సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి ఫలించింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. 2021–22 వార్షిక ప్రణాళిక కేటాయింపులను కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ఖరారు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,869 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రంలో 25 ప్రాజెక్టుల కింద 700 కి.మీ. మేర జాతీయ రహదారులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రవి ప్రసాద్ విజయవాడలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ప్రాంతీయ అధికారి ఎస్.కె.సింగ్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ వి.రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏపీ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు రూ. 7,513 కోట్లు, తెలంగాణకు రూ. 6,211 కోట్లు కేటాయించారు.
ప్రతిపాదనల కంటే మిన్నగా..
రాష్ట్ర ప్రభుత్వం 2021–22 వార్షిక ప్రణాళిక కింద ప్రతిపాదించిన దానికంటే మిన్నగా నిధులు రాబట్ట్డడం గమనార్హం. రాష్ట్రంలో 609 కి.మీ.మేర రహదారుల అభివృద్ధికి రూ. 6,421 కోట్లు కేటాయించాలని ఆర్ అండ్ బీ శాఖ ప్రతిపాదనలను సమర్పించింది. కానీ అంతకంటే ఎక్కువగా జాతీయ రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి అధికంగా నిధులు కేటాయించింది. ఇక 2022–23 వార్షిక ప్రణాళిక కింద మరింత భారీగా నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అందుకోసం రూ.12 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తోంది.
టీడీపీ ప్రభుత్వ హయాం కంటే మిన్నగా
రాష్ట్ర విభజన అనంతరం జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యధికంగా 2021–22 వార్షిక ప్రణాళికలో కేంద్రం నిధులు మంజూరు చేసింది. అంతేకాదు.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో కంటే 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబడుతోంది. గత వార్షిక ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం మొదట రూ. 1,300 కోట్లే కేటాయించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీతో వెంటనే మాట్లాడటంతో ఆ నిధులను రూ. 2,700 కోట్లకు కేంద్రం పెంచింది.
సీఎం కృషి ఫలితంగానే అత్యధిక నిధులు
జాతీయ రహదారుల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభిృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలన్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. అందుకే ఆయన పలు దఫాలుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు జరపడంతోనే రాష్ట్రానికి అత్యధికంగా నిధులు మంజూరయ్యాయి. కేంద్రం మంజూరు చేసిన నిధుల మేరకు త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెడతాం.
– వి.రామచంద్ర, చీఫ్ ఇంజినీర్,ఆర్ అండ్ బి(జాతీయరహదారుల విభాగం)
Comments
Please login to add a commentAdd a comment