు ఇచ్చారు. ఇకపై కూడా ఇది కొనసాగుతుందా?

సీఎం జగన్‌: రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9 తరగతి పిల్లలందరి వద్ద ట్యాబ్‌లు ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాం. నా పుట్టిన రోజు సందర్భంగా నేను స్వయంగా స్కూళ్లకు వెళ్లి, పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నాను. అది నాకెంతో ఇష్టం, సంతోషం కలిగిస్తోంది. ఇది ప్రతి ఏటా కొనసాగుతుంది.

రాజ్‌దీప్‌: ప్రభుత్వ యంత్రాంగంలో ఏదీ అంత త్వరగా మారదు, ఇది అందరికీ తెలుసు. కానీ కేవలం పెద్ద నగరాల్లోనే ప్రతిష్టాత్మక స్కూళ్లలో ఉన్న ‘ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌’ (ఐబీ) సిలబస్‌ను మీరు తీసుకువస్తున్నారు. దీని ప్రభావం ఎంత వరకు ఉంటుంది?

సీఎం జగన్‌: రాష్ట్రంలో ఐబీ సిలబస్‌కు సంబంధించి ఎస్సీఈఆర్‌టీ (స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌)తో ఈ నెల 31న ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. తొలి ఏడాది.. అంటే 2024–25 విద్యా సంవత్సరంలో కేవలం టీచర్ల సామర్థ్యం పెంపుపైనే పనిచేస్తాం. తర్వాత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రతి ఏడాది.. ఫస్ట్‌ క్లాస్‌తో మొదలు ఒక్కో తరగతికి ఐబీ సిలబస్‌ అమలు చేస్తాం. ఆ విధంగా 10 ఏళ్లలో.. అంటే 2035లో ఇక్కడి ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు, పదో తరగతిని ఐబీ సిలబస్‌తో పూర్తి చేస్తారు. ఆ సిలబస్‌తోనే పరీక్ష రాస్తారు. వారికి ఐబీ సర్టిఫికెట్‌ కూడా వస్తుంది. దీనివల్ల వారు ప్రపంచంలో పోటీని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. నాణ్యతతో (క్వాలిటీ) కూడిన విద్య లేకపోతే మన పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడలేరు. వారు జీవితంలో ఎదగలేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ఉంటేనే వారు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంతో పోటీ పడగలరు. అయితే ఈ అవకాశం కేవలం ధనికుల పిల్లలు.. ప్రైవేటు స్కూళ్లలో చదువుకున్న వారికే కాకుండా, నిరుపేద పిల్లలకు కూడా ఉండాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది.

రాజ్‌దీప్‌:  మీరు ఆశిస్తున్నట్లు ఆ పిల్లలను ఆ స్థాయిలో తీర్చి దిద్దేలా టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం ఉందా?  

సీఎం జగన్‌: ఐబీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో కలిసి పని చేస్తున్నాయి. వారు మాతో కలిసి పనిచేసేలా ఐబీ డైరెక్టర్‌ జనరల్‌తో నేను స్వయంగా మాట్లాడాను. వారు రాష్ట్ర ఎస్సీఈఆర్‌టీతో ఒప్పందం చేసుకుని, వారితో భాగస్వామ్యం అయ్యాక.. మాతో పూర్తి స్థాయిలో కలిసి పని చేస్తారు. వారు ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారికంగా ఆఫీస్‌ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఇక్కడ వారి భాగస్వామ్యం వస్తుంది కాబట్టి మేము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా 2035 నాటికి మా పిల్లలు (గవర్నమెంట్‌ స్కూళ్ల విద్యార్థులు) 10వ తరగతి పరీక్షలు ఐబీ సిలబస్‌లో రాస్తారు. తొలి ఏడాది టీచర్ల నైపుణ్యం, సామర్థ్యం పెంచుతాం. ఆ తర్వాత ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి, ఒక్కో ఏడాది ఒక్కో తరగతిలో ఐబీ సిలబస్‌ ప్రారంభించి, ఆ పిల్లలు 10వ తరగతి చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

రాజ్‌దీప్‌: ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది కదా? అందుకు తగిన నిధులు ఉన్నాయా?  

సీఎం జగన్‌: ఇది ప్రభుత్వ ప్రాజెక్టు, మా లక్ష్యం ఏమిటన్నది ఐబీకి కూడా స్పష్టంగా తెలుసు. అందుకే వారు మాతో భాగస్వామ్యం అవుతున్నారు. అందుకే వారు వ్యాపార ధోరణితో కాకుండా, మా లక్ష్య సాధనలో మాతో కలిసి పని చేస్తున్నారు. ఆ మేరకే అవగాహనకు వచ్చాం. అందుకే ఖరీదైన స్కూళ్ల మాదిరిగా, మేము ఐబీకి రాయల్టీ వంటివి చెల్లించడం లేదు. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఐబీ సిలబస్‌తో చదివి పోటీ ప్రపంచంలో దీటుగా నిలబడాలన్న మా ప్రభుత్వ లక్ష్య సాధనలో, ఐబీ కూడా పూర్తి భాగస్వామి అవుతోంది. ఇక నిధులకు సంబంధించి చూస్తే.. ఇప్పటికే స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మొదలైంది. మొత్తం రూ.14 వేల కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే రూ.8,300 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రంలో 44 వేల స్కూళ్లు ఉండగా, నాడు–నేడు తొలి దశలో ఇప్పటికే 15,575 స్కూళ్లలో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పించాం. నాడు–నేడు రెండో దశలో 16 వేలకు పైగా స్కూళ్లలో పనులు సాగుతున్నాయి. వచ్చే మార్చి నాటికి ఆ పనులు పూర్తవుతాయి. దీంతో రాష్ట్రంలో రెండో వంతు స్కూళ్లలో పూర్తి మౌలిక వసతులు ఏర్పడతాయి. మిగిలిన స్కూళ్లలో వచ్చే ఏడాదిలో పనులు చేపట్టి పూర్తి చేస్తాం.

రాజ్‌దీప్‌: 2018లో రాష్ట్రంలో ప్రాథమిక విద్యా రంగంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) 84.48 శాతం ఉండగా.. అప్పుడు జాతీయ స్థాయి సగటు జీఈఆర్‌ 99.21 శాతం ఉంది. ఇప్పటి పరిస్థితి ఏమిటి? మీ పిల్లల డ్రాపవుట్స్‌ తగ్గకుండా ఏం చర్యలు తీసుకున్నారు?

సీఎం జగన్‌ : అప్పట్లో జీఈఆర్‌లో మా రాష్ట్రంలో దేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. 29 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు ఏడింటిలో చూస్తే.. మా రాష్ట్రం జీఈఆర్‌లో దారుణంగా 32వ స్థానంలో ఉండింది. అలాంటి పరిస్థితుల్లో అన్ని కోణాల్లో ఆలోచించి, వినూత్న చర్యలు మొదలుపెట్టాం. పిల్లలు స్కూళ్లకు ఎందుకు వెళ్లడం లేదన్న కారణాలు తెలుసుకున్నాం. ఆ దిశలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాం. అందులో కీలకమైంది మధ్యాహ్న భోజనం. దాన్ని సమూలంగా మారుస్తూ.. రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇస్తూ గోరుముద్ద అమలు చేస్తున్నాం. అమ్మ ఒడి ద్వారా.. తల్లిదండ్రులు వారి పిల్లలను బడులకు పంపేలా ప్రోత్రహిస్తున్నాం. ఫలితంగా జీఈఆర్‌ను వంద శాతానికి తీసుకెళ్లాం.   

రాజ్‌దీప్‌: తమిళనాడులో పిల్లలకు మ్యాంగో షేక్‌ ఇస్తున్నారు. ఇక్కడ మీరు వారంలో ప్రతి రోజూ ఒక్కో మెనూతో పథకం అమలు చేస్తున్నామంటున్నారు. ఇది నిజమా? మా రిపోర్టర్లు స్కూళ్లకు వెళ్లి చెక్‌ చేయొచ్చా?

సీఎం జగన్‌: నిరభ్యరంతంగా వెళ్లొచ్చు. ఎక్కడికైనా వెళ్లి చూడొచ్చు. గోరుముద్దలో ఏమేం ఇస్తున్నామో చూడొచ్చు. అదేవిధంగా పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను కూడా ప్రోత్సహిస్తున్నాం. నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్స్, 6వ తరగతి నుంచి క్లాస్‌రూమ్‌లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్, పిల్లలకు పరిశుభ్రమైన మంచినీరు, స్కూళ్లకు అవసరమైన మరమ్మతులు, పెయింటింగ్‌.. ఇలా 10 రకాల మార్పులు చేస్తున్నాం.

రాజ్‌దీప్‌: ఇది రాష్ట్రంలో ప్రతిచోటా అమలవుతోందా?  

సీఎం జగన్‌: ఇక్కడ మానిటరింగ్‌ వ్యవస్థ పక్కాగా ఉంది. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు మాత్రమే కాకుండా.. నా స్థాయిలో నేను కూడా స్వయంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాను. సీఎం స్థాయిలో ఈ ప్రక్రియలో పాలుపంచుకుని, పనిచేస్తున్నప్పుడు.. మిగిలిన యంత్రాంగం కూడా ఎలా పనిచేస్తుందో తెలుసు కదా?

రాజ్‌దీప్‌:  విద్య అనేది ఉద్యోగ, ఉపాధి కల్పన దిశలో ఉండాలనేది కూడా ఒక సవాల్‌. ఈ పరిస్థితిని మీరెలా మార్చగలుగుతారు?

సీఎం జగన్‌: రాష్ట్రంలో మా ఫోకస్‌ కేవలం స్కూళ్ల మీదనే కాదు.. ఉన్నత విద్యా రంగంలో కూడా చాలా మార్పులు చేశాం. ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా కరికులమ్‌లో మార్పులు చేశాం. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశాం. వేసవి సెలవులు కూడా ఉపయోగించుకుని, ఇంటర్న్‌షిప్‌ చేసేలా అవకాశం కల్పిస్తున్నాం. అన్ని డిగ్రీ కోర్సులను అనర్స్‌గా మార్చి, నాలుగేళ్లు చేస్తున్నాం. కరికులమ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ ప్రారంభిస్తున్నాం. ఇంటర్న్‌షిప్, కరిక్యులమ్‌లో మార్పులు.. ఇవన్నీ కూడా మా లక్ష్య సాధనకు మార్గం వేస్తున్నాయి. ఎడెక్స్‌తో కూడా వచ్చే నెలలో ఒప్పందం చేసుకోబోతున్నాం. మనకు 1800 సబ్జెక్టŠస్‌ ఉన్నాయి. ఈ కోర్సులు అందించడం కోసం ఎడెక్స్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాం. కరికులమ్‌ను కూడా మారుస్తున్నాం. హార్వర్డ్, ఎల్లెస్సీ వంటి ప్రీమియమ్‌ సంస్థలను ఎడెక్స్‌ ద్వారా కోర్సులను ఆన్‌లైన్‌లో ఆఫర్‌ చేసేలా చర్యలు చేపడుతున్నాం.

రాజ్‌దీప్‌: దానికి సంబంధించి ఉదాహరణ చెప్పగలరా?

సీఎం జగన్‌: ఉదాహరణకు.. బికామ్‌ కోర్సు తీసుకోండి. ఆ కోర్సు విద్యార్థులు కూడా ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలు నేర్చుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. అవన్నీ పాఠ్య ప్రణాళికలో భాగం చేస్తున్నాం. పశ్చిమ దేశాల్లో మాత్రమే కనిపించే అంశాలను, ఇక్కడ కరికులమ్‌లో చేరుస్తూ.. పిల్లలను ఆ స్థాయిలో తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నాం. ఎడెక్స్‌ ఒప్పందం ద్వారా ఆన్‌లైన్‌ విద్యాబోధన ద్వారా.. ప్రతిష్టాత్మకమైన ఎల్లెసీ, హార్వర్డ్‌ సంస్థలు.. సర్టిఫికెట్‌ ఇస్తాయి. ఇది మా పిల్లలకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తుంది.

రాజ్‌దీప్‌: ఇక్కడ సీఎం జగన్‌ అక్షరాస్యత వృద్ధి కోసం ఎంతో చేస్తున్నారు. విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గవర్నమెంట్‌ స్కూళ్లను అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇవన్నీ మిమ్మల్ని ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తాయని అనుకుంటున్నారా? 

సీఎం జగన్‌: రాజకీయాలు వేరు. పిల్లలు, విద్యార్థులు ఓటర్లు కారు కాబట్టి, వారి గురించి ఎవరూ పట్టించుకోరు. ఇది దురదృష్టకరం. అయితే పిల్లలు మంచి విద్యావంతులైతేనే, వారికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తేనే.. సమాజంలో పేదరికం పోతుంది. పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే.. వచ్చే 10, 15 ఏళ్లలో వారు ఎంతో వృద్ధి చెందుతారు. తద్వారా సమాజం కూడా మారుతుంది.  పిల్లలకు ఈ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు, నాణ్యతతో కూడిన విద్యను అందిస్తే వారు పోటీ ప్రపంచంలో ధైర్యంగా నిలబడగలరు. ప్రపంచ స్థాయిలో పోటీ ఎదుర్కోగలరు.

రాజ్‌దీప్‌: మీ స్పష్టమైన విజన్‌ను అందరూ అభినందించాల్సిందే. మీ విజన్‌ సఫలమైతే విద్యా రంగంలో మీరు ఆంధ్రా మోడల్‌ను అవిష్కరించిన వారవుతారు. (అందరూ చప్పట్లతో అభినందించారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement